గజిబిజి గందరగోళం లేని గోలి మధు కవిత్వం
‘ఎదురీత’ పుస్తకంపై సమీక్ష
తెలుగు సాహితీ ప్రపంచంలోకి పదునైన కలంతో, ఆధునిక భావాలతో, అభ్యుదయ కవిత్వంతో దూకుడుగా దూసుకు వచ్చారు గోలి మధు. ఏ సమస్య చెప్పినా క్షణంలో ఆ సమస్యపై సాధారణ పదాలతో, అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతమైన కవిత రాయగల దిట్ట మధు. స్పష్టమైన దృక్పథంతో ఆయన కవితలు రాస్తారు. ప్రగతిశీల కవిత్వం రాస్తూ తెలుగు సాహిత్యంలో మధు అభ్యుదయ కవిగా మంచి పేరు సాధించారు. మధు ఓ చైతన్యం, ఓ మెరుపు, ఓ ఎరుపు. ఇంతకు ముందు మధు భారతీయ ధర్మ విశ్లేషణ, నవశకం, రైతు సమరభేరి, గమనం, సంఘర్షణ అనే అయిదు కవితా సంపుటిలను అందించారు. మధు ఆరవ కవితా సంపుటి ‘ఎదురీత’ను ఈ నెల(అక్టోబరు) 12న మంగళగిరి సాహితీ కళావేదిక ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు నన్నపనేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. మధు కవిత్వం నచ్చి, ముచ్చటపడి ఈ సంపుటి ముద్రణా దాతగా నన్నపనేని నాగేశ్వరరావు ముందుకు వచ్చారు. మధు చేసేది ప్రభుత్వ ఉద్యోగం అయినా, ప్రభుత్వాలపై తిరుగుబాటు కవిత్వం రాయగల ధైర్యవంతుడు. ప్రభుత్వాలేకాదు, సమాజంలోని రుగ్మతలన్నిటిపై సూటిగా, ఎంతో అందంగా కవితలు రాస్తారు. మనిషిగా ఎంత ఒదిగి ఉన్నా, కవిగా మాత్రం దేనికీ నెరవరు, తగ్గరు. తలెత్తుకుని మరీ కవిత్వం రాస్తారు. తన కవిత్వం మొత్తం ప్రతిబింబించే విధంగా ఈ సంకలనానికి ‘ఎదురీత’ అని అర్థవంతమైన శీర్షిక పెట్టారు. ఆయన ధోరణి ఈ కవితా సంకలనంలో స్పష్టంగా అర్థమవుతుంది. సమాజం పట్ల, తను రాయవలసిన కవిత్వం పట్ల స్పష్టమైన అవగాహన ఉన్న కవి . ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమానికి బాసటగా ‘రైతు సమరభేరి’ కవితా సంపుటి తీసుకువచ్చారు. మధు కవిత్వం ఎంత మక్కువతో రాస్తారో, ఉద్యోగం కూడా అంతే నిజాయితీ, నిబద్ధత, అంకితభావంతో చేస్తారు.
ఈ కవితా సంపుటిలోని 55 కవితలలో వివిధ విభిన్న పార్శ్వాలను స్పర్శించారు. ఇందులోని ప్రతి కవితలో భాష, భావం, శబ్దం, ప్రేమ, ఆత్మీయత, సామాజిక స్పృహ, ఆవేశం, ఉద్రేకంతో కూడిన ఓ కొత్తదనాన్ని పాఠకులకు అందించాలనే తపన ఆయనలో కనిపించింది. ఈ కవితలను చదవడం మొదలుపెడితే, చివరి వరకు పుస్తకం మూయలేరు. పాఠకులను అంతగా కట్టిపడేశాలా ఈ కవితలు ఉన్నాయి. సమాజం పట్ల, కవిత్వం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం స్పష్టంగా తెలుస్తోంది. ప్రజల పక్షం, బాధితుల పక్షం నిలిచిన కవి గోలి మధు. సజావుగా సాగే జీవితం తలక్రిందులైతే, కాలానికి ఎదురీది, తనని, తన చెల్లిని పెంచిన తీరు ద్వారా అమ్మ గోలి పార్వతీ దేవే తన ఎదురీతకు స్ఫూర్తి అని చెప్పడంలోనే మధు సంస్కారం తెలుస్తోంది. మంగళగిరి లయన్స్ క్లబ్ అధ్యక్షురాలిగా ప్రజాసేవలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన దివంగత నన్నపనేని లక్ష్మికి ఈ పుస్తకం అంకితం ఇవ్వడం ద్వారా ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం అర్థమవుతోంది.
గుడి కప్పులు ధగ ధగ మెరుస్తుంటే – బడి కప్పులు పెచ్చులూడి పడుతున్నాయి… గుళ్ల మీద చూపించిన శ్రద్ధ మనం బడులమీద చూపించడంలేదన్న బాధ వ్యక్తం చేశారు మధు. ఈ కవిత చదువుతుంటే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నటి, నిర్మాత మంచు లక్ష్మి గుర్తుకు వస్తారు. ‘‘కట్టాల్సింది దేవాలయాలు, చర్చిలు, మసీదులు కాదు… విద్యాలయాలు, వైద్య శాలలు’’ అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. మంచు లక్ష్మి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో పది, పది ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. అత్యధిక మంది దాతలు అలా ముందుకు వచ్చి బడులను బాగుచేయాలన్నదే మధు కోరిక. తమ పెంపుడు కుక్క ‘మిలో’ మరణించినప్పుడు మధు రాసిన 8 పేజీల కవిత పాఠకుల కంట తడిపెట్టిస్తోంది. పెంపుడు కుక్కలతో ఆ ఇంటి వారి అనుబంధం, వాటి చేష్టలు, అల్లరి, అరుపులు, చూపులు, ప్రేమ, వాటి ప్రవర్తనా తీరు…, వాటిపై ఇంట్లో వారు చూపించే ప్రేమ, అవి మరణించినప్పుడు వారు పడే బాధ… చాలా అద్బుతంగా రాశారు. దానిని అందరూ చదివి తీరవలసిందే. ముఖ్యంగా జంతు ప్రేమికులకు, కుక్కలను పెంచుకునేవారి మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది.
మనిషి మనిషికీ మతం మత్తు-సందు సందుకీ కులం కిక్కు, తడి గుడ్డతో గొంతులు తెగుతుంటాయి-తడి గుడ్డ వేసుకుని వేడుక చూస్తున్నంత కాలం, పీడితుల నడుమ ఐక్యత సాధించనంతవరకూ పీడకునిదే గెలుపు, ఒకటికి మరొకటి జత చేరనిదే ఒకటి లేనేలేదు – పరుగు పందెంలో ఒకటో స్థానానికి రెండు కాళ్లు, పోరుబాట చతికిల పడితే- సగటు మనిషి ‘చితి’కే, మణిపూర్‌లో తెగుతున్న తలకు- తెగల నడుమ వైరపు అబద్దం ఆభరణం, ఆర్థిక దాహానికి అధికారం తోడై పైశాచిక విహారం, మారే జెండాలు మార్చే ఎజెండాలు – వాళ్లిద్దరే ప్రతిసారీ, ప్రశ్న ప్రశ్న ప్రశ్న – వికాసానికి తొలి మెట్టు – అవగాహనకు పదును పెట్టు, దారిద్ర్య రేఖలు చెరపాలని కవిత్వ నావతో నా ఎదురీత, ప్రశ్న సంకెళ్లు తెంచే గండ్రగొడ్డలి, జాతీయ జెండా నేసినా – ‘మానవ’ మానం కాపాడినా – మగ్గానికి మరణ శాసనమాయె, ఓట్లు మనవే – పాట్లూ మనవే, సమతా మమతల సంస్థాపనే బౌద్ధం, మొన్న ఓటు -నిన్న 8 గంటల పని దినాలు-రేపో ఎల్లుండో ఆదివారానికి దినం, గొంతు మెదపక ప్రశ్నించక, ప్రతిధ్వనించక కలహించక కూర్చుంటే – నువ్వు మాయం నేను మాయం!!… అని సాగుతుంది మధు కవిత్వం. ఈ కవితా సంపుటి కవర్ పేజీని తెనాలికి చెందిన దివి హేమంత్ కుమార్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు.
150 పేజీల ఈ పుస్తకం వెల : రూ.150
రచయిత గోలి మధు సెల్: 9989186883
ప్రతులకు : 9848199098
సమీక్షకులు : శిరందాసు నాగార్జున, సీనియర్ జర్నలిస్ట్. 9440222914



















































