Despite the change of Assembly constituency Parthasaradhi turned victorious
నియోజకవర్గాలు మారినా విజయం వరించింది పార్థసారధి నే
2024లో గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొలుసు పార్థసారధి దీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మూడు నియోజకవర్గాల నుంచి విజయం సాధిమచి రాజకీయ అనుభవం సముపార్జించుకున్నారు. ఒకేసారి విజయం సాధించి ముగ్గురు ముఖ్యమంత్రుల మంత్రివర్గలాలలో కీలకమైన శాఖలను నిర్వహించి వున్నారు. అదే కోణంలో పయనంచి మూడు పార్టీలలో గుర్తింపు పొందిన ప్రతిభాశాలి కూడా! తండ్రి వారసత్వంగా అందివచ్చిన రాజకీయంలో కొనసాగుతున్నారు.
వీరి తండ్రి కొలుసు పెదరెడ్డయ్య అనూహ్యంగా రాజకీయాల్లో ప్రవేశించారు. మొదటి ఎన్నికల్లోనే ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించారు. వీరి రాజకీయ ప్రవేశం 1983లో జరిగింది. వీరి స్వస్థలం అప్పుడు నిడుమోలు నియోజకవర్గంలో వుండేది. రాజకీయాల్లో ప్రవేశించి శాసనసభ్యునిగా విజయం సాధించడానికి అవసరమైన ఆర్థిక స్తోమతు కలిగిన వ్యక్తి పెరెడ్డయ్య. అప్పటికి రాజకీయంగా ముందున్న కాంగ్రెసు (ఐ) పార్టీ అధినాయకత్వం పెదరెడ్డయ్యకు సీటు ఇవ్వడానికి అంగీకరించింది. అయితే వారి స్వంత నియోజకవర్గం నిడుమోలు (2009 నాటికి రద్దయి, ఇప్పుడు పామర్రు నియోజకవర్గంగా కొనసాగుతోంది) యస్.సి.లకు కేటాయించబడింది. అందువల్ల అక్కడ నుంచి పోటీ చేసే బి.సి. అయిన పెదరెడ్డయ్యకు వూలు పడలేదు. అప్పటికి మంచి గుర్తింపులో వున్న ఉయ్యూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయటానికి సిద్ధపడి, అధిష్ఠానాన్ని ఒప్పించి 1983లో ఉయ్యూరు నుంచి కాంగ్రెసు (ఐ) అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ విజయం వారికి అపురూపమని చెప్పవచ్చు. అప్పటి ఉయ్యూరు నియోజకవర్గం (2009 నాటికి రద్దయి, ఇప్పుడు పెనమలూరులో కొనసాగుతోంది) కమ్మ సామాజిక వర్గంకు మంచి గుర్తింపుగా వుంది. 1955లో ఉయ్యూరు నియోజకవర్గం ఏర్పడి, 1983 నాటికి ఆరు పర్యాయములు ఎన్నికలు జరిగిన ఆరుసార్లు విజయం సాధించింది కమ్మ సామాజిక వర్గం వారే! ఒక్క మాటలో చెప్పాలంటే వారు రాజకీయ ఉద్ధండులు. కాకాటని వెంకటరత్నం మూడు పర్యాయములు ఉయ్యూరు నుంచి విజయం సాధించారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు ఒక పర్యాయం గెలుపొందారు. 1983 నాటికి తెలుగుదేశం పార్టీ ప్రభంజనం వీస్తోంది. కాకాని వెంకటరత్నం తనయుడు రామ్మోహనరావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో వున్నారు. 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు లోక్‌దళ్ పార్టీ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. అంయటి గుర్తింపు పొందిన కమ్మ సామాజిక వర్గం నాయకుల మధ్య పెదరెడ్డయ్య కాంగ్రెసు ఐ అభ్యర్థిగా నిలిచారు. అయినా వారిద్దరినీ ఓడించారు పెదరెడ్డయ్య. వారికి 1983లో వచ్చిన మెజారిటీ 3,092 ట్లు మాత్రమే! ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలు విలీనం కావటం పెదరెడ్డయ్య బయటకు వచ్చేయటం జరిగింది.
అయినా రాజకీయాలను వదలలేదు. తెలుగుదేశం పార్టీలో చేరారు. 1999లో మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. మచిలీపట్నం నుంచి మొదటిసారి విజయం సాధించిన టి.డి.పి. అభ్యర్థిగా చరిత్ర నెలకొల్పారు. 1984లో వడ్డి రంగారావు, 1989లో బొప్పన గంగాధర చౌదరి టి.డి.పి. అభ్యర్థులుగా మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1991లో పెదరెడ్డయ్య ఓడించిన కాంగ్రెసు అభ్యర్థి ఆషామాషీ నాయకుడు కాదు. 1984, 1989ల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఓడించిన కావూరి సాంబశివరావే 1998లో తిరిగి కాంగ్రెసు అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి గెలుపొందారు.
పార్థసారధి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ రాజకీయాలను వంటబట్టించుకున్నారు. 2001 ఎన్నికల రంగంలోకి కాలుమోపారు. తండ్రి రాజకీయ లబ్ధి ప్రసాదించిన ఉయ్యూరు నియోజకవర్గంనే ఎంచుకున్నారు. అప్పటికి పెదరెడ్డయ్య తిరిగి కాంగ్రెసులో చేరారు. తండ్రి సూచనల మేరకు పార్థసారధి ఉయ్యూరు నుంచి 2001 ఉపఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీకి నిలిచారు. 1999లో అన్నే బాబూరావు టి.డి.పి. అభ్యర్థిగా విజయం సాధించి అకాల మరణం చెందటంతో 2001లో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికలో అన్నే బాబూరావు సతీమణి విజయలక్ష్మి టి.డి.పి. అభ్యర్థిగా రంగంలో నిలిచారు. బాబూరావు అకాల మరణం సానుభూతి పార్థసార్ధిని ఓడించింది. మొదటి ప్రయోగం అపజయం అందించింది. 2004లో మళ్ళీ ఉయ్యూరు నుంచే కాంగ్రెసు అభ్యర్థిగా నిలిచి టి.డి.పి. అభ్యర్థిని ఓడించారు. 2009 నాటికి ఉయ్యూరు నియోజకవర్గం రద్దవటం, పెనమలూరు నియోజకవర్గంగా మార్పు చెందటం జరిగింది. 2009లో పెనమలూరు నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా నిలిచారు, గెలిచారు. 2004లో ఉయ్యూరులో, 2009లో పెనమలూరులో ఓడించిన తెలుగుదేశం అభ్యర్థి చలసాని వెంకటేశ్వరరావు (పంజ). 2009లో కేవలం 177 ఓట్లతో పార్థసారధి విజయం సాధించారు.
2009లో పార్థసారధికి మంత్రిపదవి దక్కకపోవటం వెనక ఆ పార్టీ సీనియర్ నాయకులకు డా॥ వైయస్. రాజశేఖరరెడ్డి మంత్రి పదవులు ఇవ్వవలసి వచ్చింది. అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్, తిరువూరు నుంచి కోనేరు రంగారావులు గెలుపొందగా, 2004 నాటి మంత్రివర్గంలో చేర్చుకున్నారు. 2009లో మాత్రం కొలుసు పార్థసారధికి మాత్రమే కృష్ణాజిల్లా నుంచి మంత్రిమండలిలో స్థానం దక్కటం విశేషం. పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, విశ్వవిద్యాలయాల శాఖలకు పార్థసారధి మంత్రిగా కొనసాగారు. ఏడాది గడవక ముందే ముఖ్యమంత్రి డా॥ వైయస్. రాజశేఖరరెడ్డి మృత్యువాత పడటం, కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి కావటం చకచకా జరిగిపోయాయి. రోశయ్య మంత్రివర్గంలో కూడా పార్థసారధి అవే శాఖలు నిర్వహించారు. 2010లో నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన మంత్రివర్గంలో పార్థసారధి శాఖలు మారాయి. మాధ్యమిక, ఇంటర్‌మీడియెట్ విద్యాశాఖల మంత్రిగా కొనసాగారు. ఐదేళ్ళ వ్యవధిలో మూడు మంత్రివర్గాలలో పనిచేసిన ఘనుడిగా పార్థసారధి గుర్తింపు పొందారు.
2014 నాటికి వైసిపి వైపు నడిచారు. మచిలీపట్నం నుంచి వైసిపి అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 నాటికి పెనమలూరు విచ్చేశారు. 2019లో పెనమలూరు నుంచి వై.సి.పి. అభ్యర్థిగా పొటీ చేసి విజయం సాధించారు. ఆ విజయం వారికి సత్ఫలితాలను అందించలేదని వారి అనుయాయులు చెపుతారు. 2019లో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో కానీ, ఆ తర్వాత ఏర్పాటు చేసిన రెండవ మంత్రివర్గంలో కానీ పార్థసారధి లేకుండానే వైయస్. జగన్మోహనరెడ్డి మంత్రివర్గం రూపకల్పన చేశారు. మూడు పర్యాయములు గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవటంతో 2021లోనే మనస్థాపం చెందారు పార్థసారధి. పైగా 2024 ఎన్నికలకు ముందు పెనమలూరు నియోజకవర్గం వై.సి.పి. ఇన్‌ఛార్జ్‌గా జోగి రమేష్‌ని నియమించటంతో పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చేశారు. 2019లో తనతో పోటీ పడి ఓటమి పాలైన టి.డి.పి. అభ్యర్థి బోడె ప్రసాద్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల చంద్రశేఖర్, విజయవాడ వై.సి.పి. అధ్యక్షులు బొప్పన భవన్ కుమార్ లాంటి వారితో సంప్రదింపులు జరిపారు. కేశినేని శివనాథ్ (చిన్ని), గద్దె రామ్మోహన్, యార్లగడ్డ వెంకట్రావు, కొల్లు రవీంద్ర లాంటి టి.డి.పి. నాయకులను వెంటబెట్టుకొని వెళ్ళి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు పార్థసారధి.ఈ నాయకులంతా వెళ్ళేసరికి నారా చంద్రబాబునాయుడు ఇంటి వద్ద లేకపోవటంతో లోకేష్‌తో పసుపు కండువా కప్పించుకొని వచ్చారు. పార్థసారధి పెనమలూరు టికెట్ ఆశించి టి.డి.పి.లో చేరలేదన్నది నిర్వివాదాంశం. ఎక్కడి నుంచైనా పోటీ చేయటానికి సిద్ధపడ్డారు. టి.డి.పి. అధిష్ఠానం నూజివిడు అభ్యర్థిగా పార్థసారధిని ఎంపిక చేసింది. వెనుకా ముందులాడకుండా ‘‘సై’’ అన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగాక అక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థులు సాధించిన విజయాలు చాలా తక్కువ. 1985, 1999ల్లో కోటగిరి హనుమంతరావు, 2009లో చిన్నం రామకోటయ్యలు మాత్రమే నూజివీడు నుంచి టి.డి.పి. అభ్యర్థులుగా గెలుపొందారు. మేకా ఇంటి పేరు గల జమీందారుల కంచుకోట నూజివీడి. 1952, 1955, 1962, 1967, 1972ల్లో మేకా రంగయ్య అప్పారావు కాంగ్రెసు అభ్యర్థిగా విజయం సాధించారు. మూడు పర్యాయములు రాష్ట్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నాటికి మేకా ప్రతాప అప్పారావు ఎన్నికల రంగంలోకి దిగి 2004లో కాంగ్రెసు అభ్యర్థిగా, 2014, 2019ల్లో వై.సి.పి. అభ్యర్థిగా విజయం సాధిమచారు. జమీందారి వంశజులకు నిలయమైన నూజివీడు నుంచి పోటీ చేయటానికి పార్థసారధి వెనకడుగు వేయలేదు. ‘‘ధైర్యమే విజయంకు మూలం’’ అన్న విధంగా ముందడుగు వేసి వై.సి.పి. అభ్యర్థిని ఓడించారు. వారికి మంత్రిపదవి దక్కటానికి ‘‘నూజివీడు’’ మాత్రమే కారణమని వారి అనుయాయులు అభిప్రాయపడుతున్నారు.
దాసరి ఆళ్వారస్వామి
అనుభవ పాత్రికేయులు
చరవాణి: 93938 18199