మేధావుల మదిలో ఇస్లాం – కవి కరీముల్లా సామాజిక వ్యాసం
————————————–
ఇస్లాం ఓ కారుణ్య ఛాయ, దైవం పంపిన అనుగ్రహాల ఊట. ఈ నీడలో కోట్లాదిమంది సేద తీరారు. దాని కరుణామృతాన్ని గ్రోలారు. నిజానికి ఇస్లాం అనేది ఒక మతం కాదు. ముహమ్మద్ (స) కేవలం ముస్లింల ప్రవక్త కాదు. సర్వమానవులను సన్మార్గం వైపుకు మళ్ళించడానికి వచ్చిన అంతిమ దైవ ప్రవక్త. పవిత్ర ఖుర్ఆన్ సర్వమానవులకు హితోపదేశం గరపటానికి వచ్చిన అంతిమ దైవ గ్రంథం.ముస్లిం అంటే ఒక జాతి పేరో, మతం పేరోకాదు. ముస్లిం అనే అరబ్బీ పదానికి ‘దైవ విధేయుడు’ అని అర్థం వస్తుంది. అంటే ఈ సృష్టిలో దైవానికి లొంగి దైవాజ్ఞనుఅనుసరించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనుషులు అందరూ ముస్లింలే.ఇస్లాం మనుషుల్ని జాతి పేరుతోనో, మతం పేరుతోనో, ప్రాంతం పేరుతోనో, లింగం పేరుతోనో విభజించదు. మానవులంతా పరస్పరం సోదరులేనన్న విశ్వమానవ సౌభ్రాతృత్వ ప్రేమను బోధిస్తుంది. నిజమైన ముస్లిం సర్వమానవుల్ని ప్రేమిస్తాడు. ద్వేషాన్ని ప్రేమతో జయించమనే ప్రవక్త(స) బోధను అనుసరిస్తాడు. దైవ ప్రవక్త ముహమ్మద్(స) వ్యక్తిగతంగా తనపై జరిగిన హింసను చిరునవ్వుతో భరించారు. తన ప్రియతమ బాబాయినిచంపి ఆయన కాలేయాన్ని నమిలిన వారిని సైతం తనకు దొరికినపుడు క్షమించారు.ఇదే బాటను అనుసరిస్తూ ఆయన (స) అనుయాయులు అరేబియా మండుటెండల్లో మలమల మాడ్చబడ్డారు. కొరడాలతో కొట్టించుకున్నారు. ఇనుప రంపాలతో కోయించుకోబడ్డారు. తమభార్యాబిడ్డల్ని, సిరిసంపదల్ని, చివరికి తమ ప్రాణాల్ని సైతం ఇస్లాంకోసం తృణప్రాయంగా అర్పించారు. వీరి మహత్తర త్యాగాలతో ఇస్లాం నేల నాలుగుచెరుగులా వ్యాపించింది. అనేక రాజ్యాలు, సైనిక బలగాలు ముస్లింలపై దాడులు చేసి లక్షల మందిని హతమార్చగలిగాయి కానీ ఇస్లాంలో వున్న అపూర్వమైన ప్రేమైక శక్తి ముందు ఓడిపోయి ఇస్లామియా రాజ్యాలుగా మారిపోయాయి. ఇంతటి మహత్తర శక్తిగల ఇస్లాం అనేకమందిమేధావుల హృదయాల్ని జయించింది. తాము ఏ మతానికి చెందిన వారైనా ఇస్లాంపై తమకున్న అభిమానాన్ని, మమకారాన్ని పలు సందర్భాలలో వారు ప్రకటించుకున్నారు.
ఇందులో పాలకులు, చరిత్రకారులు, సిద్ధాంతకర్తలు, కవులు, రచయితలు, వైజ్ఞానిక వేత్తలు ఇలా అన్ని రంగాలకు చెందిన మేధావులున్నారు. వీరిలో మచ్చుకు కొందరిఅభిప్రాయాలను తెలుసుకుందాం. ప్రపంచ ప్రసిద్ది చెందిన మేధావి జార్జిబెర్నార్డ్ షా ఇస్లాంను గురించి వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇలా వున్నాయి.
” నేను ఎల్లప్పుడు ముహమ్మద్ (స) ధర్మాన్ని దాని అద్భుత సచేతన చైతన్యం దృష్ట్యా అత్యున్నతంగా గౌరవిస్తాను. మారుతున్న జీవన స్థితిగతులను తనలో ఇముడ్చుకునే సామర్థ్యం కల ఏకైక ధర్మంగా అది మాత్రమే కనబడింది. ఇస్లాంకున్న ఈ గుణం దానిని అన్ని కాలాలకు అన్వయించేదిగా తయారు చేసింది. నేను ముహమ్మద్(స) గురించి అధ్యయనం చేశాను. ఆయనో అద్భుతం. నా దృష్టిలో ఆయన క్రీస్తు విరోధి ఎంత మాత్రమూ కాదు. ముహమ్మద్ (స) ను మానవాళి రక్షకుడు అని పిలవక తప్పదు. ఆయన బోధించిన ధర్మం గురించి నేను జోస్యం చెప్పాను. ఏ విధంగానైతే ఇస్లాం నేడు యూరప్కు అర్థమౌతూవుందో అదే విధంగా రేపు యూరప్కు స్వీకార యోగ్యమౌతుంది.”
-ది జెన్యూన్ ఇస్లాం, సంచిక 8, 1వ సంపుటి 1936.
భారతదేశ స్వాతంత్ర్యానికై ఎన్నో మహత్తర త్యాగాలు చేసిన మన జాతి పిత గాంధీజీ సైతం ఇస్లాంను గురించి ఇలా వివరించారు.
“నేడు లక్షలాది మానవుల హృదయాలను నిర్ద్వందంగా వశపర్చుకున్న ఆ ఉత్తమ ప్రవక్తను గురించి తెల్సుకోదలిచాను. జీవన రంగాన ఇస్లాంకు ఉన్నత స్థానం అందజేసింది కరవాలం కాదని నమ్ముతున్నాను. అది ప్రవక్తలోని ఖచ్చితమైన నిరాడంబరత, అనన్యమైన నిస్వార్థత, ఇచ్చిన మాటపై నిలబడే నిర్ద్వందమైన పట్టింపు, తన సన్నిహితులు, సహచరులపై ఆయన ప్రగాఢ ప్రేమభావం, నిర్భయత, కనబర్చిన అచంచలమైన దైవ విశ్వాసం, తన ధ్యేయం పట్ల కదలించినలవి కాని నిలకడ, నమ్మకం ఇవే వారిని ముందుకు తీసుకువెళ్ళింది.
“ఒకసారి కాదు అనేక సార్లు నేను దివ్య ఖుర్ఆన్ చదివాను. సత్యము, అహింస పవిత్ర ఖుర్ఆన్లో బోధింపబడిందని తెల్సుకుని సంతోషంతో పరవశించి పోయాను.”
ఆధారం : యంగ్ ఇండియా 1924
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫ్రెంచి పాలకుడు నెపోలియన్ బోనా పార్టీ సైతం తన జీవితంలో తనని విశేషంగా ఆకర్షించిన ధర్మం ఇస్లాం అంటూ తన అభిప్రాయాన్ని తన జీవిత చరిత్రలో నిర్మొహమాటంగా ఇలా వ్యక్తీకరించారు.
“అన్ని దేశాలలోని మేధావులు, విద్యావంతులు ఒకటిగా గుమికూడి దివ్య ఖుర్ఆన్లో నిర్వచించబడిన దాని కనుగుణంగా ఒకే విధమైన పరిపాలనా విధానాన్ని స్థాపించే కాలం ఎంతో దూరంలో లేదు. అది కనుచూపు మేరలోనే వుంది. దివ్యఖుర్ఆన్లోనిప్రవచనాలు సత్య ప్రధానమైనవి. అవి మనిషి జీవితాన్ని సత్యపథంలో, ఉన్నత పథంలో నడిపించగలిగిన శక్తిని కలిగివున్నాయి.
ఈ కారణం చేతనే దేవునిచే పంపబడినటువంటి దివ్యదూత అయిన ముహమ్మద్(స) ఔన్నత్యము, పవిత్ర గ్రంథమైన ఖుర్ఆన్ ఔన్నత్యము, అవి పొందుతున్న అపూర్వ స్థానం, గౌరవం ఎదుట నేను శిరస్సు వంచుతున్నాను.”
ఆధారం : హిస్టరీ ఆఫ్ నెపోలియన్ (పేజి నెం.218)
ప్రసిద్ధిచెందిన చరిత్రకారుడైన ఎడ్వర్ట్ గిబ్బన్ తన పుస్తకంలో ఇలా వివరించారు. “ముహమ్మద్(స) జీవితం మనోన్నతంగా విజయవంతం కావడానికి ప్రభావం చూపింది. కేవలం నైతిక శక్తి మాత్రమే. అందులో కరవాలానికి ఎలాంటి పాత్రలేదు. సకల మతాలను కరవాల బలంతో అంతమొందించాలన్న విధిని, వినాశకరమైన ఓ నమ్మకాన్ని ముస్లింలపై బలవంతంగా రుద్దారు. ఈ అజ్ఞానపు నింద, మోసపూరితమైన అపవాదు దివ్య ఖుర్ఆన్ ద్వారా, ముస్లిం విజేతల చరిత్ర ద్వారా, క్రైస్తవ ఆరాధకుల పట్ల వారు కనబరిచిన చట్టపరమైన, బహిరంగమైన సహనం ద్వారా ఖండించబడింది. ముహమ్మద్ (స) జీవితంలో ఎదురైన గొప్ప విషయం కేవలం నైతిక బలం ద్వారానే సాధ్యమైనది. కత్తి దెబ్బ ఒక్కటీ లేకుండా.”
“నేను దైవాన్ని నమ్ముతున్నాను. ముహమ్మద్(స)ను ఆయన ప్రవక్తగా విశ్వసిస్తున్నాను అన్నది అతి సాధారణమైన ఏకైక సూక్తి ఇస్లాం స్వీకరించడానికి బుద్ధి గ్రాహ్యమైన దైవ స్వరూపాన్ని సారూప్య విగ్రహం ద్వారా కించపర్చడమన్నది ఎన్నడూ జరుగదు. ప్రవక్తకు ఇచ్చే గౌరవాదరణలు ఉత్తమ మానవ ప్రమాణాలను ఎన్నడూ మించిపోలేదు. ఆయన జీవన విధానాలు, ఆయన అనుయాయుల కృతజ్ఞతా భావాన్ని హేతువును, ధర్మాన్ని ఎన్నడూ అతిక్రమించనివ్వలేదు. ఇదే ఇస్లాం గొప్పదనం”.
— హిస్టరీ ఆఫ్ సారసిన్ అంపైర్, లండన్
మనదేశానికి చెందిన ప్రముఖ కవయిత్రి సరోజిని నాయుడు ఇస్లాంను గురించి సవివరంగా వివరించారు.
“న్యాయ భావన అన్నది ఇస్లాంలోని ఓ అత్యద్భుత ఆదర్శం. ఎందుకంటే నేను ఖుర్ఆన్ చదువుతున్నప్పుడు జీవితానికి సంబంధించిన గొప్ప సిద్ధాంతాలను కనుగొన్నాను. అవి కల్పితాలు కావు. నిత్య జీవితంలోని ఆచరణాత్మకమైన విలువలు, యావత్ప్రపంచానికిపొసిగేవిలువలు.ప్రజాస్వామ్యాన్ని ప్రబోధించి, ఆచరించి చూపిన ఏకైక ధర్మం ఇస్లాం. ఎందువల్లనంటే మస్జిదుల్లో నమాజ్ కై పిలుపు ఇచ్చినపుడు ఆరాధకులంతా ప్రోగయినప్పుడు ఇస్లాంప్రతిపాదించే ప్రజాస్వామ్యం ప్రతిదినం ఐదు పూటలా మూర్తీభవించి దర్శనమిస్తుంది.అక్కడ రాజు,రైతు పక్కపక్కనే కూర్చుని అల్లాహో అక్బర్ (దేవుడు గొప్పవాడు )అని పలుకుతారు. నేను పలుమార్లు ఇస్లాంలోని ఈ సమత్వం, ఏకత్వం మూలంగా ప్రభావితురాలినయ్యాను. ఇది మనిషిలోని అంతర్ ప్రేరణ ద్వారా సోదరభావాన్ని సృజిస్తుంది”. – ఐడియల్స్ ఆఫ్ ఇస్లాం,1918
నేడు యూరప్లో ఇస్లాంపై దుష్ప్రచారం మీడియాలో ఒక పధకం ప్రకారం కొనసాగుతున్న దశలో ఓ సందర్భంలో బ్రిటీష్ యువరాజు ఛార్లెస్ అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో ఆక్స్ఫర్డ్ సెంటర్లో తన ప్రసంగంద్వారా మొత్తం బ్రిటీష్ ప్రజల్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు. ఆ ప్రసంగంలోని కొంత భాగం ఏమంటే.
“మానవ జీవితానికి సంబంధించిన సమస్త రంగాలు సంక్షోభంలో పడికొట్టుకుంటున్న వర్తమాన దశలో ప్రపంచం యావత్తు నేడు ఇస్లాం వైపు చూడడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇస్లాం భావజాలాన్ని పలక మీద అక్షరాల వలె సునాయాసంగా తుడిచి పెట్టగలమని భావించిన వారు ఘోరంగా విఫలమయ్యారు. వైఫల్యాన్ని అంగీకరించలేని వారు నిస్పృహతో నేడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజం మీద హింసా దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైనం మనం పత్రికల్లో చూస్తున్నాం.
ఇస్లామియా సంస్కృతిని, విజ్ఞానాన్ని చిన్న చూపు చూడటం మన సమాజం మానుకోవాలి. ఇస్లామియా సమాజం నుంచి ఇతర సమాజాలు ముఖ్యంగా మన పాశ్చాత్య సమాజం స్వీకరించవల్సింది. నేర్చుకోవాల్సింది చాలా వుంది.”
ఆధారం : స్పీచెస్ ఆఫ్ ఛార్లెస్, లండన్.
ఇలా ఎంతోమంది మేధావులు ఇస్లాంపై తమ ప్రేమను ప్రకటించారు. భవిష్యత్తు ఇస్లాందేనన్న నమ్మకాన్ని ప్రకటించారు. ఇప్పుడు ముస్లింలు నిరాశ నిస్పృహలతో క్రుంగిపోవటం మానుకోవాలి. తమపై జరుగుతున్న హింసకు సమాధానంగా ప్రేమ, శాంతి అనే నిజమైన ఇస్లాం భావాలతో మమేకమై ప్రవక్త ముహమ్మద్ (స) మార్గంలో నడిస్తే ప్రపంచ ప్రజల హృదయాల విజేతలు ముస్లింలే కాగలరనటంలో అతిశయోక్తి లేదు.