మధ్యలో ఆగిపోయిన ‘యర్రగొండపాలెం’
యర్రగొండపాలెం నియోజకవర్గం 1955లో ఏర్పాటైనా, 1972 తర్వాత 2009 వరకు ఎన్నికలు నిర్వహించబడలేదు. 1952లో దీనికి మాతృక అయిన కంభం నియోజకవర్గం 2004 తర్వాత రద్దయింది.
1955లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన నక్కా వెంకయ్య, 1952లోనే మార్కాపురం నియోజకవర్గం నుంచి కె.ఎల్.పి. అభ్యర్థిగా గెలుపొందారు.
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన పూల సుబ్బయ్య, మాచర్ల నియోజకవర్గం నుంచి ఒకసారి గెలిచి, రెండుసార్లు ఓటమి చెందారు.
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన కందుల ఓబులరెడ్డి, 2009 నాటికి రద్దయిన కంభం నియోజకవర్గం నుంచి 1978లో కాంగ్రెసు (ఐ) అభ్యర్థిగా గెలుపొందారు. 1955లోనే ఆయన శాసనసభకు పోటీ చేయటం మొదలు పెట్టారు. 1955లో మార్కాపురం నియోజకవర్గం నుంచి కె.ఎల్.పి. అభ్యర్థిగా గెలిచిన ఓబులరెడ్డి, 1962లో మార్కాపురం నుంచే కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచారు. 1967లో కాంగ్రెసు అభ్యర్థిగా మార్కాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేసి ఓటమి చెందారు.
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 2014లో వై.కా.పా. అభ్యర్థిగా గెలుపొందిన పాలపర్తి డేవిడ్ రాజు అంతకు ముందు టి.డి.పి. పక్షాన ఒకసారి ప్రకాశం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1999లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి టి.డి.పి. అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2004లో సంతనూతలపాడు నుంచి టి.డి.పి. అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 2009లో కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన ఆదిమూలపు సురేష్, 2014లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వై.కా.పా. అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
1952లో ఏర్పడిన కంభం నియోజకవర్గం 2009 నాటికి రద్దయింది. ప్రస్తుతం యర్రగొండపాలెం నియోజకవర్గంలో కొనసాగుతోంది.
కంభం నియోజకవర్గం నుంచి 1952లో కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన పిడతల రంగారెడ్డి, 1952, 1972ల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచారు. 1978లో జనతా పార్టీ పక్షాన గెలిచారు. 1985 నాటికి స్వతంత్ర అభ్యర్థిగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1983లో కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఒక పర్యాయం శాసనమండలి సభ్యునిగా కొనసాగారు. పి.సి.సి. అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1989లో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుంచి టి.డి.పి. అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు.
కంభం నియోజకవర్గం నుంచి 1994లో టి.డి.పి. అభ్యర్థిగా గెలిచిన చప్పిడి వెంగయ్య, 1967లోనే మార్కాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
కంభం నియోజకవర్గం నుంచి 1985లో టి.డి.పి. అభ్యర్థిగా గెలిచిన ఉడుముల వెంకటరెడ్డి, 2004లో కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన ఉడుముల శ్రీనివాసరెడ్డిలు తండ్రీకొడుకులు.
యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి 1960 ఉప ఎన్నికలో కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన జంకె రామిరెడ్డి, మార్కాపురం నియోజకవర్గం నుంచి 2014లో వై.కా.పా. అభ్యర్థిగా గెలిచిన వెంకటరెడ్డిలు తండ్రీకొడుకులు.
1952లో కంభం నియోజకవర్గం నుంచి కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన పిడతల రంగారెడ్డికి, 1999లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొందిన పిడతల విజయకుమార్ రెడ్డి తనయుడు. 2001 ఉపఎన్నికలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొందిన సాయి కల్పనారెడ్డి, విజయకుమార్ రెడ్డి భార్య. 1994లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలుపొందిన రాంభూపాలరెడ్డి, రంగారెడ్డికి సోదరుడు.
కంభం నియోజకవర్గం (2009 నాటికి రద్దయి, యర్రగొండపాలెం నియోజకవర్గంలో కొనసాగుతోంది) నుంచి 1978లో కాంగ్రెసు (ఐ) అభ్యర్థిగా గెలుపొందిన కందుల ఓబులరెడ్డి, 1983, 1989, 1999ల్లో కాంగ్రెసు అభ్యర్థిగా గెలిచిన కందుల నాగార్జునరెడ్డిలు తండ్రీకొడుకులు.
2019లో యర్రగొండపాలెం నియోజకర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా గెలుపొందిన ఆదిమూలపు సురేష్ వైయస్. జగన్మోహనరెడ్డి మంత్రిర్గంలో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కంభం నియోజకవర్గం (2009 నాటికి రద్దయి, యర్రగొండపాలెం నియోజకవర్గంగా కొనసాగుతోంది) నుంచి 1978లో కాంగ్రెసు అభ్యర్థిగా గెలుపొందిన కందుల ఓబులరెడ్డి, 1978 నాటి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మధ్య తరహా నీటి పారుదల శాఖను నిర్వహించారు.
– దాసరి ఆళ్వారస్వామి
అనుభవ పాత్రికేయులు
చరవాణి: 9393818199