Pawan Kalyan : ఏపీ పూర్వవైభవానికి తొలి అడుగు
ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు.
బొకేలు, శాలువాలు తేవొద్దని నేతలకు వినతి
అమరావతి, జూన్ 13 : ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్న ఆయన, కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్టు చేశారు. ‘16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండోసంతకం. సామాజిక పింఛన్లు రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం. అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం. యువతలో నైపుణ్యాలు గురించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్ సెన్స్‌సపై ఐదో సంతకం చేశారు’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన సాగుతుందని, రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తొలి అడుగులుపడ్డాయని ఆనందం వ్యక్తం చేశారు. కాగా, ఎన్టీయే ప్రభుత్వంలో మంత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తన హృదయపూర్వక కృతజ్ఞతలని పీఏసీ చైర్మన్, తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆయన కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. జనసేన పార్టీనాయకులు, వీర మహిళలు, జన సైనికులు అంకితభావంతో, నిస్వార్థంతో క్షేత్రస్థాయిలో అండగా నిలిచి మరచిపోలేని ఫలితాన్ని అందించారని పేర్కొన్నారు. అలాగే, టీడీపీ, బీజేపీ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెనాలి ప్రజల అమూల్యమైన ప్రోత్సాహానికి, అభిమానానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని, మనమందరం రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములమేనని.. రాష్ట్ర సముజ్వల భవిష్యత్తు కోసం సమష్టిగా కృషి చేద్దామని పేర్కొన్నారు.
20 తర్వాత పిఠాపురానికి వస్తా!: పవన్
తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సిన ఉందని అందులో పేర్కొన్నారు. అదే విధంగా శాసనసభ సమావేశాలు కూడా ఉన్నాయని, వీటిని పూర్తి చేసుకుని పిఠాపురం వస్తానని పవన్ తెలిపారు. ఈ నెల 20తర్వాత పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తానని, ఆ తర్వాత దశల వారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని పేర్కొన్నారు. తనను నేరుగా కలిసి అభిననందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ జిల్లాల వారీగా కలిసి మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అభినందనలు తెలియజేడానికి వచ్చేవారు పూల బోకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్ విజ్ఞప్తి చేశారు.