వన్స్ మోర్ వైయస్ జగన్
బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట
సీఎం వైయస్ జగన్‌కు నీరాజనం.. రోడ్డుపైకి తరలి వచ్చిన గ్రామాలకు గ్రామాలు
మేలు చేసిన జననేతకే తమ ఓటు అని స్పష్టీకరణ
ఏం చూసి చంద్రబాబుకు ఓటేయాలని నిలదీత
ఎన్ని జెండాలు జత కట్టినా వారు చిత్తే..
తామంతా అన్ని విధాలా ఆదుకున్న ఈ ప్రభుత్వం వెంటే..
ఎలుగెత్తి చాటిన చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజానీకం
బస్సు యాత్ర దారిపొడవునా అందరి నోటా ఇదే మాట
‘అవ్వా.. చెప్పులేసుకో. లేదంటే కాళ్లు కాలుతాయి’ అని మనువరాలు చెబుతున్నా వినిపించుకోకుండా.. ‘ఆ చెప్పులతోనేమి.. బిర్నా రా ఆ సామి వెళ్లిపోతాడేమో’ అంటూ వృద్ధురాలు అలివేలమ్మ వేగంగా పొలంలో నుంచి రోడ్డు మీదకు వచ్చింది. అటుగా బైక్ మీద వెళుతున్న వ్యక్తిని ఆపి.. ‘ఎంత వరకు వచ్చాడు?’ అని ఆరా తీసింది. ఇంకా రాలేదు.. వస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు.
ఈ లోపు మనవరాలు అలివేలమ్మ దగ్గరకు వచ్చి.. ‘చెబితే వినవు.. సీఎం జగన్ రావడానికి ఇంకా చానాసేపు పడుతుంది. చెట్టునీడకు రా..’ అని పిలవగా.. ‘ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా.. కొద్దిసేపు ఇక్కడ నిలబడితే ఏం కాదులే.. ఐదేళ్ల క్రితం ఇదే దారిలో వెళుతుంటే కలిశాను. అధికారంలోకి వస్తావ్ అని అప్పట్లో చెప్పాను.. అనుకున్నట్టే సీఎం అయ్యాడు. మాటిచ్చినట్టే ఇంటి దగ్గరకే పెన్షన్ పంపాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తున్నాడు. మళ్లీ నువ్వే అధికారంలోకి వస్తావ్ అని ఆ సామికి చెబుతానమ్మి..’ అంటూ అవ్వబదులిచ్చింది.
చిత్తూరు జిల్లా సదుం ఎస్టీ కాలనీకి చెందిన ఎం.మునెమ్మకు వందేళ్లు ఉంటాయి. స్వతహాగా నడవలేదు, నిల్చోలేదు. అయినప్పటికీ ఎంతో ఓపికగా ఉదయం నుంచి సదుం నుంచి కల్లూరుకు వెళ్లే రహదారి పక్కన కుర్చీలో కూర్చుని ఉంది. ఎక్కువసేపు నువ్ కూర్చోలేవ్ ఇంట్లో పడుకుందువ్ రా.. అని మనవడు పిలిచినా వినడం లేదు. ఆమె గంటల తరబడి అక్కడే వేచి ఉండటానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఈ రోడ్డు మీదుగా సీఎం జగన్ వస్తున్నారని, ఆయన్ని ఓ సారి చూద్దామని ఎదురు చూస్తోందని ఆమె మనవడు తెలిపాడు. ఇలా అలివేలమ్మ, మునెమ్మల తరహాలో ఎందరో వృద్ధులు.. మహిళలు, వికలాంగులు, విద్యార్థులు, రైతులు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడిని చూడటానికి పోటీపడ్డారు.
వివిధ సంక్షేమ పథకాల ద్వారా తమకు అండగా నిలిచిన నేతను కళ్లారా చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘తమను అన్ని విధాలుగా ఆదుకున్న మీకే మా మద్ధతు.. ఎన్ని జెండాలు జత కట్టినా మరోసారి చంద్రబాబు మా చేతుల్లో చిత్తవ్వడం ఖాయం’ అని సీఎం జగన్‌కు ప్రజలు తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లెలో బస శిబిరం నుంచి బుధవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఏడో రోజు యాత్రను ప్రారంభించారు.
శిబిరం నుంచి బయటకు వస్తుండగానే అమ్మగారిపల్లె గ్రామస్తులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చిన మహిళలు బంతి పూల వర్షం కురిపించారు. మంగళ హారతులు పట్టి జననేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం సదుంలోకి ప్రవేశించిన సీఎంకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనసందోహం ఆత్మీయ స్వాగతం పలికింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం కల్లూరు వైపు బయలుదేరిన రోడ్‌షోకు మార్గంమధ్యలో వివిధ గ్రామాల ప్రజలు సంఘీభావం తెలిపారు.
పెత్తందార్లకు ఓటు వేయం…
బహిరంగ సభ అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాదంకి, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా రాత్రి 9 గంటలకు గురువరాజుపల్లెలో ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిపై యాత్రగా వెళుతున్న సీఎం జగన్‌కు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ప్రజాభిమానం అడ్డు పడటంతో నిర్ధేశించిన షెడ్యూల్ కంటే ఎంతో ఆలస్యంగా యాత్ర సాగినప్పటికీ.. ప్రజలు మాత్రం ఎంతో ఓపికగా సీఎం రాక కోసం వేచి ఉన్నారు.
అభిమాన నేతను చూసి ఎంతో సంతోషపడ్డారు. రోడ్లపై బారులు తీరిన వారిలో ఎవ్వరిని కదిలించినా.. ‘వన్స్‌మోర్ సీఎం జగన్’ అన్న నినాదమే వినిపించింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న నేత వైఎస్ జగన్‌కు కాకుండా.. పెత్తందారులకు కొమ్ముకాసే చంద్రబాబు, ఆయన తొత్తులకు ఏ విధంగా ఓటు వేస్తాం అంటూ ప్రజలు గర్జించారు.
చంద్రగిరి నియోజకవర్గానికి ముందే ఉగాది
పుంగనూరు నియోజకవర్గం నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దామలచెరువులో సంబరాలు అంబరాన్ని అంటాయి. సీఎం రాక నేపథ్యంలో చంద్రగిరి నియోజకర్గ ప్రజలకు ముందే ఉగాది పండుగను తెచ్చిపెట్టాయి. దామలచెరువులో ఊరంతా అరటి ఆకులు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించి, సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. అక్కచెల్లెళ్లు సీఎంకు హారతులు పట్టి, గుమ్మడికాయలతో దిష్టి తీశారు. కోలాటం, చెక్కభజన సహా వివిధ కళారూపాలతో మహిళలు పలికిన ఆత్మీయ స్వాగతం అబ్బుర పరిచింది.
ఎర్రటి ఎండను ఏ మాత్రం లెక్క చేయకుండా వేల సంఖ్యలో ప్రజలు దామలచెరువుకు చేరుకున్నారు. రోడ్డు అంతా జనాలతో కిటకిటలాడింది. మధ్యాహ్నం ఒంటి గంట దాటాక దామలచెరువు చేరుకున్న సీఎం.. ఎరట్రి ఎండలోనే బస్ పైకి ఎక్కి ఊరంతా రోడ్ షో నిర్వహించారు. సీఎం కాన్వాయ్‌తో పాటు సమాంతరంగా నడుస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవడానికి మేమంతా సిద్ధం అంటూ ప్రజలు నినదించారు. అనంతరం పూతలపట్టుకు పయనమైన సీఎంకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
ఐరాల మండలం గుండ్లపల్లి, కొలకలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు యాత్రకు సంఘీభావం తెలిపారు. పూతలపట్టు నియోకవర్గం తేనెపల్లి వద్ద సీఎం జగన్ భోజన విరామ శిబిరానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో విరామ శిబిరం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి, రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
నేను విన్నాను.. నేను ఉన్నాను
చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల కిందట పెరాలసిస్‌కు గురయ్యాడు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న తల్లిదండ్రులకు ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. అతని వైద్యానికి మరో రూ.15 లక్షలు అవసరం అవుతాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఎంను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని ముఖేష్ తల్లి నమ్మింది. ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసింది.
సీఎం వైయస్ జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని ముఖేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖేష్ వివరాలను తీసుకోవాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం అంది, మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.
అభిమానం చాటుకున్న ముస్లిం మైనార్టీలు
ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచి, ఆ వర్గాలకు రాజకీయంగా తగు ప్రాధాన్యం ఇచ్చిన సీఎం జగన్ తమ ఊరికి వస్తుండటంతో తెల్లవారుజాము నుంచే కల్లూరు గ్రామంలో సందడి నెలకొంది. సీఎం జగన్ గ్రామానికి చేరుకోగానే మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మత పెద్దలు ముస్లిం సంప్రదాయం ప్రకారం సీఎంకు శాలువ కప్పి, హిమామ్ జామీన్ కట్టి ప్రార్థనలు నిర్వహించి, ఆశీర్వదించారు. అనంతరం బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకుసాగారు. ఆ తర్వాత కల్లూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కురుబ సామాజికవర్గం ఆత్మీయ సమావేశానికి సీఎం హాజరయ్యారు.