ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా
ప్రధాని మోడీ జంగిల్ సఫారీ
ప్రధానమంత్రి మోడీ మార్చి 1 నుంచి మూడు రోజుల పాటు గుజరాత్ పర్యటనలో ఉన్నారు. మార్చి 3న ప్రపంచ వన్య ప్రాణుల దినోత్సవం సందర్బంగా రాష్ట్రం జునాఘడ్ జిల్లాలోని ఆసియా సింహాలకు నెలవైన గిర్ జాతీయ వన్యప్రాణుల అభయారణ్యంలో జంగిల్ సఫారీని ఆస్వాదించారు. ఈ భూమిపై జీవవైవిధ్యం, వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రధానమంత్రి మోడీ అన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా, ఈ భూమి అద్భుతమైన జీవవైవిధ్యాన్ని కాపాడటానికి మన అంకితభావాన్ని ప్రకటిద్దాం’ అని ప్రధాని ప్రకటించారు. కాగ.. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వామ్యులు అవ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అంతరిస్తున్న జాతుల భవిష్యత్తును రక్షించండి అని ఆయన ప్రజలకు పిలుపు నిచ్చారు. వన్యప్రాణులను కాపాడటంలో భారతదేశం చేస్తున్న కృషికి గర్విస్తున్నట్లు తెలిపారు.
గిర్ జాతీయ ఉద్యానవనంలో ఆసియా సింహాలకు సంబంధించిన ‘ప్రాజెక్ట్ లయన్’ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2900 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధి ద్వారా ఆసియా సింహాల సంరక్షణ జరుగుతుంది. ప్రస్తుతం ఆసియా సింహాలు కేవలం గుజరాత్‌లోనే ఉన్నాయి. ఇవి 9 జిల్లాల్లోని 53 తాలూకాల్లో దాదాపు 30 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తున్నాయి. జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాలియాలో వన్యప్రాణుల కోసం ‘జాతీయ రిఫెరల్ సెంటర్’ కూడా నిర్మిస్తున్నారు. అలాగే, వన్యప్రాణులను ట్రాక్ చేయడానికి గిర్ నేషనల్ పార్క్‌లో ఒక పర్యవేక్షణ కేంద్రం, ఆసుపత్రిని నిర్మించారు.
లయన్ సఫారీ ఆస్వాదించాక జాతీయ వన్యప్రాణి బోర్డు 7వ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. జాతీయ వన్యప్రాణి బోర్డులో CDS, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, NGO ప్రతినిధులు, వన్యప్రాణి అధికారులు, రాష్ట్ర కార్యదర్శులు సహా 47 మంది సభ్యులు హాజరయ్యారు. సమావేశం తర్వాత, ప్రధాని మోడీ గిర్ జాతీయ ఉద్యానవన మహిళా ఉద్యోగులతో ముచ్చటించారు. అంతరించే ప్రమాదంలోని జంతువులను అభయారణ్యాలలో సంరక్షిస్తారు. వీటిని సందర్శించేందుకు ప్రజలకు అనుమతి ఉంటుంది. అభయారణ్యాలు ఆవశ్యకత, జంతువుల ఆరోగ్యం, పర్యావరణం, జీవవైవిధ్యం వంటి విషయాలపై పరిశోధనలకు ఇక్కడ అవకాశం ఉంటుంది. 2017 నాటికి దేశంలో 543 అభయారణ్యాలున్నాయి.
తెలంగాణలో మొత్తం 9 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. కవ్వాల్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం: ఇది ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని వైశాల్యం 892.31 చ.కి.మీ. ఇది మహారాష్ట్రలోని తడోబా అంథేరి టైగర్ రిజర్వ్, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వులను ఆనుకుని ఉంటుంది. ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం: ఇది మంచిర్యాల జిల్లాలో ఉంది. శివారం అభయారణ్యం: మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉంది. ఏటూరు నాగారం అభయారణ్యం: ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. రాష్ట్రంలో పురాతన అభయారణ్యం. దీనిగుండా గోదావరి నది ప్రవహిస్తుంది. ఇందులో రాక్షస గుహలు, చారిత్రక యుగానికి చెందిన శిలాధారాలు లభించాయి. పాకాల అభయారణ్యం: మహబూబాబాద్, వరంగల్ రూరల్ జిల్లాల్లో విస్తరించి ఉంది. కిన్నెరసాని అభయారణ్యం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది.
అమ్రాబాద్ అభయారణ్యం: దీన్ని రాజీవ్‌గాంధీ వైల్డ్‌లైఫ్ సాంక్చువరీ అంటారు. ఇది నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ అభయారణ్యాన్ని 1978లో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాగా, 1983లో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించారు. రాష్ట్ర విభజనలో దీన్ని కూడా విభజించారు. రాష్ట్ర ప్రభుత్వం అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తిస్తూ 2015, ఫిబ్రవరి 6న ఉత్తర్వులు జారీ చేసింది. ఇది కృష్ణానది పరీవాహక ప్రాంతం వెంబడి విస్తరించి ఉంది. ఇందులో 15 పులులు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ 48, ఆర్టికల్ 51(ఏ)లను అనుసరించి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించింది. ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ కోసం 1952లో ‘ఇండియన్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్’ అనే సంస్థను ఏర్పాటు చేసింది. దీనికి ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు.1972లో వన్యప్రాణుల సంరక్షణ చట్టాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలయ్యేట్లు చేశారు. ఇందులో భాగంగా 1973, ఏప్రిల్ 1 నుంచి జాతీయ జంతువుగా పులిని ప్రకటించారు.