రైతు వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్!
- – అబద్ధాల అడ్డాగా మారిన జగన్ ట్వీట్!
– జగన్ పాలనలో రైతులకు కన్నీళ్లు… ఇప్పుడు కపట ప్రేమ!
– గత ఐదేళ్ల మోసాల చరిత్ర మర్చిపోయి నేడు జగన్ నీతులు చెబుతున్నారు
– రైతు సంక్షేమంపై జగన్ విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లే!
– కూటమి ప్రభుత్వ విజయాలను చూసి జగన్‌కు వణుకు మొదలైంది!
– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి, జూన్ 21:
రైతుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జగన్, తన ఐదేళ్ల పాలనలో రైతులను అన్ని విధాలుగా నష్టపరిచి ఇప్పుడు కపట ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని చూసి ఓర్వలేక అసత్యాలు, అర్థసత్యాలతో సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. జగన్ చేసిన తాజా ట్వీట్ అబద్ధాల అడ్డాగా మారిందని, తన పాలనలో రైతులు ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, ఆత్మహత్యలు, పంటల నష్టపరిహారం కోసం పడిన ఇబ్బందులను ప్రజలు ఇంకా మర్చిపోలేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతు సంక్షేమంపై జగన్ చేస్తున్న విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని, మోసాల చరిత్రను మర్చిపోయి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.
2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు రూ.588 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. 2019–24 మధ్య రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మంత్రి విమర్శించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ప్రజలను అప్పుల భారంలో ముంచిన జగన్‌కు చంద్రబాబు నాయుడుని విమర్శించే స్థాయి కానీ, నైతిక అర్హత కానీ లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఐదేళ్ల పాటు ఒక కుటుంబం, ఒక వ్యక్తి, ఒక బటన్ పాలన నడిపిన జగన్ ఇప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకత్వంపై విమర్శలు చేయడం ఆయన రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
జగన్ … రైతుల గురించి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకుని మాట్లాడండి. గోబెల్స్ లా తప్పుడు ప్రచారం చేయడంలో జగన్ సిద్ధహస్తుడు, గత ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ విషయంలో రైతులకు కేంద్రం వాటా కాకుండా 13 వేల సహాయం ఇస్తామని చెప్పి, కేంద్రం-రాష్ట్రం వాటాలను కలిపి ఇచ్చింది మీరే. మేము మాత్రం రైతులను మోసం చేయలేదు. కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత అనేది స్పష్టంగా విడివిడిగా మ్యానిఫెస్టోలో చెప్పి పారదర్శకత చూపించాం. రైతులను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మాకు తెలియవు. ఆక్వా రైతులపై ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తూ మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. మీ హయాంలో ముడి సరుకుల ధరలు పెరగకపోయినా, ఆక్వా ఫీడ్ ధరలను ఏకంగా 7 సార్లు పెంచి, కిలోకు ₹90 ఉన్న ఫీడ్‌ను ₹110.06కి తీసుకెళ్లింది నిజం కాదా? ఆ కంపెనీలపై మీకు ఉన్న ప్రేమ ఏమిటి? వారి దగ్గర మీ లాలూచీ ఏమిటో ప్రజలకు చెప్పాలి. 2024లో అధికారంలోకి రాగానే మేము ఫీడ్ ధరలను తగ్గించాం. ఇప్పుడు అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉంది, ముడి సరుకుల ధరలు భారీగా పెరిగాయి. ఫ్యాక్టరీలు నష్టాల్లో నడుస్తున్నా, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమ ప్రతినిధులు, రైతులతో సమావేశాలు నిర్వహించి, 2022 నాటి ధరలకే పరిమితం చేశాం. కొత్తగా ధరలు పెంచిన దాఖలాలు లేవు. అలాంటప్పుడు ఆక్వా ఫీడ్ ధరలపై అసత్య ప్రచారం చేసి రైతులను రెచ్చగొట్టడం ఎందుకు జగన్?
పొగాకు రైతుల విషయంలో కూడా మీ రాజకీయ కుట్రలు ఆగడం లేదు. హెచ్‌డీ బర్లీ పొగాకు, వర్జినీయా పొగాకుకు తేడా తెలుసా జగన్ నీకు…. గత ఏడాది హెచ్‌డీ బర్లీ పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి ₹273 కోట్ల సాయాన్ని రైతులకు అందించింది. వర్జీనియా పొగాకు కేంద్ర పొగాకు బోర్డు పరిధిలో ఉంటుందనే కనీస అవగాహన కూడా లేకుండా మాట్లాడుతున్నారు. పొగాకు బోర్డుతో మాట్లాడి, కంపెనీలపై ఒత్తిడి తీసుకొచ్చి రైతుల పొగాకును కొనుగోలు చేయించే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంటే, మీరు మాత్రం మార్కెట్‌లో ఎవరూ కొనరనే భయాలు సృష్టిస్తూ రైతుల్లో ఆందోళన పెంచుతున్నారు. రైతులకు మేలు చేయాలనే ఆలోచన కంటే, మార్కెట్ ధరలు పడిపోయేలా చేసి రాజకీయ లబ్ధి పొందాలనే మీ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు. రైతుల పేరుతో అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసే రోజులు పోయాయి జగన్. మీ హయాంలో జరిగిన అన్యాయాలను రైతులు మర్చిపోలేదు. రైతుల సంక్షేమం కోసం పనిచేసేది ఎవరో, రైతులను వాడుకుని రాజకీయాలు చేసేది ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుసు















































