విశాఖ సమ్మిట్ లో ‘టెక్స్ టైల్స్’ ఎంవోయూ లు*
*రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత*
*అమరావతి* : ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో ఎంవోయూలు చేసుకోబోతున్నట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. విశాఖ సమ్మిట్ లో రెండు స్టాళ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్ లో రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సోసిడియా, కమిషనర్ రేఖారాణి, ఇండస్ట్రీస్ కార్యదర్శి యువరాజ్ తో మంత్రి సవిత సోమవారం సమావేశమయ్యారు. పార్టనర్ షిప్ సమ్మిట్ లో భాగంగా టెక్స్ టైల్స్ రంగంలో ఎంవోయూలకు ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన పెట్టుబడిదారులను విశాఖ సమ్మిట్ కు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు… ఎంతమేర పెట్టుబడులు పెడుతున్నారో..? మంత్రి అడిగి తెలుసుకున్నారు.
*విశాఖ సమ్మిట్ లో 2 స్టాళ్లు ఏర్పాటు*
విశాఖ సమ్మిట్ లో భాగంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సవిత తెలిపారు. ఈ పెవిలియన్ లో రెండు స్టాళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అందులో ఒక దానిలో ఓడీ ఓపీ అవార్డులు పొందిన వస్త్రాలను, కళా రూపాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. మరో దాంట్లో అన్ని రకాల చేనేత దుస్తులు విక్రయించేలా నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.














































