సముద్రంలో కాకి రెట్ట
తెలుగు సినీ సాహిత్యంలో
దాదాపుగా యాభై ఏళ్ల నుంచీ సినిమా పాటల్లో చూస్తే “ప్రేమ” “మొహం” ప్రథమ స్థానం లో ఉంటాయి , ప్రేమ పాటల భావజాలాన్ని అంటువ్యాధిలాగ వ్యాపింపజేయటమే కాకుండా , సినిమా రైటర్లు సిగ్గులజ్జ వదిలేసి శృంగారం పేరుతో పచ్చి బూతులు రాస్తున్న బుద్ధి జ్ఞానం లేకుండా ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారు ? వ్యక్తి పూజ ఎక్కువ, వ్యక్తిత్వం తక్కువ కనుక. భాష తక్కువ ఫేషన్ ఎక్కువ కనుక. .సిమాలు బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నంతకాలం ఒక లా ఉన్నాయి రంగులు వచ్చిన తరువాత సినిమాలు తమ రంగు మార్చుకున్నాయి. హంగులు వచ్చిన ( యానిమేషన్ , స్పెషల్ ఎఫెక్ట్స్ ) తరువాత పొంగులు చూపుతూ డబ్బు పిండుకుంటూ ఆర్ధిక పరంగా పెరిగినా సాహిత్యపరంగా బాగా దిగజారిపోయాయి. టెక్నాలజీ ఎంత ఎత్తు పెరిగిందో మాత్రమే చూసేవారికి సాహిత్యం , విలువలు ఎంత దిగజారిపోయాయో తెలియవు.
శరీరం పని చేయడానికి తిండి ఎంత ముఖ్యమో మనసు పనిచేయడానికి ఆలోచన అంత ముఖ్యం ఆ ఆలోచనల కే మరో పేరు భావజాలం. చెడ్డ తిండి తింటే ఆరోగ్యం చెడటం ఖాయం, చెడ్డ భావజాలం వింటే కూడా మానసిక ఆరోగ్యం చెడటం ఖాయం.
సాహిత్యం జోలికి పోకుండానే పాత బాగుందనేవారు ఎక్కువ.
సినిమాలో పాట అంటే సాహిత్యం ఒక్కటే కాదు. సాహిత్యం చివరిమెట్టు నాయిక నాయకీ మణులు ,వారి దుస్తులు మరియు వేషధారణ. నృత్యాలు , అంగాగా ప్రదర్శన , వెనుక సంగీతము ఈ అన్ని మెట్లు ఎక్కిన తరువాత ఆ చివరి మెట్టు కి చేరుతాము. అంటే ఇవన్నీ ప్రేక్షకులని ప్రభావితం చేస్తాయి. శ్రోతల్ని బేక్ గౌండ్ మ్యూజిక్ బాగా ప్రభావితం చేస్తుంది అబ్బా ఏ ఆర్ రెహమాన్ బాదేసాడురా అని మెచ్చుకుని పాట బాగుంది అంటారు. ప్రేక్షకులని నాయిక నాయకీ మణుల వేషధారణ నృత్యాలు ప్రభావితం చేస్తాయి. మావాడు నృత్యాలు ( స్టెప్పులు ) అదరగొట్టేసాడు అని మెచ్చుకుని పాట బాగుందనేస్తారు.
భాషే రాదు మొర్రో అనేవాడికి సాహిత్యం ఏంటి?
శశివదనే శశివదనే స్వరనీలాంబరి నీవా ? అంటూ పాట పాడితే దానర్థం ఎంత మందికి తెలుస్తుంది? తెలియని వారు వినేది దరువుల మోతే. ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన అంటూ వ్రాస్తే ఆ భాషా స్థాయి కి ఎంత మంది చేరుకోగలరు. చిన్న పిల్లలకి పెద్దల బాష అర్థం అవ్వదు కనుక వారికి అర్థం అయ్యే భాషలో పెద్దవాళ్ళు మాట్లాడినట్టు జనాలకి అంత భాష అర్థం అవ్వదు కనుక జనాలకి అర్థం అయ్యే భాషలో రాసేస్తున్నారు. కాకపొతే చిన్న పిల్లలకు బూతులు నేర్పడం ఎంత తప్పో సామాన్య జనాలకు బూతులు నేర్పడం కూడా అంత తప్పే. ?
బూతులను ఎవరు ఆదరిస్తున్నారు?
చదువు రానివారు సభ్యత లేనివారు. వీరికి మంచి భాష అర్థం అవ్వదు కనుక వీరికి పరిచయమున్న బ్రాండ్ నేమ్స్ ని కూడా పాటల్లో చొప్పించి కాల్ గేట్ టూత్ పేస్ట్ అక్షింతలుగా అని మొదలెట్టి యమహా బైక్ , నైక్ షూ అంటూ పాటలు రాసేస్తున్నారు. కాలేజీ స్టైలే అంటూ మొదలెట్టి , కోకోకోలా, కేట్ వాకింగ్ అంటూ పాటలు పుట్టుకొస్తున్నాయి
ప్రేమ మోహం గురించి పాటలు ఎక్కువ.
మోహాన్ని వ్యక్తపరిచే పాత పాటల్లో ఆడా మగా మొహాన్ని ఇలా వ్యక్తపరిచేవారు ..రాంబా ఊర్వశి తలదన్నే రమణీ లాలామె ఎవరీమె … ఇంద్రుడి చంద్రుడి అందాలు; మధువొలకబోసే నీ చిలిపి కళ్ళు; అప్పట్లో మోహాన్ని సున్నితంగా సభ్యంగా సెక్స్ కి బదులుగా వలపు అని రాసే వారు , ప్రకృతిని పూవులు తుమ్మెదలని ఉపమానాలు గా తీసుకుని మోజు ( కామ కోరిక) రతి క్రీడని వర్ణించేవారు. గూడుపుఠాణి లో పాట “తనివి తీరలేదే నా మనసు నిండ లేదే .. విరిసిన అందాల లోతులో చూసిననూ అంటూ క్లాస్ టచ్ ఇచ్చారు. తరువాత కాలం లో వానొచ్చిందంటే వరదొస్తాది, వయసొచ్చిందంటే వలపొస్తాది, నువ్వు రెడి రెడి… శోధించనా పరిశోధించనా…పరువాల పారాయణా కొనసాగించనా… మృదువైన మదనార్చనా ఇటువంటి మాటలతో డోస్ బాగా పెంచారు
కామాన్ని వ్యక్తపరిచే పాటల్లో ముఖ్యమైనది ప్రియురాలి అందాలని వర్ణించడం , ఆమె పై కామాన్ని, వర్ణించడం , రమ్మని పిలవడం ఉదాహరణకు ఎదురులేని మనీషి లో ఎం టీ ఆర్ వాణిశ్రీ యుగళ గీతం ” కసిగా ఉంది కసి గా ఉంది కలవక కలవక కలసినందుకు కస్సుమంటోంది, నీ కండలు చూస్తే గుబులు పుడుతోంది , నీ ఛాతీ చూస్తే నిన్న రాత్రి గుర్తుకు వస్తోంది” సెక్స్ కోరికల్ని తీర్చుకుందామని ప్రతిపాదించడం సాధారణమే అన్నట్టు రాసేశారు ” సోగ్గాడు చిత్రం లో చలి వేస్తోంది చంపేస్తోంది రారా కప్పుకుందాం” అనే పాట కామాన్ని చాలా నేరుగా ఏ అడ్డు లేకుండా రాసేశారు ఇదంతా మంచి సాహిత్యం అనే అనుకోవాలా ? పచ్చి బూతు అనుకోవాలా?
పచ్చి అంటే అడ్డులేని అని అర్థం. మనం సమాజంలో బట్టలు తొడుక్కుని తిరుగుతాం . అలాగే మన ఆలోచనలకుకూడా బట్టలు తొడగాలి. బాగా ఆదరిస్తుండంతో
పచ్చిబూతు కాస్తా బండ బూతుగా ….
పచ్చి బూతుతో కోరికల తీవ్రతను తెలియజేసేరు అక్కడితో (పచ్చి బూతుతో) తృప్తి చెందక బండబూతు కి దిగజారి బావలు సాయ్యా మరదలు సయ్యా, అటు అమలాపురం ఇటు పెద్దాపురం చెయ్యి పట్టి లాగుతారు ఆంధ్రా జనం అంటూఅంటూ ఆంధ్రులంతా స్త్రీ కనిపిస్తే చెయ్యి పట్టుకుని లాగే వారే అని అర్థం వచ్చే లా రాసేశారు. “ఊ అంటావా ఉ ఊ అంటావా” “రాత్రికొస్తావా ఎంతిమ్మంటావ్?” ఏంటీ సాహిత్యం?
ఒక తరం లో, పువ్వులతో లతలతో పోలుస్తూ ఎంతో సున్నితంగా స్త్రీ అందాలను వర్ణించే వారు కాస్తా మరో తరం లో బండగా , నీ కళ్ళు పేలిపోను చూడకే ఆలా హాయ్ హాయ్ హాయ్ . చివరకి “కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ, అలవాటు లేని సుఖమా” అంటూ ఈ బూతు పతాకస్థాయికి చేరి అందరికీ అదే సుఖం అనిపించేలా తయారయ్యింది తెలుగు సినీ సాహిత్యం.
జల్లెడకన్నీ కన్నాలే అన్నట్టు తెలుగు పాటల్లో సింహ భాగం బూతులే. మంచి పాటలు లేవని కాదు సముద్రంలో కాకి రెట్ట. శృంగారం లో, భాషలో సున్నితత్వం ఉండాలి . శృంగారాన్ని అంగీకరించని మనిషి ఉండడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా అలాగే భాష కూడా భగవంతుడి స్వరూపమే.
అది దిగజారిపోతే మన సమాజ స్వరూపం కూడా దిగజారిపోతుంది.