విద్యుత్తు వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
> రైతులకు ఆడిగిన వెంటనే విద్యుత్తు కనెక్షన్లు
> ఎపిఎస్ పిడిసిఎల్ యాప్స్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర ఇంధన శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి
తిరుపతి, నవంబరు 6: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ, గనులు, భూగర్భ వనరుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. ఎపిఎస్పిడీసీఎల్ నూతనంగా రూపొందించిన రైతునేస్తం, వాట్సాప్, చాట్ట్ అప్లికేషన్లతోపాటు ఆధునీకరించిన ఎపిఎస్పిడిసిఎల్ వెబ్సైట్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతి లోని రాష్ట్ర ఇంధనశాఖా మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ విద్యుత్తు వినియోగదారులు సేవల్లో ఆలస్యాన్ని నివారించేందుకు వీలుగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని తెలిపారు. ఈ సంస్కరణల్లో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొట్టమొదట ఎపిఎస్ఎడిసిఎల్లో బోట్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. అలాగే వినియోగదారుల సౌలభ్యంకోసం వాట్సాప్ (91333 31912) సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వీటిద్వారా వినియోగదారులు నేరుగా చాట్ చేసి తమ సమస్యలను అధికారులు/సిబ్బంది దృష్టికి తీసుకురావడం ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించుకోవచ్చని సూచించారు.
అలాగే రైతుల సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతులు అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయాలనే లక్ష్యంతో రైతునేస్తం అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రైతులు సర్వీసును పొందేందుకు దరఖాస్తు చేసినప్పటి నుంచి సర్వీసు మంజూరయ్యేంత వరకు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించేందుకు అవకాశం వుంటుందన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్ణీత సమయంలోగా దరఖాస్తును పరిశీలించనట్లయితే వెంటనే ఆ దరఖాస్తు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగిన్ కు వెళ్తుందని, అక్కడి నుంచి నిర్ణీత సమయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ లాగిన్లకు దరఖాస్తు చేరుతుందన్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి ప్రతి స్థాయిలోనూ వినియోగదారులకు సంక్షిప్త సందేశాలను రిజిస్టర్డ్ మొబైల్కు పంపించడం జరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియ ద్వారా సర్వీసును విడుదల చేయడంలో జాప్యాన్ని పూర్తి స్థాయిలో నివారించేందుకుఅవకాశం వుంటుందన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పెండింగులో వున్న 1.15 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఈ ప్రభుత్వం మంజూరు చేసిందని, ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు 3.70లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేశామని, 16వేల దరఖాస్తులు మాత్రమే ప్రస్తుతానికి పెండింగులో వున్నాయని తెలిపారు. వ్యవసాయ సర్వీసులకోసం గత ప్రభుత్వం 1,478 కోట్ల వ్యయం చేయగా, ప్రస్తుత ప్రభుత్వం నాలుగన్నరేళ్ళ కాలంలోనే 2,400 కోట్ల వ్యయంతో రైతులకు సేవలందించడం జరుగుతోందని వివరించారు. ఎపిఎస్పిడిసిఎల్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఇంధనశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిల ఆదేశాలకు అనుగుణంగా సంస్థ పరిధిలో అధికారులు, సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు వీలుగా వివిధ అప్లికేషన్లను రూపొందించామని తెలిపారు. రైతులు వ్యవసాయ విద్యుత్తు సర్వీసుకు దరఖాస్తుచేసిన వెంటనే త్వరితగతిన సర్వీసును మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సర్వీసుల కోసం రైతులు విద్యుత్తు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. క్షేత్ర స్థాయిలో పాడైపోయిన, కాలిపోయిన నియంత్రికలను తక్షణమే మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, ఎపిఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.ఎన్. బాబు, ఎన్.వి.ఎస్. సుబ్బరాజు, కె. శివప్రసాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.