చంద్రబాబుతో చర్చకు సిద్ధం…
ఎంపీ కేశినేని నాని సవాల్
విజయవాడ: కేవలం 24 సీట్ల కోసం చంద్రబాబు, లోకేష్ దగ్గర జనసేన కార్యకర్తల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘2009లో పంచలూడగొడతానన్నాడు.. ఇప్పుడు పాతాళానికి తొక్కేస్తానంటున్నాడు. వైఎస్ జగన్ పెట్టిన అభ్యర్ధులపై ఓడిపోయి ప్రగల్భాలు పలుకుతున్నాడు. గ్లాసు గుర్తును ఓడించడానికి చంద్రబాబు చాలు. పవన్ నిలబెట్టిన 24 మంది అభ్యర్ధుల్ని చంద్రబాబే ఓడిస్తాడు’’ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘పశ్చిమ నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీకంచుకోట. అభ్యర్ధి షేక్ ఆసిఫ్. అభ్యర్ధిని మారుస్తారనేది అపోహలు పెట్టుకోవద్దు. రాజకీయంగా అత్యంత చైతన్యవంతమైన ప్రాంతం పశ్చిమ నియోజకవర్గం. నేను మొదటిసారి ఎంపీగా గెలిచినపుడు 13 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది. రెండో సారి ఎంపీగా గెలిచినపుడు 9 వేల మెజార్టీ పశ్చిమ నుంచే వచ్చింది. ఈసారి కూడా గెలుపు మనదే. పశ్చిమ నుంచి గెలిచిన వెల్లంపల్లి శ్రీనివాస్.. సీఎం జగన్ సహకారంతో ఎంతో అభివృద్ధి చేశారు.’’ అని కేశినేని అన్నారు.
‘‘ఓసీ మేయర్ సీటులో బీసీ మహిళను కూర్చోబెట్టిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. కృష్ణాజిల్లా జడ్పీ చైర్మన్ బీసీ మహిళకు కేటాయించారు. సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో వైయస్ జగన్ నంబర్ వన్ లీడర్. కరోనా సమయంలోనూ ఇచ్చిన మాటను తప్పకుండా పని చేసిన కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు జగన్. సంక్షేమం పేరుతో అభివృద్ధి చేయడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారు. చంద్రబాబు వంద కోట్లైనా విజయవాడకు ఇచ్చాడా’’ అంటూ కేశినేని నిలదీశారు.
‘‘డ్రైనేజ్ వ్యవస్థ కోసం 400 కోట్లు తెస్తే.. ఆ నిధులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారు. నా పలుకుబడి ఉపయోగించి నిధులు తెచ్చినవే. చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం. రియల్ ఎస్టేట్ వ్యాపాపరం కోసం 33 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నాడు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ, కోర్టు తప్ప ఐదేళ్లలో నువ్వు కట్టిందేంటి. నేను వైయస్ఆర్ సీపీలోకి వచ్చాక 100కు పైగా సచివాలయాలు ప్రారంభించా. అమరావతి కోసం చంద్రబాబు 3వేల కోట్లైనా ఖర్చు చేశాడా అని ప్రశ్నిస్తున్నా. ప్రతీ గ్రామానికి ఒక సచివాలయం కట్టి జగన్ ప్రజలకు మంచి పాలన అందిస్తున్నారు. 80 వేల కోట్లతో మెడికల్ కాలేజీలు కట్టిస్తున్న వ్యక్తి సీఎం వైయస్ జగన్’’ అని ఎంపీ కేశినేని కొనియాడారు.
సీఎం వైయస్ జగన్ చేసిన సంక్షేమాన్ని చెప్పుకోవడంలో మనం వెనకబడ్డాం. చంద్రబాబు ఏం చేశాడో.. ఈ ఐదేళ్లలో సీఎం వైయస్ జగన్ ఏం చేశారో ప్రజలకు మనం వివరించాలి. అభివృద్ధి అంటే బిల్డింగ్‌లు, హోటళ్లు కాదు. మానవ అభివృద్ధే అసలైన అభివృద్ధి. చంద్రబాబు, రామోజీరావుకు జగన్ చేసే అభివృద్ధి కనిపించదు. చంద్రబాబును సీఎంగా చేసుకోవడమే ‘ఈనాడు’ లక్ష్యం. సామాన్యులను పదవుల్లో కూర్చోబెట్టిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది. విజయవాడ వెస్ట్, మైలవరం, తిరువూరులో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాం’’ అని కేశినేని పేర్కొన్నారు.