అమరావతి:
- ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు చెందిన 50 మంది ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో STARS పథకం కింద ఉచిత ప్రవేశాలు…
- సమ్మిళిత, సమాన విద్యకు విఐటీ-ఏపీ కట్టుబడి ఉందని వైస్-చాన్సలర్ డా|| పి. అరుళ్‌మొళివర్మన్ పేర్కొన్నారు…
ది. జూన్ 30, 2026. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే తన నిబద్ధతను మరోసారి చాటుతూ, విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం ప్రతిష్ఠాత్మకమైన STARS (Support the Advancement of Rural Students) పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాలకు చెందిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష (IPE)లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు విఐటి-ఏపి విశ్వద్యాలయంలో ఉన్నతవిద్య అభ్యసించడానికి ప్రవేశాలు కల్పించారు. ఎంపికైన ఈ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు మరియు హాస్టల్ ఫీజులపై 100 శాతం మినహాయింపు కల్పించడం ద్వారా ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుంది.
విఐటి గౌరవ చాన్సలర్ డా|| జి. విశ్వనాథన్ రూపకల్పన చేసిన STARS పథకం 2008లో విఐటీ, వెల్లూరులో ప్రారంభమైంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన గ్రామీణ ప్రాంతాల ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2017లో విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి వారి జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొస్తోంది.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ డా|| పి. అరుళ్‌మొళివర్మన్ మాట్లాడుతూ, “విద్య జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంటుంది. పేదరికపు చక్రాన్ని ఛేదించే అత్యంత ప్రభావవంతమైన సాధనం విద్యే. మా STARS విద్యార్థుల్లో చాలామంది రోజువారీ కూలీలు, చిన్న మరియు సన్నకారు రైతులు, గృహ కార్మికులు, అలాగే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారు. అలాంటి కుటుంబాలకు ఉన్నత విద్య ఒక అందని అవకాశంగా కనిపిస్తుంది. STARS పథకం ద్వారా వారి ప్రతిభను గుర్తించి, నాణ్యమైన విద్యతో వారిని సాధికారులుగా తీర్చిదిద్ది, భవిష్యత్తులో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే బాధ్యతాయుతమైన పౌరులు, నాయకులుగా తీర్చిదిద్దేందుకు విఐటీ-ఏపీ కట్టుబడి ఉంది” అని అన్నారు. అర్హత ఉన్న ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక పరిమితుల కారణంగా నాణ్యమైన విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డా|| జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ, “ప్రతిభ అనేది ఎప్పుడూ ఆర్థిక పరిస్థితుల వల్ల పరిమితం కాకూడదని విఐటీ-ఏపీలో మేము విశ్వసిస్తున్నాం. అర్హులైన విద్యార్థులకు సమాన అవకాశాలను కల్పించి, విద్య ద్వారా వారిని సాధికారులుగా తీర్చిదిద్దాలనే మా దృష్టికి STARS పథకం ప్రతిబింబం. ఈ ప్రతిభావంతులైన విద్యార్థులను విఐటీ-ఏపీ కుటుంబంలోకి ఆహ్వానించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారి విద్యా ప్రయాణమంతా వారికి అండగా నిలవడానికి మేము కట్టుబడి ఉన్నాం” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డా|| మనోజ్ కుమార్ మిశ్రా, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.















































