గవర్నరు కోటాలో నియమితులైన ఇద్దరు ఎంఎల్సీల ప్రమాణ స్వీకారం
అమరావతి, ఆగస్టు 18: గవర్నరు కోటాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి సభ్యులుగా నియమితులైన శ్రీమతి కర్రి పద్మ శ్రీ , డా.కుంభా రవిబాబు ఎంఎల్సిలుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.
శుక్రవారం వెలగపూడిలోని రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు తమ చాంబరులో వీరిరువురితో ఎంఎల్సిలుగా ప్రమాణం చేయించారు. శాసన మండలి సభ్యులుగా వారు పాటించాల్సిన నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధివిదానాలు, నిర్వర్తించాల్సిన కార్యకలాపాలు తదితర విషయాలను తెలిపే పుస్తకాలతో కూడిన కిట్లను అధ్యక్షులు కొయ్యే మోషేను రాజు వారికి అందజేస్తూ అభినందనలు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్న దొర, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణా రావు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పాలకొండ శాసన సభ్యురాలు విశ్వసరాయి కళావతి తదితరులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంఎల్సిలను దుశ్శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ శాసన సభ సెక్రటరీ జనరల్ డా.పి.పి.కె. రామాచార్యులు, రాష్ట్ర శాసన మండలి ఓ.ఎస్.డి. సత్యనారాయణ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.