Chandrababu – 5 సంతకాల సంబరం
ఎన్నికల హామీల అమలుపై ‘తొలి సంతకాల’తో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయం, నైపుణ్యం..
మెగా డీఎస్సీపైనే తొలి సంతకం
16,347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్ణయం
డిసెంబరు 31లోగా నియామక ప్రక్రియ పూర్తి ల్యాండ్ టైటిల్ చట్టం
రద్దుపై రెండో సంతకం
పేదలకు పింఛను ఇక 4 వేలు
వెయ్యి పెంచుతూ మూడో చేవ్రాలు
అన్న క్యాంటీన్లకు మళ్లీ శ్రీకారం
వాటి పునరుద్ధరణపైనే నాలుగో సంతకం
అమరావతి, జూన్ 13: ఎన్నికల హామీల అమలుపై ‘తొలి సంతకాల’తో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్యవసాయం, నైపుణ్యం… ఈ ఐదు రంగాలకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకాలు పెట్టారు. సంబంధిత జీవోలను కూడా వెంటనే జారీ చేశారు. బుధవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన… గురువారం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సతీమణి భువనేశ్వరితో కలిసి తన చాంబర్‌లో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఐదు కీలక హామీల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా ‘మెగా డీఎస్సీ’ని ప్రకటిస్తూ… ఆ ఫైలుపైనే చంద్రబాబు తొలి సంతకం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టడం ఇదే తొలిసారి. ఇక… జగన్ సర్కారు రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించేలా చేసిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’ రద్దుపై చంద్రబాబు రెండో సంతకం చేశారు. రైతుల భూములను వివాదాస్పదం చేసి, కబ్జాదారులకు కోరలు తొడిగేలా రూపొందించిన ఈ చట్టాన్ని సమాధి చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ చట్టంలోని లోపాలు, లోటుపాట్లను ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సవివరంగా చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని రద్దు చేస్తూ రెండో సంతకం పెడతానని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకున్నారు.
పేదల పింఛను రూ.4 వేలు
పేదల పింఛన్ మొత్తాన్ని రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచారు. చంద్రబాబు తన మూడో సంతకాన్ని ఈ ఫైలుపైనే చేశారు. 2019లోనే చంద్రబాబు పింఛను రూ.2వేలు చేశారు. దీనిని 3వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్… ‘విడతలవారీ’ పాట పాడారు. ఏటా రూ.250చొప్పున పెంచుతూ… ఐదేళ్లలో రూ.3వేలు చేశారు. కాగా… చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో రూ.వెయ్యి పెంచేశారు. ‘‘దీనివల్ల 66లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. మేం అధికారంలోకి వస్తే ఏప్రిల్ నుంచే పెరిగిన పింఛను అమలుచేస్తామని… ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో రూ.7వేలు ఇస్తామని చెప్పాం. దీనిప్రకారం… జూలైలో ఈ 3నెలల బకాయి 3వేలు, పెరిగిన పింఛను రూ.4వేలు కలిపి మొత్తం 7వేలు అందుతాయి. అలాగే దివ్యాంగుల పింఛను రూ.4వేల నుంచి 6 వేలకు పెంచుతున్నాం. వారికి బకాయిలతో కలిపి జూలైలో రూ.12 వేలు అందుతుంది’’ అని చంద్రబాబు వివరించారు.
‘అన్న’ క్యాంటీన్ల పునరుద్ధరణ
జగన్ రాగానే మూసేసిన ‘అన్న క్యాంటీన్ల’ను పునరుద్ధరిస్తూ చంద్రబాబు నాలుగో సంతకం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం, అల్పాహారాన్ని రూ.5కే అందించింది. వందల సంఖ్యలో వీటిని ఏర్పాటు చేశారు. పేదలు, కూలీలతోపాటు వివిధ పనులపై పట్టణాలకు వచ్చే ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించారు. టీడీపీ ప్రభుత్వానికి బ్రాండ్‌గా నిలిచిన అన్న క్యాంటీన్లను జగన్ మూసి వేయించారు. ఆ భవనాలను వార్డు సచివాలయాలు, ఇతర అవసరాలకు వాడుకున్నారు. ప్రస్తుతం ఎన్ని వీలైతే అన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని, దశలవారీగా మిగిలిన వాటిని అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక.. రాష్ట్రంలోని యువత, ప్రైవేటు ఉద్యోగుల్లో ఎటువంటి ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయో తెలుసుకొని… వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన నైపుణ్య గణన (స్కిల్ సెన్సెస్) నిర్వహణపై చంద్రబాబు ఐదో సంతకం చేశారు. వేడుకలా సాగిన ‘తొలి సంతకాల’ కార్యక్రమానికి కొత్తమంత్రులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గురువారం సాయంత్రం 4.41గంటలకు చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో గతంలో తాను వినియోగించిన కార్యాలయాన్నే ఆయన ఈసారీ ఎంచుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన కార్యాలయాన్ని సుందరంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ బాధ్యతలు స్వీకరించారు. తొలి సంతకాలకు సంబంధించిన లబ్ధిదారులు, సచివాలయ ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం పూర్తయిన వెంటనే సచివాలయ ప్రాంతంలో భారీవర్షం కురిసింది.