అన్నదాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తూ..
రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ
2023 వర్షాభావం (కరువు), డిసెంబర్, 2023 మిచాంగ్ తుపాను ప్రభావంతో సంభవించిన అధిక వర్షాల వల్ల నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు రూ1,294.58 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నేరుగా జమ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే…
మొట్ట మొదటిసారి పరిస్థితులు మారాయి..
ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. గతంలో పారదర్శకంగా జరగాల్సిన మంచి జరుగుతుందా? అని ఎవరైనా ఒక 5 సంవత్సరాల కిందట ప్రశ్నిస్తే అది అయ్యేపని కాదనే సమాధానమే వచ్చేది. ఎందుకంటే ఏరోజూ కూడా అటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి. కానీ మొట్టమొదటి సారిగా అటువంటి పరిస్థితులు మారాయి. గ్రామ స్థాయిలో ఆర్బీకే రావడం, గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం, గ్రామ స్థాయిలోనే రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఒక వ్యవస్థ తోడుగా ఉంది.
పంట సాగు వేసిన ప్రతి ఎకరా కూడా ఇ-క్రాప్‌లోకి నమోదు కావడం, ఆ ఇ- క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరు వేశారు? , ఎన్ని ఎకరాల్లో వేశారు? , అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం, ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల గానీ, మరో కారణం వల్ల గానీ ఏ పంట ఎప్పుడు నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ డిస్ ప్లే చేస్తున్నాం.
పూర్తి పారదర్శకంగా జాబితాల ప్రదర్శన..
ఇదిగో ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతన్నలు నష్టపోయారు, ఇన్ని ఎకరాల్లో నష్టపోయారు ఇదిలో లిస్టు అని ఏకంగా సచివాలయంలో పెట్టడం. రైతులు చూసుకొనే వెసులుబాటు రావడం, ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు జరిగితే కరెక్షన్ చేసుకొనే వెసులుబాటు ఉండటం.. ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం, వచ్చిన తర్వాత ఎక్కడా కరప్షన్ లేకుండా, వివక్షకు చోటు లేకుండా, పూర్తి పారదర్శకంగా ఆ లిస్టులు డిస్‌ప్లే చేసి, ఇంకా ఏదైనా పొరపాటు, కరెక్షన్ ఉంటే తీసుకుంటూ, ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి వివక్షకూ తావివ్వకుండా, లంచానికి అవకాశం ఇవ్వకుండా, ప్రతి రైతుకూ అందాల్సిన సహాయం, అందాల్సిన సమయంలో అందిస్తున్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల పాలనలోనే జరుగుతోందని చెప్పడానికి రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడుతున్నాను. ఆనందపడుతున్నాను.
ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఇలాంటిది చేయగలుగుతాము, జరగగలుగుతుంది అని ఎవరైనా అంటే నమ్మే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు నమ్మకం కలిగిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటూ అడుగులు వేస్తోంది.
తడిసిన ధాన్యాన్ని కొన్న ప్రభుత్వం మనది మాత్రమే..
మొన్న మిచాంగ్ తుపానులో పంట నష్టపోతే.. రంగు మారిన ధాన్యం.. ఇంతకు ముందెన్నడూ కొనే పరిస్థితి కూడా లేదు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో ఎప్పుడూ చూడలేదు. అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదని చెప్పి మొట్ట మొదటి సారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి. మొన్న మిచాంగ్ తుపాను వచ్చినప్పుడు కూడా దాదాపు 3.25 లక్షల టన్నులు రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది.
అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండటం కోసం ఉంది. అన్ని రకాలుగా అందాల్సిన సహాయం సమయానికే కరెక్టుగా ఇస్తూ తోడుగా నిలబడుతుందన్న భరోసా మొట్టమొదటిసారి ఈ 58 నెలల కాలంలో కలిగించాం.
ఇలా అడుగులు ముందుకు వేస్తూ, ఈ రెండు విపత్తుల వల్ల.. గతేడాది ఖరీఫ్‌లో వర్షా భావం వల్ల, రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుపాను నష్టం వల్ల.. నష్టపోయిన 11.61 లక్షల మంది రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీగా మంచి చేస్తూ ఈరోజు రూ.1,295 కోట్లు విడుదల చేస్తూ అడుగులు ముందుకు వేసే మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల జరుగుతోంది.
ప్రతి అడుగులోనూ కరెక్టుగా రైతన్నకు ఎప్పుడు సహాయం అందాలి, ఎప్పుడు తోడుగా ఉండాలి అని కరెక్టుగా ఆ సహాయం అందే కార్యక్రమం మొట్ట మొదటిసారిగా జరుగుతోంది. ఇన్సూరెన్స్ పరంగా కూడా చూసుకుంటే మొట్ట మొదటిసారి ఈ 58 నెలల కాలంలో 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇచ్చింది రూ.7,802 కోట్లు. అది కూడా రైతుల దగ్గర నుంచి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోకుండా, కట్టాల్సిన అవసరం రైతులకు రాకుండా, లేకుండా, ప్రభుత్వమే ఆ కార్యక్రమం చేసి రైతులకు తోడుగా నిలబడింది.
5 సంవత్సరాల గత ప్రభుత్వ పాలనతో కంపేర్ చేస్తే 2014_19 మధ్య కాలంలో ఇన్సూరెన్స్ వచ్చింది ఎంతమందికంటే.. 30.85 లక్షల మందికి మాత్రమే. అది కూడా రూ.3,411 కోట్లు మాత్రమే. అది కూడా గత ఐదు సంవత్సరాల చంద్రబాబు పాలనలో ప్రతి సంవత్సరం కరువే. కరువే వస్తున్నా కూడా కేవలం 30 లక్షల మంది రైతులకు మాత్రమే కేవలం రూ.3,411 కోట్లే ఇచ్చిన పరిస్థితి నుంచి ఈరోజు దేవుడి దయతో మంచి వర్షాలు ప్రతి సంవత్సరం పడుతున్నాయి. ఒక్క ఈ సంవత్సరమే కొద్దో గొప్పో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, వర్షాలు దేవుడి దయ వల్ల బాగా పడుతున్నాయి. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎప్పుడూ కూడా ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించే పరిస్థితి రాకుండా మంచి వర్షాలు కురిశాయి.
అటువంటి పరిస్థితుల్లో కూడా ఏకంగా రూ.7,802 కోట్ల ఇన్సూరెన్స్ ఇచ్చి 54.55 లక్షల మంది రైతులకు తోడుగా నిలబడగలిగాం. ఇవన్నీ వ్యవస్థలోకి ఒక సంపూర్ణమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇ- క్రాప్ ద్వారా రైతుకు ఇన్సూరెన్స్ ఆటోమేటిక్ గా వర్తింపజేసేలా అడుగులు మొట్ట మొదటిసారి పడుతున్నాయి.
ఇంతకు ముందు అయితే బ్యాంకు లోన్ల కోసం రైతు వెళ్లినప్పుడే, క్రాప్ లోను తీసుకున్నప్పుడే, 5 శాతం కటింగ్ తీసుకుని, ఆ లోను కోసం పోయిన రైతుకు మాత్రమే ఇన్సూరెన్స్ అనేది వర్తింపజేసే పరిస్థితి. అలా లోన్లకు పోలేని రైతులు గానీ, తెలియని రైతులకు గానీ ఇన్సూరెన్స్ అనేది వచ్చే అవకాశమే లేని పరిస్థితి నుంచి ఈరోజు ఎన్ని మార్పులు వచ్చాయో గమనించమని ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమేకమైన ప్రతి రైతన్న కూడా తెలియజేస్తున్నాను. ఒక కొత్త ఒరవడి అన్నది కేవలం ఈ 58 నెలల కాలంలోనే మొదలైంది.
మొట్ట మొదటి సారిగా రైతులకు పెట్టుబడి సహాయంగా ప్రతి రైతుకూ రూ.13,500 అందించే కార్యక్రమం కూడా ఇంతకు ముందెన్నడూ లేదు. గత 5 సంవత్సరాల చంద్రబాబు హయాంలో ఏరోజూ ఈ మాదిరిగా రైతు పంటలు వేసేటప్పుడు సాగు సమయంలో రైతులకు తోడుగా నిలబడాలనే ఆలోచన చేయలేదు.
లేటెస్ట్ లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 63 శాతం మంది రైతులకు 0.5 హెక్టారు మాత్రమే భూములున్నాయి. అదే 1 హెక్టారు దాకా చూసుకుంటే మరో 24 శాతం అంటే 87 శాతం మంది రైతులు ఒక హెక్టారు లోపు మాత్రమే ఉన్న రైతులు.. ఇది లేటెస్ట్ సబ్ డివిజన్ జరిగిన తర్వాత వచ్చిన లెక్కల ప్రకారం ఇది చూస్తున్నాం. అంటే ఈ 87 శాతం మంది రైతులు దాదాపు 70 శాతం ఏరియాను సాగు చేస్తున్నారు. ఇటువంటి రైతులందరికీ కూడా మరీ ముఖ్యంగా 63 శాతం ఉన్న రైతులకైతే ఈ రూ.13,500 రైతు భరోసా కింద అందుతున్న సాయం క్రమం తప్పకుండా ప్రభుత్వం ఇంతకు ముందు జరగని విధంగా ఇస్తున్న ఈ పెట్టుబడి సహాయం రైతులకు 80 శాతం పంటలకు 80 శాతం పెట్టుబడి సహాయంగా ఇది ఉపయోగపడుతోంది. ఇటువంటివన్నీ ఎప్పుడూ ఇంతకు ముందు లేవు. ఈ 58 నెలల కాలంలోనే జరుగుతున్నాయని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను.
సమృద్ధిగా వర్షాలు..
ఈరోజు ఈ నాలుగు సంవత్సరాలు సమృద్ధిగా పడిన వర్షాల తర్వాత గతేడాది మాత్రం ఖరీఫ్ సీజన్‌లో కొంత మేరకు వర్షం తక్కువ నమోదు కావడంతో మొత్తంగా 26 జిల్లాల్లోని 7 జిల్లాల్లో 103 మండలాలను కరువు మండలాలుగా ధృవీకరించడం జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో వ్యవసాయ, ఉద్యాన పంటలు నష్టపోయిన దాదాపుగా 6.96 లక్షల మంది రైతన్నలకు ఈరోజు ఆ ఇన్ పుట్ సబ్సిడీగా, ఆ ఖరీఫ్‌కు సంబంధించిన కరువుకు సంబంధించిన నష్టానికి గానూ ఈరోజు రూ.847 కోట్లు ఇవ్వడం జరుగుతోంది.
దీంతోపాటు మొన్న డిసెంబర్ రబీ సీజన్ ప్రారంభంలో మిచాంగ్ తుపాను వల్ల వ్యవసాయం, ఉద్యాన పంటలు నష్టపోయిన 4.61 లక్షల మంది రైతన్నలకు మరో రూ.442 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీగా కూడా విడుదల చేస్తున్నాం. ఈ రెండూ కలిపి 11.61 లక్షల మంది రైతన్నలకు మొత్తంగా రూ.1300 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేసే కార్యక్రమం జరుగుతోంది.
ఈ జూన్‌లో మళ్లీ వీరందరికి కూడా ఇన్సూరెన్స్ వస్తుంది. వీరందరికీ కూడా మంచి జరిగించే కార్యక్రమం ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. వీళ్లెవరూ ఎక్కడా నష్టపోకూడదని, వెంటనే తక్కువ వర్ష పాతం వల్ల అప్పట్లో పంటలు నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించడమే కాకుండా ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు కోసం సబ్సిడీ మీద విత్తనాలను కూడా వెంటనే వీళ్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఉలవలు, అలసంద, మినుము, పెసురు, కంది, రాగి, మొక్కజొన్న, పొద్దు తిరుగుడు, జొన్న వంటి తక్కువ కాల పంటల సాగు కోసం 30 వేల క్వింటాళ్లు రూ.26 కోట్లతో 1.14 లక్షల మంది రైతులకు సరఫరా చేయగలిగాం. మొన్న మిచాంగ్ తుపాను వల్ల డిసెంబర్ 4న నష్టం జరిగితే డిసెంబర్ 8వ తేదీకల్లా వాళ్లకు రూ.31 కోట్లతో 80 శాతం సబ్సిడీ మీద రాయితీతో 49,758 క్వింటాళ్ల విత్తనాలను 71,415 మంది రైతులకు వెంటనే ఆర్బీకేల ద్వారా సప్లయ్ చేస్తూ వాళ్లకు అందుబాటులో ఉంచి తోడుగా నిలబడగలిగాం.
ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే.. ప్రభుత్వం అన్నది రైతులకు అన్ని రకాలుగా ఇది మీ ప్రభుత్వం, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ ప్రభుత్వం వెంటనే స్పందిస్తుంది, వెంటనే తోడుగా ఉంటుందని భరోసా ఇస్తూ అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం అని చెప్పడానికి కొన్ని కొన్ని ఉదాహరణలు ఇవ్వాల్సి వచ్చింది.
ఈ కార్యక్రమం వల్ల ఇప్పటికే నష్టపోయిన రైతన్నలకు కొద్దో గొప్పో దీనివల్ల కాస్త ఊరట రావాలని మనసారా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం… అని తెలియజేస్తూ సీఎం తన ప్రసంగం ముగించారు.