భ్రష్టు పట్టించారు!
మూడంటే మూడు నిమిషాలు! అయితేనేం… చంద్రబాబు సూటిగా, ఘాటుగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలకు క్లాస్ తీసుకున్నారు.
కానీ, ఐదేళ్లలో మొత్తం డ్యామేజ్ చేశారు
అజెండాతో పనిచేసి వ్యవస్థలను దెబ్బతీశారు
ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోండి
సీనియర్ బ్యూరోక్రాట్లకు సీఎం ‘క్లాస్’
అమరావతి
మూడంటే మూడు నిమిషాలు!
అయితేనేం… చంద్రబాబు సూటిగా, ఘాటుగా మాట్లాడారు. సీనియర్ ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలకు క్లాస్ తీసుకున్నారు. మరీముఖ్యంగా… జగన్ ప్రభుత్వ హయాంలో గీతదాటి వ్యవహరించిన ఉన్నతాధికారులు భుజాలు తడుముకునేలా చేశారు. ‘మీపట్ల గతంలో ఉన్న గౌరవం పోయింది’ అని చెప్పకనే చెప్పారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం గురువారం తొలిసారి సచివాలయానికి వచ్చిన చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు అఖిలభారత సర్వీసు అధికారులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. వారందరినీ ఒక హాలులో కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు అక్కడికే వెళ్లి క్లుప్తంగా మాట్లాడారు. ‘‘నేను ఉమ్మడి రాష్ట్రానికీ, నవ్యాంధ్రకూ ముఖ్యమంత్రిగా పని చేశాను. ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిని అయ్యాను. నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు నిబద్ధతతో పనిచేసేవారు. నాకూ ఐఏఎస్, ఐపీఎ్‌సలంటే గౌరవం ఉండేది. వ్యవస్థల్ని బాగా నడుపుతున్నారనే భావన ఉండేది. కానీ… గత ఐదేళ్లలో ఏం చేశారో ఆత్మ విమర్శ చేసుకోండి. వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారు. నిబంధనలు పక్కన పెట్టి, ఒక అజెండాతో పని చేసి మొత్తం డ్యామేజ్ చేశారు.
అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా దెబ్బతింది. వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని నేను ఊహించలేదు. గత ప్రభుత్వంపై ప్రజల్లో ఎన్నడూ లేనంత కసి కనిపించడానికి కారణం… ఐదేళ్లలో జరిగిన దారుణాలే. నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడటంలేదు. ఎప్పుడూ మాట్లాడను కూడా. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించే నా బాధ.
ఇప్పుడు వ్యవస్థల్ని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందుకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అధికారులంతా గుంభనంగా, మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు తనకు సమయం లేదని రెండు, మూడు రోజుల్లో మరోసారి అందరితో సమావేశం ఏర్పాటు చేస్తానని చంద్రబాబు చెప్పారు. అప్పుడు అన్ని అంశాలపైనా సుదీర్ఘంగా చర్చిద్దామని అక్కడి నుంచి వచ్చేశారు.