రాజ్యాంగమే ప్రమాణికం
దేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలంటే వ్యవస్థలన్ని సక్రమంగా నిర్వహించాలి. వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే వాటికి మార్గనిర్థేశనం కావాలి. అలా మార్గనిర్థేవం చేసేదే రాజ్యాంగం . భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి పదవులను అధిరోహించిన వారంతా రాజ్యాంగాన్ని అమలు చేసి ప్రజలకు భరోసా కల్పించాలి. దేశం లోని వ్యవస్థలు అధికారులు, ప్రజలు రాజ్యాంగ అధికారానికి తల ఒగ్గాల్సిందే..రాజ్యాంగమే సుప్రీం.
సార్వభౌమత్వం-ప్రజాస్వామ్యం
ఒక దేశం తీసుకునే నిర్ణయాల్లో ఇతర దేశాల ప్రమేయం ఉండకూడదు. దీనినే సార్వభౌమత్వం అంటాం. దీనిని కూడా రాజ్యాంగమే కల్పించింది. ప్రజలను పాలించే వ్యవస్థలను వాటిని నడిపించే విధానాన్ని ప్రభుత్వం అంటారు. ఇందులో రాజరికం, నియంతృత్యం , ప్రజాస్వామ్యం అనే పద్దతులు ఉన్నాయి. మనది ప్రజాస్వామం. ఇందులో ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎన్నుకున్న వ్యక్తులే ఉంటారు. అంటే పాలకులను నిర్ణయించే అధికారం ప్రజలకే ఉంటుంది.
రాజ్యాంగం-విభాగాలు
మన రాజ్యాంగంలోని వివిధ అంశాలను 22 పార్టులుగా చేశారు., ఇందులోని పాయింట్లను 395 ఆర్టికల్స్ గా ఒకే అంశంలోని లేదా వివిధ సమస్యలను ప్రస్తావించాల్సినపుడు నెంబర్లను ఇచ్చారు.ఇవే,12 షేడ్యూల్డుగా ఉన్నాయి. కాలాను గుణంగా కొత్త విషయాలను చేర్చడానికి.. అక్కరకు రాని పాత విషయాలను తొలగించడానికి రాజ్యాంగం సవరణలు చేసుకొనే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు మన రాజ్యాంగాన్ని 102 సార్లు సవరించాం. కాబట్టి కొత్త
రాజ్యాంగాన్ని రాసుకునే అవసరం రాబోదు.
రాజ్యాంగం ముందు మాటను రాజ్యాంగ ప్రవేశిక లేదా ప్రియాంబుల్ అంటారు.
భారత ప్రజలమైన మేము, భారతదేశాన్ని సర్వసత్తాక సామ్య వాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక , ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని అంతస్తుల్లోనూ, అవకాశాల్లోనూ, సమానత్వాన్ని చేకూర్చడానికి వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైఖ్యతను సంరక్షిస్తూ, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవడానికి మన రాజ్యాంగ పరిషత్ లో 1949 నవంబర్ 26న ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము.
పై ముందుమాటను భారత రాజ్యాంగానికి ఆత్మగాను.. హృదయంగాను పిలుస్తారు. ఇందులోనే ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, కోరికలు స్పష్టంగా తెలిపారు. దీని ప్రకారం భారత దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడింది.
రాజ్యాంగ హక్కులు
రాజ్యాంగం మనకు చాలా హక్కులను ఇచ్చింది.. వాటిలో సమానత్వపు హక్కు,స్వేచ్ఛా హక్కు, మనలను పీడన నుంచి కాపాడే హక్కు, మత స్వాతంత్య హక్కు,రాజ్యాంగ పరిరక్షక హక్కులున్నాయి. వీటినే ప్రాథమిక హక్కులు అని కూడా అంటాం…రాజ్యాంగం ప్రకారం పేద-ధనిక, కుల మతాల లింగ బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ సమానమే.. అంటరాని తనాన్ని రాజ్యాంగం నిషేధించింది. అందుకోసం 1955 చట్టాన్ని సవరించి 1976లో పౌరహక్కుల చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ గా రూపొందించారు. రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కులకు భంగం కలగకుండా సుప్రీంకోర్టు అడ్డుకుంటుంది.
లౌకికత్వం-ప్రయోజనాలు
భారత రాజ్యాంగం ఏ మతాన్నిఅధికార మతంగా గుర్తించదు. అన్ని మతాలను సమ దృష్టితో చూస్తుంది. దేశంలోని పౌరులు ఏ మతానైనా స్వేచ్ఛగా అనుసరించే హక్కు కల్పించింది. దీనినే సెక్యులరిజం లేదా లౌకికత్వం అంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో లౌకికత్వం ఒక బూతు పదంగా చూస్తున్నారు. కారణం దీనిపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడమే.. లౌకికత్వం వల్ల మతాల మధ్య సుహృద్భావం నెలకొని శాంతి సామరస్వాలు ఏర్పడతాయి. దీంతో దేశం త్వరితగతిన అభివృద్ది చెందుతుంది. అంతేకాకుండా ఏకులమైనా ఏమతమైనా మనమంతా ఒకే జాతి అనగా భారత జాతిగా సమైఖ్యంగా కలసి ఉండగలం. లేదంటే ఘర్షణ వాతావరణం ప్రగతి నిరోధకంగా మారుతుంది.
మత స్వేచ్చ- మైనారిటీ హక్కులు
మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులురాజ్యాంగంలోని ఆర్టికల్ 25 భారతదేశ పౌరులందరికి మతస్వేచ్ఛను ప్రసాదిస్తోంది. ఆర్టికల్ 27 మత నిర్వహణా స్వేచ్ఛ, ఆర్టికల్ 28 మత బోధన లేదా ఆరాధనకు హాజరుకావడానికి స్వేచ్ఛ ఇస్తాయి. ఆర్టికల్ 30 మైనారిటీల విద్యాసంస్థలు నెలకొల్పడానికి హక్కు ఇస్తోంది. 19వ ఆర్టికల్ భావప్రకటనా స్వేచ్ఛను ఇస్తుంది. దీని ఆధారంగానే ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలు పనిచేస్తాయి. ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కుల అమలుకు రాజ్యాంగ పరిష్కారాలు సూచిస్తాయి. మన హక్కులకు భంగం వాటిల్లితే ప్రజాప్రయోజనాలకేసులు, లేదా కేసులను సుమోటోగా తీసుకున్న కోర్టులు ప్రభుత్వాలను హెచ్చరిస్తాయి. కోర్టులకు ఈ అధికారాన్ని కూడా రాజ్యాంగమే కల్పించింది. మతం పేరుతో కల్లోలాలు సృష్టించడం,సమానత్వాన్ని దెబ్బతీయడం, ఇతరుల హక్కులను కాలరాయడం శిక్షార్హం.
శాస్త్రీయ విద్య ప్రాముఖ్యత
దేశ బాలలందరికీ 6 నుంచి 14 ఏళ్ల వరకు నిర్భంధ ఉచిత విద్యను అందించాలని 2002లో రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇందుకోసం ఆర్టికల్ 21 (ఏ)ను రూపొందించారు. ఆర్టికల్ 51ఎ(హెచ్) ప్రకారం మన విద్యావిధానం శాస్త్రీయ దృక్పదం కలిగి, పరిశీలన, సంస్కరణలతో కూడిన, మాతవత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలి. లేకుంటే ఉత్తరప్రదేశ్ హత్రాస్ లో తమ స్కూల్ మంచి విజయాలను సాధించాలని యాజమాన్యం రెండవ తరగతి విద్యార్థిని బలి ఇవ్వడం వంటి దారుణ వార్తలను మళ్లీ మళ్లీ చదవాల్సి వస్తుంది. లేదంటే ముందుతరాలకు బాబాలు, స్వాములను ఉత్పత్తి చేసే పాఠశాలలను రూపొందించినట్లవుతుంది.
రిజర్వేషన్లు
వేలాది ఏళ్ల నుంచి సామాజిక వివక్షను ఎదుర్కొనే అట్టడుగుస్థాయి ఎస్సీ, ఎస్టీలకు వెనుకబడిన వర్గాలకు , మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు విద్య, ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు గౌరవంగా బ్రతకాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఏదైన కేటగిరిలో చాలా తక్కువ మార్కులకు ఉద్యోగం వచ్చిందంటే వాళ్లలో విద్యావకాశాలు తక్కువని,ఆర్థికంగా వెనుకున్నారని గుర్తించి వారికి మెరుగైన అవకాశాలు కల్పించాలి. అంతేకాని వారిని కించపరిచేలా మాట్లాడకూడదు. దేశం అభివృద్ది చెందాలంటే అన్ని వర్గాల ప్రాతినిధ్యం తప్పనిసరి.
పాఠ్యాంశంగా రాజ్యాంగం
మన హక్కులు బాధ్యతలు తెలుసుకోవాలంటే రాజ్యాంగాన్ని చదవడం తప్పనిసరి. దేశంలో మొదటిసారిగా కేరళలోని విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి పాఠశాల పాఠ్యాంశంగా రాజ్యాంగాన్ని చేర్చారు. ఆపై చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లు కూడా రాజ్యాంగ ప్రియాంబుల్ ను పాఠ్యాంశంగా చేర్చాయి. 2013లో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిని ప్రతిపాదించినప్పటికీ అధికారులు దానిని అమలు చేయడంలో విఫలం చెందారు. దేశంలోని విద్యార్థులందరికీ రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.