రాకాసి అలలు – బి అలెర్ట్
కోస్తాలో రాకాసి అలలు బీభత్సం సృష్ణించబోతున్నాయని ద ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ ఫర్మేషన్ సర్వీసెస్ అంటే INCOIS తెలిపింది. గోవా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్; ఒడిషా, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్ , కర్ణాటక, గుజరాత్ అండమాన్ అండ్ నికోబాద్ దీవుల కోస్తాతీరాల్లో ఈ రాకాసి అలలు విరుచుకు పడతాయని ఆ సంస్థ తెలిపింది. దీంతో మత్స్యకారులను, ప్రజలను సముద్రతీరంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాకాసి అలలు- గురించి తెలుసుకుందాం..
కేరళలోని పలు ప్రాంతాల్లో మార్చిలో వరదలు ముంచెత్తటానికి కారణం ఈ రాకాసి అలలే. అలపుజ్జా, కొల్లాం, తిరువనంతపురం జిల్లా లు వరదతాకిడికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ వరదలను కేరళలో కల్లక్కాడల్ అని అంటారు.
ఈ అలలు సముద్రపు ఉప్పెన వల్ల ఏర్పడతాయి, అందుకే దీనికి ఉప్పెన అలలు అని కూడా అంటారు. సుదూరంగా ఏర్పడ్డ తుఫానులు, చాలా కాలం పాటు వీచిన భీకర గాలుల వల్ల కూడా ఇవి సంభవిస్తాయి. ఈ అలలు తుఫాను కేంద్రం నుంచి తీరాన్ని తాకే వరకు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. సాధారణంగా కేరళకు ఈ రాకాసి అలల నుంచి ఎక్కువగా ముప్పు ఉంటుంది. హిందూ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో బలమైన గాలులు వీచడం వల్ల సముద్రానికి ఉప్పెన ఏర్పడుతుంది. అవి తరచూ కేరళను బలంగా తాకుతాయి.
బలమైన గాలులు సముద్రంపై ప్రయాణించడంతో అల్ప పీడనం ఏర్పడు తుంది. ఈ ఒత్తిడికి రాకాసి అలలు ఏర్పడతాయి. ఇవి 11 మీటర్ల ఎత్తున ఎగసిపడి కేరళ కోస్తా తీరం, లక్షద్వీప్ ల్లో బీభత్సం సృష్టించనున్నాయి. 2020 నుంచి వారం రోజుల ముందే ఈ తరహా హెచ్చరికలను INCOIS పంపుతోంది. సునామీకి రాకాసి అలలకు తేడా ఏమిటంటే సునామీ నీటి అడుగున భూకంపాలు చోటు చేసుకోవడంతో సముద్రపు నీరు తీరంలోని 30 నుంచి 50 కిలోమీటర్ల మేర ముంచి వేస్తుంది. వేగంగా వీచే గాలుల మూలంగా రాకాసి అలలు ఏర్పడతాయి. రాకాసి అలలు కంటే సునామీ 10 రెట్లు ఉదృతంగా ఉంటుంది. ఇవి రెండూ సముద్ర తీరానికి వచ్చి బలహీన పడతాయి.