కవి కరీముల్లా సామాజిక వ్యాసం
———————————————
ఇస్లాం అనేది ఒక మతమా ?
————————————–
ఆదిలో ఏ మతం లేదు.దైవం మనిషిని సృష్టిస్తే మనిషి మతాన్ని సృష్టించాడు.బలహీనుల్ని దోచుకునే కుయుక్తులతో బలవంతుడు మతాన్ని తయారు చేశాడు.దైవం మతాన్ని సృష్టించలేదు.తన ప్రవక్తల ద్వారా జీవన విధానం మాత్రమే చూపాడు. సర్వసృష్టి మొత్తం ఏ శక్తి అధీనంలో ఉందో ఆ శక్తికి మాత్రమే తల వంచడం,మరే ఆధిపత్య శక్తికి తలవంచకపోవడం మాత్రమే ఉన్నది.మనిషి భూమిపై ఉన్న సకల సంపదపై కొందరి పెత్తనాన్ని ఆమోదించక పోవటం, భూమిపై,దాని సంపదపై మనుషులందరూ సర్వ సమాన హక్కులు కలిగి ఉండటం మాత్రమే ఉన్నది.ఈ భావజాలం ప్రపంచంలో ఏ రూపంలో,ఏ భాషలో ఉన్నా అది ఇస్లామే.ఇస్లాం అనేది కేవలం ఒక అరబ్బీ పదం మాత్రమే.
ఇస్లాం అంటే ఏమిటి? ఇస్లాం అనే అరబ్బీ పదానికి శాంతి, సన్మార్గం, దైవవిధేయత అని అర్ధం. ఇస్లాం మానవులందరి హృదయాలలోనూ శాంతిని, ప్రేమను నెలకొల్పేందుకు ఆవిర్భవించిన ధర్మం .ఇది మతం కాదు. సర్వ మానవుల కొరకు దైవం చూపిన జీవన విధానం. దైవం సృష్టించిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గాలి, వెలుతురు ఎలాగైతే ఒక మతానికీ, వర్గానికీ, ప్రాంతానికీ, జాతికీ చెందిన కావో అదేవిధంగా ఇస్లాం కూడా ఏ ఒక్కరి సొత్తుకాదు. ఇది సర్వ మానవులకు చెందిన పకృతి ధర్మం. ఇస్లాం ధర్మం దైవప్రవక్త ముహమ్మద్(స) కాలంనుండి మొదలైందనే అపోహ చాలామందిలో ఉంది. ఇస్లాంను పరిమితం చేసే తమ కుట్రలో భాగంగానే యూరోపియన్లు మహమ్మదీయులు అనే పదాన్ని ప్రచారం చేశారు.ప్రవక్త ముహమ్మద్ (స) నుండి ఇస్లాం మొదలు కాలేదు.ఆది నుండీ ఉంది.గత ప్రవక్తలు ప్రవచించిన విషయాలనే ఆయన పునరుద్ఘాటించారు. ఇస్లాం ఆదిమానవుని పుట్టుక నుండి మొదలైన ధర్మం. ఈ భూమిపై ఉన్న అన్ని జాతులలోనూ వివిధ కాలాల్లో, వివిధ ప్రాంతాలలో, ప్రజలకు మార్గం చూపేందుకు దైవం తన ప్రవక్తలను పంపించారు. వీరు తాము పుట్టి పెరిగిన ప్రాంతాల భాషలలోనే దైవ సందేశం ప్రజలకు చేరవేశారు. ఈ దైవ సందేశాన్నే చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ (స) తాను పుట్టి పెరిగిన ప్రాంతంలోని అరబ్బీ భాషలో “ఇస్లాం” అన్నారు. ప్రవక్తల పరంపరలో వచ్చిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్(స) కేవలం ముస్లింల ప్రవక్త కాదు. సర్వ మానవాళికి మార్గంచూపేందుకు వచ్చిన విశ్వ ప్రవక్త.పవిత్ర ఖుర్ఆన్ ఏ ఒక్క మతానికి చెందింది కాదు. ఇది సర్వ మానవాళికి హితోపదేశం చేయడానికి వచ్చిన చివరి దైవ గ్రంధం.
ఇస్లాం ఏం చెప్తుంది? : ఇస్లాం మానవులందరి దైవం ఒక్కడేనని బోధిస్తుంది. ఆయన మాత్రమే అన్ని ఆరాధనలకు
అర్హుడని, ఆయన జననం, మరణం లేనివాడని, ఆయన ఎవరికీ సంతానం కాదని ఆయనకు ఎవరూ సంతానం లేదని ఆయన ఈ భూమిపై ఎవరికీ జన్మించడని ఈ సకల చరాచర సృష్టి మొత్తం ఆయన ఆధీనంలోనే ఉన్నదని చెప్తుంది. అంతేకాక మనుషులు సృష్టించుకున్న కులం, మతం ప్రాంతం, జాతి, భాష అనే అన్ని అడ్డుగోడలకు ఆయన అతీతుడని విశద పరుస్తుంది. మానవులంతా పరస్పరం సోదరులేనని ఒకరు ఎక్కువ మరొకడు తక్కువ కాదని, తల్లిదండ్రులను సేవించ వలెనని, అనాధల పట్ల, వితంతువుల పట్ల ఆదరణ కలిగి ఉండవలెనని, సదా సత్ శీలం, సత్ ప్రవర్తన కలిగి హింసా దౌర్జన్యాలకు దూరంగా ఉండాలని వ్యభిచారం వడ్డీ దరిదాపులకు కూడా పోరాదని తాఖీదు చేస్తుంది.
ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం: ఇస్లాం అంటేనే శాంతి అని అర్థం. ఇస్లాం ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తుంది. అన్యాయంగా చిందింపబడే ప్రతి నెత్తుటి బొట్టుకు అల్లాహ్ వద్ద తీర్పు దినాన సమాధానం ఇచ్చుకోవలసి ఉంటుందని స్పష్టం చేస్తుంది. దైవం సృష్టించిన ప్రకృతి మనుషులందరిని సమ భావంతో ఆదరిస్తున్నపుడు మతం పేరుతోనో కులం పేరుతోనో హింసా దౌర్జన్యాలకు పాల్పడే అధికారం మనిషికి లేదని చెప్తుంది.
“ఒక మానవుడ్ని చంపిన వాడు సమస్త మానవుల్ని చంపినట్లే
ఒక మానవుడి ప్రాణాలు కాపాడిన వాడు మొత్తం మానవుల ప్రాణాలు కాపాడినట్లే” పవిత్ర ఖుర్ఆన్ (5:32)
ఇతరుల ధన, ప్రాణాలకు నష్టాన్ని కలిగించేవాడు నిజమైన దైవ విశ్వాసి కాజాలదు – దైవ ప్రవక్త ముహమ్మద్ (స) అలాగే పర ధర్మములను దూషించరాదని, ద్వేషించరాదని, ప్రలోభపరచి లేదా బలవంతంగా మత మార్పిడులు చేయరాదని ఇస్లాం బోధిస్తుంది.
“హింస ద్వారా పర ధర్మాన్ని అణచటం రక్తపాతంకంటే అత్యంత తీవ్రమైనది” – పవిత్ర ఖుర్ఆన్ (2:217,218) “ ధర్మం విషయంలో నిర్భంధం కానీ, ఐలాత్కారం కానీ లేవు” పవిత్ర ఖుర్ఆన్ (2:256)
ప్రేమస్వరూపి అయిన దైవప్రవక్త ముహమ్మద్ (స) మక్కా వాసులచే అతి క్రూరంగా హింసించబడినా ఆయన వారిపై ప్రేమను కురిపించారు. చివరికి తనకు అత్యంత ఆప్తుడైన బాబాయిని చంపి ఆయన పొట్టను చీల్చి కాలేయాన్ని నమిలిన దుర్మార్గులు తన చేతికి చిక్కినప్పటికీ క్షమించి వదిలేశారు. మహాప్రవక్త ముహమ్మద్ (స) చూపిన ఈ క్షమాగుణమే ప్రేమ తత్వమే మొత్తం ప్రపంచాన్ని జయించింది. ఆ కారణంగానే ఆయన బోధనలు విశ్వ వ్యాపితమయ్యాయి.