మతతత్వ మురికిలో పొర్లుతున్న సినిమా యానిమల్స్
కవి కరీముల్లా సామాజిక వ్యాసం
———————————————————————–
ఒకానొకప్పుడు తెలుగు సినిమా ప్రగతిశీల భావాలకు నెలవుగా ఉండేది. సామాజిక రుగ్నతలపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే సాధనంగా కొనియాడబడేది. కానీ నేడు అదే సినిమా మానవ సంబంధాలకు విఘాతం కలిగిస్తూ, మానవీయ విలువలకు పాతర వేస్తూ, సాంస్కృతిక కాలుష్యాన్ని పెంచుతూ సమాజంలో అనైక్యతకు, ముస్లింలపై ద్వేషం పెంచే మతతత్వ ఫాసిస్టు పోకడలకు బాటలు వేస్తుంది. మొత్తం సినిమా రంగమంతా కాకపోయినా తులసీవనంలో గంజాయి మొక్కల్లాంటి కొందరు మతపిచ్చ నటులు, దర్శకులు, నిర్మాతలు, మాటల రచయితల వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా సమాజంలో అతిపెద్ద మైనార్టీ సమాజమైన ముస్లింల మనోభావాలకు వీసమెత్తు విలువ ఇవ్వకుండా దేశద్రోహులుగా, ఖూనీకోర్లుగా చిత్రీకరిస్తూ ఇతర వర్గాల్లో ముస్లిం వ్యతిరేకత పెంచే ఫాసిస్టు కుట్రలకు పాల్పడుతుంది. దేశభక్తి ముసుగులో ముస్లిం ద్వేష కేంద్రంగా ఇతివృత్తాలు నిర్మిస్తూ లౌకికవ్యవస్థకే సినీ రంగం గొడ్డలిపెట్టులా మారటం దురదృష్టకరం. ఓ వైపు బతుకు పోరాటంలో ఎన్నో సమస్యలతో కునారిల్లుతూ శ్రామిక జీవన సంస్కృతి కలిగి దేశ ఉత్పత్తి రంగంలో ప్రధాన శ్రమశక్తిగా ఉన్న ముస్లింలు నేడు తెలుగు సినిమా చూడాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. అదేమంటే చూపించవల్సిన ఫ్యాక్షన్ అంతా చూపించి చివరిలో ఫ్యాక్షన్ తప్పు అని సందేశం ఇచ్చినట్టు ఒక మంచి ముస్లిం క్యారెక్టర్ కూడా పెట్టాం కదా! అని అంటారు. ఇటువంటి కుత్సితమైన మతతత్వ పూరితమైన ఆలోచనలు సినీ పరిశ్రమకు, సమాజానికి మరింత హాని చేసేవే కానీ మేలు చేసేవి కావు.ఈ మధ్య వచ్చిన యానిమల్ సినిమాలో ఖురఖా వేసుకొని ముస్లిం స్త్రీలు సిగరెట్ తాగుతున్నట్టు చూపారు.విలన్ ముస్లిం క్యారెక్టర్ను పెట్టి చాలా జుగుప్స చూపించారు.గర్భంతో ఉన్న ముస్లిం స్త్రీని(విలన్ భార్య )శతృవు భార్య కదా చంపేసేయండి అని హీరో అంటాడు.’పోలీస్ కమీషనర్’ అనే సినిమాలో హీరో ఓ ముస్లిం క్యారెక్టర్ను ‘రేయ్ తురకోడా’ అని పిలుస్తాడు. ‘ఖడ్గం’ సినిమాలో హీరో టోపీ గడ్డం ఉన్న విలన్ను హిందూ దేవతా విగ్రహం ఉన్న గుడి కేసి తల మోది చంపుతాడు.
పాకిస్తాన్ క్రికెట్లో గెలిస్తే ముస్లింలంతా స్వీట్స్ పంచుకుని ఆనందించినట్లు చూపిస్తాడు. వీటివల్ల సినిమా సంచలనాలు నమోదు చేసుకుని పది కాసులు సంపాదించి పెడితే పెడ్తుందేమో కానీ సమాజానికి ఎంతహాని చేస్తుందో వేరే చెప్పనక్కరలేదు. అయినా ఈ దేశం కోసం రక్తతర్పణ చేసిన ముస్లింల త్యాగాలు ఒక చరిత్ర కాలేకపోయిన చోట ఇంతకన్నా మంచి సినిమాలు వస్తాయని ఆశించడం భంగపాటే అవుతుంది. పైసల కోసం మానవ విలువల్ని, వలువల్ని దిగజార్చేవాళ్ళకు దేశభక్తిని గురించి మాట్లాడే అర్హతే లేదు. ఒక ముస్లిం తన సమస్యల్ని మర్చిపోయి అందరిలా కాసింత వినోదం కోసం ధియేటర్కు వెళితే ప్రతి రీలు నీతిలేని ఖడ్గమై కుళ్ళబొడుస్తుంది. ఇలా ఓ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వేధించటంలో తెలుగు సినిమా శాడిజం పరాకాష్టకు చేరుకుంది. మరో దృష్టి కోణం నుండి పరిశీలిస్తే ముస్లిం స్త్రీల జీవితాల్ని అపహాస్యం పాలు చేసే సినిమాలు వస్తున్నాయి. ఒక ముస్లిం స్త్రీ (హీరోయిన్) బురఖా లాగుతూ హీరో వెకిలి చేష్టలు (దర్శకుడి దృష్టిలో ప్రేమ) చేస్తుంటాడు. ఇలాంటి సన్నివేశాలు చిత్రీకరించటం ద్వారా వీళ్ళు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలను కుంటున్నారో ఫాసిజం ఆలోచన విధానం అవగాహన చేసుకున్న వారెవరికైనా తెలుస్తుంది. ఇలాంటి సందేశాలే ఒక రకంగా ఆయేషామీరా హత్యకు కారణం అయ్యాయని ఎవరైనా అంటే తప్పు పట్టవల్సిన అవసరం లేదు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ముస్లిం నటులు, గాయకులు, దర్శకులు, రచయితల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. తమకు ఇష్టమైన స్వంత పేర్లతో పిలవబడే అదృష్టం కూడా వీరికి లేదు. తాము ముస్లిం పేర్లతో కొనసాగితే తమను ఎక్కడ అణిచివేస్తారోనని భయపడ్తూ సినీ రంగంలో అనేక మంది తమ పేర్లు మార్చుకోవటం ముస్లిం కళాకారుల దైన్యస్థితికి అద్దం పడుతుంది. ఇలా తెలుగు సినిమాలో వేళ్ళూనుకుంటున్న ఫాసిజం పడగనీడలో ముస్లిం క్యారెక్టర్ ఆర్టిస్టులు సైతం నిత్యం అవమానాలకు గురి అవుతూ తమ కెరీర్ను కాపాడుకోవల్సి వస్తుంది. అదే తమిళ, మళయాళ, హిందీ సినీరంగాలలో అయితే ప్రతిభకు పట్టం కడతారే తప్ప కళాకారుల కులం, మతం చూడరు. ఆ స్థాయికి తెలుగు సినీరంగం ఎప్పుడు ఎదుగుతుందో వేచి చూడాల్సిందే. కులం కంపులో కుళ్ళిపోతూ, మతతత్వ రొచ్చులో పొర్లాడుతూ సినిమా సగటు ప్రేక్షకులకు జుగుప్స కలిగిస్తుంది. తెలుగు సినిమాలో విప్లవ సినిమాలు తీస్తున్నామని చెప్పుకుంటున్నవారి పరిస్థితి సైతం ఇందుకు భిన్నంగా లేదు. వీరికి ముస్లింల జీవితాలు, అభద్రతా భావం, అస్తిత్వ భయాలు ఎప్పుడూ ఇతివృత్తంగా కన్పించలేదు. సమాజంలోని పీడితుడు హిందువైనా, ముస్లిమైనా అతని పక్షం వహించేవాడే నిజమైన కళాకారుడు. అలాకాక సమాజాన్ని ముక్కలు ముక్కలు చేసి మత విద్వేషాలు పెంచాలని చూసేవారు కళాకారులుగా కాక కళాసైతానులుగా మిగిలిపోతారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదం, దేశీయంగా మతతత్వ ఫాసిజం బుసలు కొడ్తున్న ఈ సందర్భంలో మతసామరస్యాన్ని, నిజమైన దేశప్రేమని పెంపొందించే సినిమాలు తీయటం, ప్రోత్సహించటం సినీ నిర్మాణ సంస్థల నైతిక బాధ్యత. అయితే మొత్తం తెలుగు సినీ ప్రపంచం ఇలా కుళ్ళి పోయిందని మనం గుండెలు బాదుకోవల్సిన అవసరం లేదు కానీ కొద్ది మంది వల్ల మొత్తం సినీరంగానికి అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడవల్సిన అవసరం అందరికీ ఉంది.
ప్రపంచ చరిత్రలో ఎంతో విశిష్టమైన భారతీయ సంస్కృతిలో భాగమైన లౌకికపునాదుల్ని కాపాడుకోవటం అందరి విధి. ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే సాధనంగా, సామరస్య, సహజీవన విలువల్ని పెంపొందించే కళాఖండాల్ని నిర్మిస్తూ విభిన్న వర్గాల వారధిగా తెలుగు సినిమా భవిష్యత్తులో నిలవాలని ఆశిద్దాం..
“సినీ దర్శకుల్లారా!
నలిగి నలిగి నుజ్జయినోడ్ని
బిక్కు బిక్కుమని బ్రతికేటోడ్ని
చించబడ్డ బురఖాల్ని
మూల పడ్డ చరఖాల్ని
దొర్లిపడ్డ మా గడ్డం తలల్ని
బాయ్నెట్ నెత్తుటి వెలల్ని
ఎప్పుడైనా చిత్రించారా?
జీవితాంతం మాతో సాగే
ఆకలి గీతాల్ని
అక్షర క్షయమైన సత్యాల్ని
ఎప్పుడైనా విన్పించారా?
ఇక మీ సినిమా ఉన్మాదం
చూడలేము ఆపండేహె!