ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలి
* ఆరోగ్యశ్రీ సేవలను మరింత వృద్ది చేయండి
* 10-19 యేళ్ళ మధ్య వయస్సు గల బాలికల్లో రక్త హీణత నివారణకు పటిష్ట చర్యలు చేపట్టండి
* ప్రభుత్వ పాఠశాల తోపాటు ప్రైవేట్ పాఠశాల నుండి డేటాను తీసుకుని నివారణ చర్యలు తీసుకోండి
* నిర్మాణంలో ఉన్న 5 వైద్య కళాశాలను ప్రారంభించేందుకు వీలుగా త్వరగా పనులు పూర్తి చేయండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.
విజయవాడ,3 జూలై: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వాసుపత్రులు,ఏరియా ఆసుపత్రిలు సహా ఇతర ఆసుపత్రిల్లో వైద్య సేవలను మరింత మెరుగుపర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో వైద్య ఆరోగ్యం,కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో విస్తృతంగా సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందిస్తున్న సేవలు కంటే మరింత మెరుగైన సేవలను అందించాలని స్పష్టం చేశారు. ఎందుకంటే కరోనా తర్వాత ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి అటు వైద్య సేవలకు ఇటు వైద్య పరమైన మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయడం జరుగుతోందని పేర్కొన్నారు.కావున ఎట్టి పరిస్థితుల్లోనూ పిహెచ్ సి స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ ప్రజలకు అందించే వైద్య సేవలను మరింత మెరుగు పర్చాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.
అదే విధంగా రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ సేవలను కూడా మరింత విస్తృతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
అలాగే 10 నుండి 19యేళ్ళ లోపు బాలికల్లో రక్త హీణత నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకు గాను ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేటు పాఠశాలల్లోని బాలికలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రక్తహీణత కలిగిన బాలికలు అందరితో ఐరెన్ ఫోలిక్ మాత్రలు మింగించాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 5 వైద్య కళాశాలలను త్వరలో ప్రారంభించేందుకు వీలుగా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ఇంకా ఈసమావేశంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు అంశాలను అధికారులతో సిఎస్ సమీక్షించారు.
ఈసమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యంటి.కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యక్రమాలను వివరించారు.
ఇంకా సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి,డా. వనిత,వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్,స్పెషల్ సెక్రటరీ టు సియం ఆర్ ఎఫ్ డా.హరికృష్ణ, ఆరోగ్య శ్రీ సీఈఓ హరీంద్ర ప్రసాద్,ఎపి వైద్య విధాన పరిషత్ కమీషనర్ డా.ఎస్.వెంకటేశ్వర్,డియంఇ డా.డిఎస్విఎల్ నరసింహం, ప్రజా రోగ్యశాఖ డైరెక్టర్ డా.వి.రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.