విధానపరమైన లోపాలతో చేనేతకు తీవ్ర నష్టం
మన దేశంలో చేనేత వస్త్రాలకు, ముఖ్యంగా చీరలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మన దేశంలో తయారయ్యే చేనేత వస్త్రాలు నాణ్యమైనవిగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా చేనేత చీరలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు ప్రసిద్ది పొందాయి. చేనేత వస్త్రాలు ధరించడం ఆరోగ్యానికి మంచిదని అందరూ గ్రహిస్తున్నారు. దాంతో వాటికి డిమాండ్ పెరుగుతోంది. చేనేత కార్మికులకు మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల వారు తగిన ఫలితం పొందలేకపోతున్నారు.
మార్కెటింగ్ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలనే చేనేత కార్మికులూ ఎదుర్కొంటున్నారు. స్వాతంత్య్రోద్యమంలో కూడా చేనేత కీలక భూమిక పోషించింది. చేతి వృత్తి అయిన చేనేత రంగంలో మన దేశంలో లక్షలాది మంది జీవిస్తున్నారు. అటువంటి చేనేత వస్త్రాలపై 5 శాతం జీఎస్‌టీ విధించడం అత్యంత దారుణం. అంతే కాకుండా, చేనేతకు ఉపయోగించే నూలుకు వేసే రంగులు, రసాయనాపై 18 శాతం జీఎస్టీ విధించారు. దాంతో చేనేత వస్త్రాల ధరలు పెరిగిపోయాయి. ప్రభుత్వ విధానాల వల్ల వస్త్రాల ధరలు పెరిగాయి గానీ, చేనేత కార్మికులకు మజూరీలు పెరగలేదు. చేనేతను కుంగదీస్తున్న, చేనేత కార్మికులకు తీవ్రమైన పోటీ ఇస్తున్న పవర్ లూమ్ వస్త్రాలపై 6 శాతం మాత్రమే జీఎస్టీ విధించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చేనేత ఉత్పత్తులపై పన్ను విధించడం అన్యాయం. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు అనేక ఉద్యమాలుచేశారు. చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టి ప్రధానిమోదీకి లేఖలు రాశారు. చేనేతకార్మికులు అసంఘటితంగా ఉండటం వల్ల ఉద్యమాన్ని రైతులు మాదిరిగా బలంగా నిర్వహించలేకపోతున్నారు.
ఏపీ బడ్జెట్ లో
ఏపీ బడ్జెట్ లో చేనేత రంగానికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. వైఎస్ఆర్ నేతన్న పథకానికి మాత్రం రూ.200 కోట్లు కేటాయించారు. అందులో రూ.3 కోట్లు వరకు ఉద్యోగుల జీతాలకు పోతాయి. రాష్ట్రంలో రెండు లక్షల మంది చేనేత కార్మికులు ఉంటే 81,700 మందికి మాత్రమే ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు.
ఈ పథకం వర్తించడానికి రూపొందించిన నిబంధనలు చాలా విచిత్రంగా ఉన్నాయి. సొంత ఇల్లు ఉండి కానీ లేక అద్దెకు ఉండే ఇంట్లో మగ్గం పెట్టుకుని తమ వ్రుత్తి ని చేసుకుంటున్న చేనేత కార్మికులకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశారు.
సొంత ఇల్లు లేక పోయినా, చేనేత మగ్గం కూడా పట్టే అంత ఇంటికి అద్దె చెల్లించలేని వారు ఇతర చేనేతలు పెట్టిన మగ్గాల షెడ్లలో కూలీగా నేత నేచుకుని అత్యంత దయనీయంగా బతికేవారికి మాత్రం ఈ వైఎస్ఆర్ నేతన్న పథకం వర్తించడంలేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వ పెద్దలకు, ఉన్నతాధికారులకు చేనేత రంగం గురించి తెలియకపోవడం, అధికార పార్టీ (ఏ పార్టీ అయినా సరే)లలోని చేనేత కులాలకు చెందిన నేతలకు పరిస్థితులు వివరించే అవకాశం రాకపోవడం లేదా అంతటి ధైర్యం చేయలేకపోవడమే.
ఇక చేనేత సహకార సంఘాల విషయానికి వస్తే రాష్ట్రంలో 950 వరకు సంఘాలు ఉన్నాయి.వీటిలో బోగస్ సంఘాలు అనేకం ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిజమైన చేనేత కార్మికులు కాకుండా ఈ బోగస్ సంఘాలు ఏర్పాటు చేసినవారు నాబార్డు రుణాలు, ప్రభుత్వ రాయితీలు పొందడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. వాటిని వదిలేసినా, మిగిలిన నిజమైన సంఘాలకు ప్రభుత్వం నుంచి, ఆప్కో నుంచి రావలసిన బకాయిలు ఎన్నో ఏళ్లుగా పేరుకుపోతున్నాయి. తెలంగాణలో 615 చేనేత సహకార సంఘాల వరకు ఉన్నాయి. నూలు, రంగులపై 40 శాతం వరకు రాయితీ ఇస్తున్నారు. నేతన్న బీమా, నేతన్నకు చేయూత తదితర పథకాలు అమలు చేస్తున్నారు. అయితే, తెలంగాణలో కూడా పవర్ లూమ్ పై తయారైన వస్త్రాలను బతుకమ్మ చీరలుగా ఇస్తున్నారన్న విమర్శ ఉంది.
కేరళ, తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు కొంతవరకు చేనేత రంగంపై శ్రద్ధ చూపుతున్నాయి. ముఖ్యంగా కేరళలలో చేనేత కార్మికులకు అనేక సౌకర్యాలు ఉన్నాయి. అక్కడ సహకార సంఘాల వ్యవస్థ పఠిష్టంగా ఉంది. అక్కడి చేనేత కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మహిళా చేనేత కార్మికులకు ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు ఉన్నాయి. మన ప్రభుత్వంలోని చేనేత నాయకులు అక్కడి సౌకర్యాలను అధ్యయనం చేసి, ఇక్కడ అమలు చేయవలసిన అవసరం ఉంది. తెలంగాణలో చేనేత మిత్ర పథకం కింద నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నారు. బతకమ్మ చీరలను చేనేత రంగం నుంచే తీసుకుంటారు. చేనేత పార్కుల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అన్ని రంగాల్లో దళారీ వ్యవస్థ వేళ్లూనుకుపోయిన సమాజం మనది. మార్కెటింగ్ సౌకర్యం లేక కష్టపడి పండించే రైతులకు గిట్టు ధర రాదు.ఇంటెల్లపాది రాత్రి పగలు శ్రమించే చేనేత కార్మిక కుటుంబాలకు తగిన కూలి గిట్టదు. ప్రభుత్వాలు వారికి కావలసిన మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించలేకపోతున్నాయి.
చేనేత కార్మికులకు, వినియోగదారునికి మధ్య ఉండే దళారీ వ్యవస్థను తొలగించి ‘వీవర్ టు కస్టమర్’ విధానం ద్వారా అటు నేతన్నలకు, ఇటు వినియోగదారులకు ఉపయోపడే వ్యవస్థను రూపొందించాలని చేనేత కార్మిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. చేనేత వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్ర,స్నాప్డీల్ వంటి ఆన్ లైన్ మార్కెట్ లో ఉంచాలని వారు కోరుతున్నారు. అలా నేరుగా చేనేత కార్మికుడే వ్యాపారం చేయడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం సాధ్యం కాదు.ఎందుకంటే జీఎస్టీ నెంబర్ లేనిదే ఆన్ లైన్ లో అమ్మడం వీలుకాదు. అందువల్ల ప్రభుత్వం ప్రత్యేక మార్కెటింగ్ వ్యవస్థను రూపొందించవలసి ఉంది. ప్రపంచ స్థాయిలో ఈ ఉత్పత్తులను మార్కెట్ చేసే అవకాశం ఉంది. చేనేత వస్త్రాల ఉత్పత్తికి కావలసిన ముడి పదార్థాలు పత్తి ఉత్పత్తి నుంచి ఇతర అన్న వనరులు ఇక్కడ పుష్కలంగా లభిస్తాయి. నైపుణ్యత కలిగిన శ్రామికులు ఉన్నారు. నిర్వహణ, సాంకేతికత రెండింటిలోనూ అధిక శిక్షణ పొందిన మానవశక్తి ఉంది. అందువల్ల ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందిస్తే చేనేత కార్మికుల బతుకులు బాగుపడటమే గాక ఎగుమతుల ద్వారా దేశం ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. అందువల్ల చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో నిధులు కేటాయించవలసిన అవసరాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించవలసిన అవసరం ఉంది.
– శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్టు – 9440222914