మణిపూర్ లో ఆగని హింస
ఆనాడు గుజరాత్ లో ఏం జరిగిందో అదే మారణహోమం,మణిపూర్ లో కూడా జరుగుతోంది. మే 3 నుంచి ప్రారంభమైన ఈ హింస ఇప్పటికీ చల్లారకపోవడం దేశప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇదే రకమైన హింస హర్యానాలో కూడా చెలరేగింది. కాశ్మీర్, గోవాల మాజీ గవర్నర్ సత్యమాలిక్ పాల్ మాట్లాడుతూ ఎన్నికల నాటికి దేశమంతటా ఇలాంటి ఘటనలు జరిగినా ఆశ్చర్యం లేదని చెప్పడం, ఇప్పటివరకు మణిపూర్ హింసపై ప్రధాని మాట్లాడకపోవడం ప్రపంచాన్ని విస్తుగొలుపుతోంది.
- ఒకే దెబ్బరెండు పిట్టలు
ఆర్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలోని బీజేపీ ఏది చేసినా ఒక దెబ్బకు రెండు పిట్టలు వ్యూహాలను అమలు చేస్తుంది. అందులో భాగంగానే క్రైస్తవ కుకీలను అక్కడి నుంచి తరిమి, 53 వేల ఎకరాల అతివిలువైన మైనింగ్ భూమిని ప్రధాని ప్రియమిత్రుడు ఆదానీకి కట్టబెట్టడానికే అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని విపక్షాల నేతలు ఆగ్రహిస్తున్నారు.
ఆ రాష్ట్ర ఆవిర్భావం
భారత స్విట్జర్లాండ్ గా పిలిచే మణిపూర్ స్వాతంత్ర్యానంతరం 1949 అక్టోబరు 15న భారత్ లో అంతర్భాగం అయ్యింది. 1956 నుంచి 1972 వరకు మణిపూర్ కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగింది. రాజకీయ, విద్యార్థి సంఘాల పోరాటాల ఫలితంగా 1972 జనవరి 21న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. మణిపూర్, త్రిపురాలు కూడా అదే రోజున రాష్ట్రాల హోదా దక్కించుకున్నాయి.
జనాభా – జాతులు
మణిపూర్ జనాభా 38 లక్షలు, కాగ అందులో గిరిజనులు 40 శాతం. వారి భాష, మాండలికం, సంప్రదాయాలను బట్టి వారిని భారత ప్రభుత్వం షెడ్యూల్ తెగలుగా గుర్తించింది. గిరిజనుల్లో ఎక్కువ మంది నాగ, జో, కుకీల జాతులకు చెందిన వారు కాగ, మరో 30 చిన్న తెగలున్నాయి. మణిపూర్ లో చుట్టూ కొండలు , గుట్టలు, అడవులు 89 శాతం ఉన్నాయి. కొండలపై నివాసయోగ్యమైన భూమి చాలా తక్కువ శాతం మాత్రమే. కొండల మధ్యలో లోయ ప్రాంతం ఉంటుంది. అక్కడ డామినేట్ గ్రూపుల్లో మైయిటీలు ఉన్నారు. వీరి జనాభా 60 శాతం. సారవంతమైన భూములు వారి సొంతం. రాజధాని ఇంఫాల్ తో సహా వీరు నివసించే ప్రాంతాలన్నీ చాలా అభివద్ది చెంది ఉంటాయి. కారణం రాష్ట్ర అసెంబ్లీలో 60 స్థానాలుంటే అందులో 40 సీట్లు మెయిటీలవే.. అందుకే ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ అంతా వారి ఆధీనంలోనే ఖర్చుఅవుతోంది. ఆదీవాసీలు నివసించే కొండప్రాంతంలో కనీసవసతులైన రోడ్లు, ఆసుపత్రులు కూడా ఉండవు. మైయిటీలు ఆదీవాసీలను అంటరానివారిగా చూస్తారు. గిరిజనుల కోసం ’హిల్ స్టాండింగ్‘ కమిటీని రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేశారు. దాని ప్రకారం ఆదీవాసీలుండే 6 జిల్లాలకు ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవచ్చు. నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే ఆదీవాసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందని దానికి కూడా ఆధిపత్య మైయిటీలు సహకరించరు. దీంతో తమకు ప్రత్యేక వ్యవస్థ కావాలని గిరిజనులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే జనాభా ఎక్కువ ఉన్న తాము 10 శాతం ఉన్న లోయలో నివసించాల్సి వస్తుందని, తమకు కూడా షెడ్యూలు తెగల హోదా ఇవ్వాలని మైయిటీలు కోరుతున్నారు. వాస్తవానికి హైదరాబాద్లో కోటిమంది జనాభా ఉంటే, అంతకంటే ఎక్కువ వైశాల్యం ఉన్న లోయ భూభాగంలో 16 లక్షల మంది మైయిటీలు మాత్రమే జీవిస్తున్నారు. ఇప్పటికే అన్నిరంగాల్లో ముందున్న మైయిటీలు ఎస్సీ, ఓబీసీ, ఈడబ్లుఎస్ రిజర్వేషన్లతో సకల సౌకర్యాలు పొందుతున్నారని, ఎస్టీ హోదా కల్పిస్తే తమను అస్తిత్వానికి గురిచేస్తారని నాగ, జో, కుకీ ఆదీవాసీల వాదం.
ప్రధాన మతాలు
మెజారిటీ జనాభాగల మైయిటీలు పూర్వం సనామహి మతానికి చెందినవారు. వారి దేవుడు లౌనింగ్ తౌ సనామహి. సనామహి లైహువ వారి మత గ్రంధం. హిందు దేవుళ్లను వారు నమ్మరు. 18వ శతాబ్దంలో మైయిటీల రాజు పంబ్ హీబా రాజ్య మతంగా హిందూ మతాన్ని, విష్ణువును దేవునిగా రూపొందించడంతో క్రమేపీ సనామహి మతం తగ్గింది. మైయిటీల్లో ఎక్కువ మంది హిందువులు కాగ, 8 శాతం మంది పాత సనామహిని అనుసరిస్తున్నారు. కొద్దిమంది క్రైస్తవులు, ముస్లింలు కూడా ఉన్నారు. అయితే గిరిజనులంతా దాదాపుగా క్రిస్టియన్లుగా మారారు. ఇప్పుడు హిందువులు, క్రిస్టియన్లు మణిపూర్లో సమాన నిష్పత్తిలో ఉన్నారు. ఇదే పాలకులకు గిట్టని విషయం.
ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీనడ్డా సమక్షంలో హల్లెలూయ పాటల (వీడియో ఉంది) మధ్య నీఫ్యూ రియో వరసగా 5వ సారి నాగాలాండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం, ఈశాన్యరాష్ట్రాల్లో క్రైస్తవ్యం ఎక్కువ పెరగడం కూడా మణిపూర్ మారణహోమానికి ఒక కారణమని క్రిస్టియన్లు భావిస్తున్నారు.
క్రైస్తవ్యం
బ్రిటీషు పాలనకు ముందు మణిపూర్, నాగాలాండ్, మేఘాలయాలు బర్మా రాజుల ఆధీనంలో ఉండేవి. భారత దేశంలోకి మిషనరీలు వచ్చే వరకు ఈ ఆదివాసులను స్థానిక రాజులు, వారి ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ ప్రాంతమంతా అంటరానితనం, బాల్యవివాహాలు, సతీసహగమనం, నరబలులు వంటి మూఢ నమ్మకాలతో దారుణంగా ఉండేది. బ్రిటీషు పాలనలో మిషనరీల క్రుషితో ఆదివాసీల్లో సాంఘిక, ఆర్థిక, సామాజిక, సాంస్కతిక మార్పులు వచ్చాయి.
గాడ్ ఫాదర్ ఆఫ్ మణిపూర్ మిషనరీ పెట్టిగ్రో
యూకేలోని స్కాట్ లాండ్ చెందిన విలియం పెట్టిగ్రో 1890 నవంబరు 29లో భారతదేశానికి వచ్చారు. అప్పుడున్న భయంకర పరిస్థితులకు ఆయన చలించి సేవా కార్యక్రమాలను మొదలు పెట్టారు. అక్కడున్న కఠిన పరిస్థితులను చూసి బ్రిటీషు ప్రభుత్వం ఆయన ఆపదలు రావచ్చని భావించి మిషనరీగా అంగీకరించలేదు. అయితే విలియం తన సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లడంతో 1894 ఫిబ్రవరి 6న ఆయనను మిషనరీగా గుర్తించారు. ఆ కాలంలో ప్లాసిఫార్మా మలేరియాతో ఎంతోమంది చనిపోతూ ఉండేవారు.. వారందరికీ ఆయన వైద్య సహాయం అందించి మరణాలను నివారించగలిగారు. సరైన నీరు, ఆహారం లేక క్రుషించిపోయిన వారికోసం ఆసుపత్రులు, స్కూళ్లు కట్టించారు. చర్చిలకు అనుబంధంగా ఉండే ఆ పాఠశాలల్లో చదువుకున్న అనేక మంది ఇప్పుడు అంతర్జాతీయ క్రీడాకారులుగా రాణిస్తున్నారు. అందుకే విలియంను గాడ్ ఫాదర్ ఆఫ్ మణిపూర్ అని పిలుస్తారు.
కుకీల దేశభక్తి
కుకీతెగ భారత్, బంగ్లా, మయన్మార్లలోని అనేక కొండ తెగల్లో ఉంది. 1917- 19 మధ్య కాలంలో ’అటానమీ మువ్ మెంట్ ‘ పేరుతో మొదటిసారి బ్రిటీషువారిపై తిరుగుబాటు చేసింది కుకీలే.. వీరు ఓడిపోయిన తర్వాత బ్రిటీషు ఇండియా, బ్రిటీషు బర్మా పరిపాలనలో వారి భూబాగం విభజింపబడింది. 2వ ప్రపంచ యుద్ద సమయంలో వీరు సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలోని’’ ఇండియన్ నేషనల్ ఆర్మీ‘‘లో చేరి బ్రిటీషువారిపై పోరాడారు.
మేలో జరిగిన మారణహోమంలో స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఇంట్లో ఉంచి నిప్పంటించి 84 ఏళ్ల వ్రుద్దురాలి మరణానికి కారకులుగా నిలిచాయి అల్లరిమూకలు. అలాగే నగ్నంగా నడిపించిన ముగ్గురు మహిళల్లో ఒకరు కార్గిల్ సైనికుడి భార్య. దేశాన్ని రక్షించాను గాని, భార్యను రక్షించుకోలేక పోయానని కన్నీరు మున్నీరు అవుతున్నాడతడు. సైన్యంలో కల్నల్ గా పనిచేసిన ఒకరు కుకీ, నాగా, మైయిటీలంతా కలసి అసోం రెజిమెంట్లో పనిచేశాం .. మేమంతా కలసిమెలసి ఉండేవాళ్లం. ఇప్పుడు చూడండి ఎంత విధ్వంసం జరిగిందో అని కంటనీరు పెడుతుంటే అతనిని ఇంటర్య్వూ చేస్తున్న ఛానల్ వ్యక్తి కల్నల్ కన్నీరు తుడుస్తున్న వీడియో మీరు చూసే ఉంటారు..
భూమి పుత్రులపై ప్రభుత్వ పంజా
అతివాద మైయిటీ నేత, సీఎం బీరెన్ సింగ్ మొదటి దఫా పరిపాలనలో ఆదీవాసీలకు ఒరిగింది ఏమీలేకపోయినా, వారిపై ప్రభుత్వపరమైన అక్రుత్యాలు మాత్రం జరగలేదు. అయితే రెండోదఫా ముఖ్యమంత్రిగా వచ్చినప్పటి నుంచి అసలు భూమిపుత్రులైన జోమి, కుకీ, నాగ, మిజో తెగలను ఆయన టార్గెట్ చేశారు. భూ ఆక్రమణ పేరుతో 3 ప్రధాన చర్చిలను కూలదోశారు. అసలైన మాదకద్రవ్యాల బడావ్యాపారులను వదిలి వాటిని పండిస్తున్నారని ఆధారాలు లేకున్నా కొండలపై నివసించే గిరిజనులపై యుద్దం ప్రకటించారు. వారి భూములపై ఆధిపత్యం కోసం రిజర్వ్ అడవులు, రక్షిత ప్రాంతం, జంతు సంరక్షణా ప్రాంతాలు, జాతీయ పార్కులు, చిత్తడి నేలలని, వీరంతా అక్రమ చొరబాటు దారులని రకరకాలుగా వారిని వేధిస్తూ ఆ ప్రాంత ప్రజలకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వెళ్లగొడుతున్నారు.
భారీ కుట్ర
అల్లర్లకు కొద్ది రోజుల ముందు కాషాయం ధరించిన సన్యాసులు మణిపూర్లోని ’’వనవాసి కల్యాణ్ ‘‘ ఆశ్రమానికి వచ్చినట్లు నాసిక్ జర్నలిస్టు నిరంజన్ తక్లే చెబుతున్నారు. ఎప్పటి నుంచో తమకు కూడా ఎస్టీ హోదా కల్పించాలని కోరుతున్న మైయిటీలకు అనుకూలంగా మే 3న అక్కడి హైకోర్టుప్రధాన న్యాయమూర్తి మురళీధరన్ తీర్పు వెలువరించారు. వాస్తవానికి అది హైకోర్టు పరిధిలోని అంశం కాదు. రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. అయితే ఇదంతా భారీ కుట్రలో భాగంగా ప్రణాళికాబద్దంగా జరిగింది. అప్పటికే ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్న కుకీ, నాగ, ఆదీవాసీలు తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో మైయిటీలు గిరిజనులను లక్ష్యంగా చేసుకొని అల్లర్లకు తెగబడి దహనాలు, లూటీలు, రేప్ లు ఒకటేమిటి ప్రపంచం ముందు భారత్ తలదించుకునే అన్ని కార్యాలు జరిపారు. వారిని నిరోధించాల్సిన పోలీసులు అల్లరిమూకలకు ఆయుధాలిచ్చి జరుగుతున్న మారణకాండను ప్రేక్షకుల్లా చూస్తున్నారు. మణిపూర్ లో జరిగిన అమానవీయఘటనలకు యావత్ ప్రపంచం నివ్వెరపోతున్నా.. పాలకులు అమానుషాన్ని ఆపే ప్రయత్నం ఇప్పటికీ చేయడం లేదు..
అప్పుడే తెలిసిందట..
ఇద్దరు మహిళలను నగ్నంగా నడిపించిన వీడియో ఇంటర్నెట్ ను పునరుద్దరించిన రెండు నెలలకు వైరల్ అయితే అప్పుడే తమకు ఈ విశయం తెలిసిందని ప్రధాని మోడీ చెబుతున్నారు. అంతకు ముందు ఆరాష్ట్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రధానికి తెలియకుండానే మూడురోజులు పర్యటించారా ? రాష్ట్ర, దేశ నిఘా వ్యవస్థలు ఏమయ్యాయి..? ఎన్ ఐఏ (నేషనల్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ) చీఫ్ అజిత్ దోవల్ శౌర్యప్రతాపాలపై వాట్సప్ గ్రూపులు పుంఖాను పుంఖాలుగా మెసేజ్ లు పంపుతారుకదా.. ఇప్పుడాయన ఏం చెబుతారు ? దేశ ప్రజలంతా కట్టిన ట్యాక్స్లతో అత్యంత సౌకర్యాలు పొందుతున్న ఆయనకు, ఆయా వ్యవస్థలకు, ప్రజాప్రతినిధులకు ప్రజల రక్షణ బాధ్యత లేదా ?
మే 3 నుంచి జరుగుతున్న అల్లర్లపై మే 8న సుప్రీంకోర్టులో పిల్ (ప్రజాప్రయోజనాల వాజ్యం) దాఖలైంది. ఈ కేసును పరిశీలించిన తుషార్ శర్మ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పరిస్థితిని అదుపులోకి తెస్తున్నాయని చెప్పి కోర్టు మెట్లెక్కిన వారికి న్యాయం అందకుండా చేశారు. రాష్ట్ర, జాతీయ మానవహక్కుల సంఘాలు ఎక్కడున్నాయో తెలీదు.. జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ అధికార పార్టీ ప్రతినిధిలా చిన్న విషయాలకే విపక్షాలపై విరుచుకుపడతారు, కాని ఈ విశయంలో ఆమె స్పందించడం లేదు. వాళ్లే కాదు కేంద్ర మహిళా మంత్రులు కూడా ఎక్కడా ఈ ఘటనను ఖండించిన పాపాన పోలేదు. మణిపూర్ గవర్నర్ అనసూయి ఉయికీ కూడా గిరిజన మహిళే.. ఆమె చత్తీస్ ఘడ్ గవర్నర్ గా ఉండగా కూడా అప్పటి బీజేపీ రాష్టపాలనలో ఇదే విధంగా అఘాయిత్యాలు జరిగాయి. మన రాష్ట్రపతి, ద్రౌపతి ముర్ము కూడా గిరిజన మహిళే అయినా ఆమె నుంచి స్పందన కరవు.
రానున్న రోజుల్లో మనం మరిన్ని ఘాతుకాల్ని, హీనచర్యల్ని వినాల్సి …చూడాల్సి వస్తుంది.. ఎందుకంటే రోజురోజుకు మణిపూర్ పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ క్రమంలోనే సాక్షాత్తూ ఆరాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ వందలకొద్దీ రేప్ లు మర్డర్లు జరుగుతున్నాయి కాబట్టే మేము ఇంటర్నెట్ ను తొలగించాం అని చెప్పారు.
సుప్రీంకోర్టు జోక్యం
వీడియోలు వైరల్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఆకేసును సుమోటోగా తీసుకొని మేం కలగ జేసుకోవాలా ? ప్రభుత్వం స్పందిస్తుందా అని ఆగ్రహం వెలిబుచ్చితేనే మోడీ కొద్ది సెకన్లు అమానవీయ ఘటనకు లోనైన మహిళలు గురించి మాట్లాడారు. మణిపూర్ ఘటనలపై మహిళా న్యాయవాదులతో కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
గుజరాత్ లోని గోద్రా అల్లర్ల కేసును విచారిస్తున్న సీబీఐ కోర్టు జడ్జి లోయ అనుమానాస్పద మరణం తర్వాత బీజేపీ ప్రభుత్వానికి కోర్టుల్లో ఎదురులేకుండా పోయింది. ఇప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ఒక్కరే అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు.
అంధభక్తుల అబద్దాలు
ఇద్దరు మహిళల వీడియో వైరల్ కాగానే దేశప్రజల్లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నసమయంలో అంధభక్తులు (బీజేపీ అనుకూలురు) డజన్ల కొద్దీ ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మైయిటీల (హిందూ) అమ్మాయినే వివస్త్రగా తిప్పారని, శాంతిని నెలకొల్పడం కోసం వచ్చిన అసోం రైఫిల్స్ ను రానీకుండా చేస్తున్నారని క్రైస్తవ కుకీలపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల రోజుల క్రితం జరిగిన పశ్చిమబెంగాల్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ మహిళా నాయకురాలిని వివస్త్రగా తిప్పారని అప్పుడు ఎందుకు ఎవరూ మాట్లాడలేదని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలేవీ జరగలేదని అక్కడి పోలీసు ఉన్నతాధికారులు తేల్చి చెప్పారు.
బాధితులే నిందితులు
ఢిల్లీలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ట్రాన్స్ జెండర్ బాబీ కిన్నార్ గెలుపును జీర్ణించుకోలేని బీజేపీ తన అభ్యర్థి గెలిచారని ప్రకటించింది. అయితే ఆమెకు బాటగా నిలిచిన మరో ట్రాన్స్ జెండర్ చీరవిప్సేసి తన నిరసన తెలపడంతో పోలీసులు, అధికారులు రీకౌంటింగ్ కి అనుమంతించగా, బాబీ కిన్నార్ గెలుపొందారని ప్రకటించక తప్పలేదు. ఆ వీడియోతో మణిపూర్ కుకీలు మిలటరీ వారిని నిరోధిస్తున్నారని ఫేక్ ప్రచారం చేస్తున్నారు మైయిటీలు. అమానుషం జరిగింది కుకీ క్రిస్టియన్ల పై కాగ, మైయిటీలపై జరిగిందని, హిందూత్వవాదులు దుష్ప్రచారం చేస్తున్నారు. మయన్మార్ లో ఆయుధాలు చేపట్టిన వారిని చూపుతూ కుకీలు, నాగాలు ఆయుధాలతో హింసను ప్రేరేపిస్తున్నారని ఫేక్ న్యూస్ ను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. వేలమంది సోషల్ మీడియా లో అబద్దాలను ప్రచారం చేస్తుంటే, లక్షల మంది వాటిని వైరల్ చేస్తూ.. బాధితులనే నిందితులుగా వక్రీకరిస్తున్నారు.
విస్తరిస్తున్న హింస
దుర్మార్గాలపై దేశం అంతా ప్రశ్నిస్తుందన్న కసితో వారి హింసను పక్కరాష్ట్రాలకు (బీజేపీ అధికారంలోని) కూడా విస్తరించారు. అందులో భాగమే హర్యాన లోని లూహ్, గురుగావ్ హింసాత్మక సంఘర్షణలు. అక్కడి అల్లరి మూకలు ముస్లింలను లక్ష్యంగా చేసుకొని లూటీలు, దహనాలు, హత్యలకు పాల్పడుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇంకా 9 నెలల సమయం ఉండటంతో క్షణం క్షణం దేశ ప్రజలు అభద్రతా భావానికి గురౌతున్నారు.
ఐకమత్యమే బలం
ప్రేరేపిత హింస దేశ ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నమాట నిజమేకావచ్చుగాని, ఎల్లకాలం ఇదే ప్రక్రియలో ఏలుదాం అనుకుంటే మాత్రం బొక్కబోర్లా పడక తప్పదు. కుల, మత,ప్రాంత, భాషలకు అతీతంగా దేశ ప్రజలంతా ఒక్కటై మణిపూర్లో ఆమానుషానికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించి, శాంతిని నెలకొల్పాలని కదం తొక్కడమే ఇందుకు నిదర్శనం.