Chandrababu swearing in Ceremony at 11.27am on 12th jun-2024
Chandrababu : 12న చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్తం ఉ.11.27
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమవుతోంది.
గన్నవరం మైదానంపై టీడీపీ నేతల మొగ్గు
అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు గన్నవరం వద్ద కీసరపల్లిలో ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ భారీ కార్యక్రమానికి అనువైన ప్రదేశం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు, అధికారులు శుక్రవారం స్థలాన్వేషణ చేశారు. రాజ్‌భవన్‌లో కాకుండా బహిరంగ సభలో, ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసుకొన్నారు. ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. ప్రజలు కూడా భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ కార్యక్రమం నిర్వహణ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ ముఖ్య నేత టీడీ జనార్ధనరావు, పార్టీ జోనల్ సమన్వయకర్త సత్యనారాయణ రాజుతోపాటు కొందరు అధికారులు శుక్రవారం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రికి సమీపంలోని తాడేపల్లి వద్ద సిమెంటు ఫ్యాక్టరీ ఏరియా మైదానంతోపాటు, కృష్ణా జిల్లా గన్నవరంలో కేసరపల్లి వద్ద ఉన్న మరో మైదానాన్ని వారు చూశారు. వాటిలో కేసరపల్లి వద్ద ఉన్న మైదానం జాతీయ రహదారి పక్కన ఉంది. విమానాశ్రయం నుంచి అతి దగ్గరగా ఉండడంతో విఐపీల రాకపోకలకు అనువుగా ఉంటుందన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమైంది. తాడేపల్లి వద్ద ఉన్న మైదానానికి వెళ్లే రోడ్డు అంత విశాలంగా లేకపోవడం వల్ల రాకపోకలకు ఇబ్బంది ఉంటుందని, సెక్యూరిటీ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం ఉందని కొందరు నేతలు భావించారు. దీనిపై శనివారం తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఉంటుందని టీడీపీ వర్గాలు తెలిపాయి.