రాష్ట్రంలో నాలుగు పిహెచ్ సిలకు ఎన్కాస్ సర్టిఫికెట్లు
ఎన్ టిఆర్ జిల్లా కండ్రిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికీ కేంద్రం ప్రశంసలు
ఏపీలో రెండో యుపిహెచ్సీగా కండ్రికకు కేంద్రం గుర్తింపు
ఇటీవలే మొదటి యుపిహెచ్సీగా ఎన్కాస్ సర్టిఫికేట్ పొందిన మంగళగిరి లోని ఇందిరానగర్ యుపిహెచ్సీ
నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలతో గ్రామీణ, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సౌకర్యాలు కల్పించినందుకు ఏపీకి గుర్తింపు
రాష్ర్ట ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసిన కేంద్రం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల పట్ల కేంద్రం ప్రభుత్వం ప్రశంసించింది. ఎన్ టిఆర్ జిల్లా కండ్రిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యుపిహెచ్ సి)కి కూడా కేంద్రం ప్రశంసలు అందజేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి లోని ఇందిరానగర్ యుపిహెచ్సీ 96.2 స్కోరుతో రాష్ట్రంలో మొదటి యుపిహెచ్సీగా ఇటీవలే గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. పట్టణ , గ్రామీణ ప్రాంతాల్లో ఏపీ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రజారోగ్య సౌకర్యాల్లో నాణ్యతా ప్రమాణాల్ని స్వయంగా పరిశీలించిన కేంద్ర బృందం ఎన్ టిఆర్ జిల్లా కండ్రిక యుపిహెచ్ సికి 88.2 శాతం మార్కులు వేసింది. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామతీర్థం పిహెచ్ సి, సత్యసాయి జిల్లా విఎం చెరువు పిహెచ్ సి, అల్లూరి సీతారామరాజు జిల్లా యెల్లవరం పిహెచ్ సిలతో పాటు అన్నమయ్య జిల్లా పెదమాంద్యం పిహెచ్ సికి (షరతులతో కూడిన) నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ లను ప్రకటించింది. అన్ని రకాలుగా ఆయా విభాగాలు పూర్తి స్థాయిలో సంతృప్తికరమైన వైద్య సదుపాయాలు, సేవలందిస్తూ నాణ్యతా ప్రమాణాల్ని పాటించినందుకు గాను
కేంద్ర ప్రభుత్వం ఈ ధృవీకరణ పత్రాల్ని జారీ చేసింది.
నాణ్యమైన వైద్య సేవల్ని అందించడంలో రాష్ట్రానికి చెందిన ఎన్ టిఆర్ జిల్లా కండ్రిక యుపిహెచ్ సి కేంద్రం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాల ప్రకారం అత్యుత్తమ స్కోరును సాధించినం దుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి విశాల్ చౌహాన్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబుకు రాసిన ఒక లేఖలో అభినందనలు తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన అధికారుల బృందాలు జూన్ 23-24 తేదీల మధ్య పిహెచ్ సిలను సందర్శించి అక్కడి అన్ని విభాగాల పనితీరును పరిశీలించింది. కండ్రిక యుపిహెచ్ సి అన్ని విభాగాలలోనూ అత్యుత్తమ పనితీరు కనబరచి 88,2 మార్కులతో అగ్రస్థానంలో నిలిచిందని విశాల్ చౌహాన్ తన లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా నెల్లూరు జిల్లా రామతీర్థం పిహెచ్ సిలోని ఆరు విభాగాలు అన్ని అర్హతా ప్రమాణాలు కలిగి వున్నందున 83.4 శాతం మేర స్కోరును సాధించాయని ఆయన తెలిపారు. వీటితో పాటు సత్యసాయి జిల్లా విఎం చెరువు పిహెచ్ సి, అల్లూరి సీతారామరాజు జిల్లా యెల్లవరం పిహెచ్ సి, అన్నమయ్య జిల్లా పెదమాంద్యం పిహెచ్ సికి (షరతులతో కూడిన) ఎన్ క్యూఎఎస్ లో భాగంగా నాణ్యతా ప్రమాణాల ధ్రువీకరణ (క్వాలిటీ సర్టిఫికేషన్)ను మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. వీటిలో అందించే వైద్య సేవల్ని మరింత మెరుగుపర్చుకునేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని రాష్ట్ర నాణ్యతా ప్రమాణాల నియంత్రణా విభాగానికి అందజేయాలని ఆయన సూచించారు. రాష్ట్ర విభాగం ఈ కార్యాచరణ ప్రణాళిక అమలు తీరును పరిశీలించి తమ పరిశీలనా నివేదికలను ఎన్ హెచ్ ఎస్ ఆర్ సి ధ్రువీకరణ విభాగానికి అందచేయాల్సి వుంటుందన్నారు.