Judicial Simplicity: A New Journey Towards Reform
న్యాయ సరళత: సంస్కరణల దిశగా సరికొత్త ప్రయాణం
మానవ నాగరికతకు న్యాయం అనేది ఎల్లప్పుడూ ముఖ్యమైన, విడదీయరాని మూలస్తంభంగా ఉంటూ వచ్చింది. మన సుసంపన్నమైన ప్రాచీన సాంస్కృతిక వారసత్వం, దాని శాశ్వత గుర్తులు.. మానవాళి ప్రయాణాన్ని తీర్చిదిద్ది, నడిపించిన మన సంస్థాగత చట్రాలను ప్రతిబింబిస్తాయి. జ్ఞానోదయం, పునరుజ్జీవనం, వరుస పారిశ్రామిక విప్లవాల ద్వారా ఆధునిక సమాజం రూపాంతరం చెందుతూ వచ్చిన క్రమంలో.. వివిధ సిద్ధాంతాలు, ఆలోచనా ధోరణుల ప్రభావంతో వ్యక్తుల మధ్య, సమాజాల మధ్య పరస్పర సంబంధాలు కూడా మారుతూ వచ్చాయి. శాస్త్రీయ, సాంకేతిక పురోగతి సరిహద్దుల పరిమితులు లేకుండా ఆలోచనల మార్పిడిని మరింత సులభతరం చేసింది.
తరతరాలుగా ఒక ఆలోచన కంటే మరో ఆలోచన మిన్న అని నిరూపించే ప్రయత్నమే న్యాయశాస్త్ర పరిణామానికి బలమైన పునాదిగా నిలిచింది. భిన్నమైన ఆలోచనలు, విలువల మధ్య ఈ ఘర్షణ యుగాలుగా కొనసాగుతున్నప్పటికీ, ధర్మం, నిష్పక్షపాతత, చట్టబద్ధమైన పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించే బాధ్యతను న్యాయ సంస్థలే మోస్తూ వచ్చాయి. వ్యవస్థకు దూరంగా ఉన్నామని భావించే వారితో సహా ప్రతి ఒక్కరిలో నమ్మకాన్ని, మమకారాన్ని పెంపొందిస్తూ, సామూహిక శ్రేయస్సు, న్యాయ సాధన దిశగా వారిని నడిపించే వారధిగా ఈ సంస్థలు నిలిచాయి.
సంస్థాగతమైన ఈ నిరంతర నిబద్ధతే ఒక బలమైన న్యాయ పర్యావరణ వ్యవస్థను నిర్మించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. ఇది కేవలం న్యాయాన్ని అందుబాటులోకి తెవడమే కాకుండా, ప్రతి పౌరుడి ‘జీవన సౌలభ్యాన్ని’ సులభతరం చేయాలి. ప్రస్తుత సమకాలీన సందర్భంలో, మన భారతీయ న్యాయశాస్త్రం ఆధునిక సవాళ్లకు, అవకాశాలకు అనుగుణంగా తనను తాను మార్చుకుంది. ఒక సమసమాజ స్థాపన కోసం మన స్వాతంత్ర్య సమరయోధులు, దేశ నిర్మాతలు కన్న కలలను నిజం చేసేలా నడుచుకోవడానికి మన రాజ్యాంగ వారసత్వం నిరంతరం దిశానిర్దేశం చేస్తూనే ఉంటుంది. రాజ్యాంగ ప్రవేశికలో పొందుపరిచిన రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయమనే ‘త్రిమూర్తులు’, అలాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ ఆదర్శాలు.. సంస్థల, వ్యక్తుల దైనందిన వ్యవహారాలను సరైన మార్గంలో పెట్టడానికి ఒక నైతిక దిక్సూచిలా పనిచేస్తాయి.
ఒక స్వతంత్ర దేశంగా, మన ప్రయాణాన్ని ముందుకు నడిపించడానికి ‘రాజ్యాంగం’ రూపంలో ఒక అద్భుతమైన మార్గదర్శి లభించడం మన అదృష్టం. అయితే, రాజకీయంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మనలో లోతుగా నాటుకుపోయిన వలసరాజ్యాల మనస్తత్వం భారతీయ నైతికతకు మేధోపరమైన అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. లార్డ్ మెకాలే విద్యా విధానం, ఆ తర్వాత తీసుకొచ్చిన శిక్షాస్మృతి చట్టాల క్రోడీకరణ వంటి విధానాలు ప్రజల స్వేచ్ఛను హరించేలా ఒక సంక్లిష్టమైన నిబంధనల వలయాన్ని సృష్టించాయి. 19వ శతాబ్దపు మనస్తత్వంతో, 20వ శతాబ్దపు చట్టాలతో 21వ శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చలేం.
మన జాతీయ విజయాల పట్ల మనం ఎంతో గర్విస్తాం; అయితే, గత పన్నెండేళ్ల ప్రయాణాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, పాలనా రంగంలో స్పష్టమైన, సానుకూల మార్పు కనిపిస్తుంది. ఇది పౌరుల జీవితాలను అన్ని కోణాల్లోనూ స్పృశించింది. మన ప్రజాస్వామ్య ప్రయాణంలో 2014 సంవత్సరం ఒక కీలకమైన మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే, ఎదుగుతున్న భారతదేశం తన జనాభా శక్తిని, అభివృద్ధి శక్తిగా మార్చుకునే క్రమంలో, విధానపరమైన జోక్యాల పరిమాణాన్ని, పరిధిని ఇక్కడి నుంచే భారీగా పెంచడం జరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధైర్యవంతమైన, దూరదృష్టి గల నాయకత్వంలో, ఈ సంస్కరణల ద్వారా మొత్తం పాలనా నమూనానే ప్రజలకు అధికారమిచ్చే శక్తిగా రూపాంతరం చెందింది. ఈ ప్రయాణం.. పైస్థాయి నుంచి ‘దేశమే ప్రథమం’ అనే విధానాన్ని అమలు చేస్తూనే, క్షేత్రస్థాయి నుంచి ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ పెంపొందించే ఒక నిరంతర ప్రయత్నమిది.
అదేవిధంగా, భారతదేశపు న్యాయ సంస్కరణల ప్రయాణం కూడా విస్తృతి, ఆవిష్కరణలు, సామాజిక, నాగరికత పట్ల ఉన్న లోతైన నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇది చట్టాల ఆధునికీకరణ, సంస్థాగత బలోపేతం, డిజిటల్ ఆవిష్కరణలతో కూడిన ఒక సమగ్ర, బహుమితీయ విధానాన్ని ప్రతిబింబిస్తుంది.
మాకు న్యాయ సరళత అనేది కేవలం ఒక నినాదం కాదు; అది ఒక సంస్కరణల మంత్రం. ఇందులో బాధితులకు/వ్యాజ్యదారులకు సంప్రదింపుల సౌలభ్యం, న్యాయవాదులు & న్యాయమూర్తులకు పని సౌలభ్యం, సామాన్య పౌరులకు చట్టాలపై అవగాహన సౌలభ్యం అంతర్భాగంగా ఉన్నాయి.
వ్యాజ్యదారుల కోణం నుండి చూస్తే, ‘దిశా’ పథకం కింద ప్రవేశపెట్టిన టెలి-లా, న్యాయ్ బంధు & ప్రో బోనో వంటి పౌర-కేంద్రిత సేవలు న్యాయాన్ని సామాన్యుడికి సైతం ఎంతో సులభంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చాయి. కామన్ సర్వీస్ సెంటర్ల విస్తృత నెట్వర్క్ ద్వారా నడుస్తున్న ‘టెలి-లా’ కార్యక్రమం ద్వారా గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు చెందిన 11.2 మిలియన్ల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులు కోర్టుకు వెళ్లడానికి ముందే ఉచిత చట్టపరమైన సంప్రదింపుల ద్వారా ప్రయోజనం పొందారు. ఈ-ఫైలింగ్, ఈ-సేవా కేంద్రాల వంటి సేవల వల్ల న్యాయ వ్యవస్థతో సామాన్యుడికి ఉండే దైనందిన సంబంధాలు మరింత సులువయ్యాయి. ఆధునిక సాంకేతికతను సామాజిక భాగస్వామ్యంతో ముడిపెట్టిన భారతదేశపు ఈ విశిష్ట నమూనా నేడు ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శ నమూనాగా మారుతోంది.
అలాగే.. డిజిటల్, భౌతిక మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చిన భారీ ఊతం వల్ల న్యాయవాదులు, న్యాయమూర్తుల పని సౌలభ్యం గణనీయంగా పెరిగింది. మెజారిటీ పౌరులకు జిల్లా, సబార్డినేట్ కోర్టులే మొదటి సంప్రదింపు కేంద్రాలు కాబట్టి, వాటిని బలోపేతం చేయడం మా తక్షణ, ఆచరణాత్మక ప్రాధాన్యత. ఇందుకోసం, కేంద్ర ప్రభుత్వ నిధుల పథకం కింద కోర్టు హాళ్లు, లాయర్ల హాళ్లు, నివాస గృహాలు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశాం. ఫలితంగా, 2014లో 15,818 గా ఉన్న కోర్టు హాళ్ల సంఖ్య ఇప్పుడు 22,712 కు పెరిగింది. అలాగే అత్యాధునిక సమగ్ర కోర్టు కాంప్లెక్స్ల అభివృద్ధి కోసం 2014 నుండి రూ. 9,400.40 కోట్లు విడుదల చేశాం. దీనికి అదనంగా, రూ.7,200 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో చేపట్టిన ఈ-కోర్ట్స్ ఫేజ్-III ప్రాజెక్ట్ ద్వారా కోర్టులను పూర్తిగా డిజిటల్, కాగిత రహిత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత న్యాయ సంస్థలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వీడియో కాన్ఫరెన్సింగ్, వర్చువల్ కోర్టులు, కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారం వంటి వినూత్న చర్యలు న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత దగ్గర చేస్తూ, న్యాయాన్ని మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా అందిస్తున్నాయి.
భారతదేశం లాంటి బహుభాషా దేశంలో పౌరులకు చట్టాలపై అవగాహన సౌలభ్యమనేది న్యాయ సరళతలో అత్యంత కీలకమైన భాగం. ఈ లక్ష్య సాధన కోసం, సుప్రీంకోర్టు విధిక్ అనువాద్ సాఫ్ట్వేర్, భాషిణి వంటి AI-ఆధారిత సాధనాల ద్వారా సుప్రీంకోర్టు తీర్పులు, ఆదేశాలను 18 భారతీయ భాషల్లోకి అనువదిస్తున్నాం. దీనివల్ల చట్టపరమైన సమాచారం సామాన్య పౌరుడికి సులువుగా అర్థమవుతోంది. ఈ ప్రయత్నాలకు తోడుగా, నేషనల్ జుడీషియల్ డేటా గ్రిడ్ (NJDG) అనే గణాంక, విశ్లేషణాత్మక వేదిక ద్వారా దాదాపు 340 మిలియన్లకు పైగా కోర్టు ఆదేశాల సమాచారాన్ని కేవలం ఒక్క క్లిక్తో చూసుకునే సదుపాయాన్ని కల్పించాం. అలాగే.. చట్టాలు సామాన్యుడికి సులభంగా అర్థమయ్యేలా, పౌర-స్నేహపూర్వకంగా ఉండేలా సరళమైన భాషలో శాసన ముసాయిదాలను రూపకల్పనకు విద్యాసంస్థల సహకారంతో ప్రభుత్వం కృషి చేస్తోంది.
పాత వలసరాజ్యాల నాటి శిక్షాస్మృతి స్థానంలో నేటి ఆధునిక వాస్తవాలకు అనుగుణంగా భారతదేశపు కొత్త క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను తీసుకురావడం ఒక చారిత్రాత్మక అడుగు. ఈ-కోర్టులు, ఈ-ప్రాసిక్యూషన్, ఈ-ప్రిజన్స్, ఈ-ఫోరెన్సిక్స్లను క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ తో అనుసంధానించడం ఒక విప్లవాత్మక మార్పు. న్యాయ శృతి వేదిక ద్వారా వర్చువల్ హాజరులు, సాక్షుల సాక్ష్యాల నమోదు ఎంత వేగంగా జరుగుతున్నాయంటే.. కోర్టు ఒక పౌరుడికి బెయిల్ మంజూరు చేయగానే, ఆ డిజిటల్ బెయిల్ ఆర్డర్ తక్షణమే జైలు పోర్టల్కు చేరుకుంటుంది. దీనివల్ల గతంలో విడుదల ఆలస్యానికి కారణమయ్యే కాగితపు పనులు, పరిపాలనా జాప్యాలు పూర్తిగా తొలగిపోయాయి. ఇది కేసుల డేటాను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకోవడానికి వీలు కల్పిస్తూ, ‘ఇంటర్-ఆపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్’ కు మార్గం సుగమం చేసింది.
ఉన్నత న్యాయవ్యవస్థలో కూడా కోర్టుల అవసరాలను తీర్చడానికి ఉద్దేశపూర్వక చర్యలు తీసుకున్నాం. హైకోర్టు న్యాయమూర్తుల మంజూరైన సంఖ్యను 2014లో ఉన్న 906 నుంచి ఇప్పుడు 1122కు పెంచడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 2019లో 31 నుండి 34కి పెంచగా, ఇప్పుడు ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్, 2026’ ద్వారా ఆ సంఖ్యను 38కి పెంచాం. గత 12 ఏళ్లలో సామాజిక వైవిధ్యం ఉన్న 1175 మంది హైకోర్టు న్యాయమూర్తులను, 77 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులను వేగంగా నియమించడం.. న్యాయ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో న్యాయవ్యవస్థతో కలిసి నడవడానికి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
అనవసరమైన చట్టాల సంక్లిష్టత పౌరులపై, భాగస్వాములపై అదనపు భారాన్ని మోపుతుందనేది స్పష్టమైన వాస్తవం. ఇందులో భాగంగానే, 40,000 కంటే ఎక్కువ నిబంధనల సమ్మతులనుతగ్గించడం, వలసరాజ్యాల కాలం నాటి 1725 అనవసరమైన, కాలం చెల్లిన చట్టాలను పూర్తిగా రద్దు చేయడం వల్ల అన్ని రంగాలలో వ్యాపార సౌలభ్యం మెరుగైంది. అదే సమయంలో, మన మధ్యవర్తిత్వ చట్టాన్ని బలోపేతం చేయడం, ‘ఇండియా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్’ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేయడం, ప్రత్యేక ‘మధ్యవర్తిత్వ చట్టం 2023’ ద్వారా కోర్టు వెలుపల వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించడం.. ‘ప్రత్యామ్నాయ వివాద పరిష్కార’ విధానంలో భారతదేశపు అంతర్జాతీయ నాయకత్వాన్ని అందిస్తోంది.
ప్రపంచ దేశాలు సంక్లిష్టమైన భౌగోళిక రాజకీయ మార్పులు, ఆర్థిక అనిశ్చితులను ఎదుర్కొంటున్న తరుణంలో.. 2026 లో జరిగిన బ్రిక్స్ న్యాయ శాఖ మంత్రుల సమావేశం లో భారతదేశపు చట్టపరమైన, దౌత్యపరమైన నాయకత్వం అత్యంత కీలక పాత్ర పోషించింది. వివాదాల పరిష్కారానికి అత్యంత సులువైన, సమర్థవంతమైన మార్గాలుగా మధ్యవర్తిత్వం, ఆర్బిట్రేషన్లను బలోపేతం చేయడానికి సామూహిక నిబద్ధతగా ‘గాంధీనగర్ డిక్లరేషన్’ ఆమోదం పొందేలా మన దేశం చొరవ చూపింది. ఇటువంటి అంతర్జాతీయ సహకారాలు కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించడమే కాకుండా, వాణిజ్యం, పెట్టుబడుల కోసం ఒక స్థిరమైన, నమ్మకమైన వాతావరణాన్ని కల్పిస్తాయి, అనవసరమైన కోర్టు వివాదాల సంఖ్యను తగ్గిస్తాయి.
ఈ సంస్కరణలన్నింటి వెనుక ఒకే ఒక ఉమ్మడి దృక్పథం ఉంది: న్యాయం కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ వేగంగా స్పందించే, సులభంగా అందుబాటులో ఉండే, సహాయకారిగా ఉండే ఒక అద్భుతమైన పాలనా వ్యవస్థను అందించడం. భారతదేశం 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, భవిష్యత్తు సవాళ్లను తట్టుకోగల ఒక అత్యాధునిక న్యాయ వ్యవస్థను నిర్మించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇది 140 కోట్ల మంది భారతీయుల సామూహిక ఆకాంక్షల నుండి ప్రేరణ పొంది, మరింత పటిష్టంగా, వినూత్నంగా, అందరినీ కలుపుకొనిపోయేలా ఉంటుంది.
– శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్
(కేంద్ర చట్ట, న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
– మరియు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి)















































