YCP Liquor Scam : ‘కిక్కు’.. దించుతున్నారు
ఎన్నికల సమయంలో మద్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో… ఏపీ బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిని ఈసీ పక్కకు తప్పించింది.
ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీపై కేసు
ఫైళ్లు ‘ఎత్తుకెళుతూ’ దొరికిన వాసుదేవరెడ్డి
సామాన్యుడి ఫిర్యాదుతో సీఐడీ కేసు
హైదరాబాద్‌లోని నివాసంలో సోదాలు
విచారణ… కీలక సమాచారం లభ్యం
వైసీపీ లిక్కర్ స్కామ్‌లో ఆయనదే కీలక పాత్ర
నూతన మద్యం విధానం పేరుతో వింత బ్రాండ్లు ప్రవేశపెట్టి…
అవినీతి ‘కిక్కు’తో వేల కోట్లు వెనకేసుకున్నారు! ఇప్పుడు ఈ
అవినీతి తీగ లాగడం మొదలైంది. ఇక… డొంక కదలడమే
మిగిలింది. ఏపీ బేవరేజెస్ ఎండీ హోదాలో మద్యం కొనుగోళ్లు, అమ్మకాల్లో కీలక పాత్ర పోషించిన వాసుదేవ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కీలకమైన ఫైళ్లను తీసుకెళ్లారంటూ ఆయనపై
సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ వెంటనే… హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సోదాలు కూడా జరిపింది.
అమరావతి
ఎన్నికల సమయంలో మద్యం సరఫరాలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో… ఏపీ బేవరేజెస్ ఎండీ వాసుదేవరెడ్డిని ఈసీ పక్కకు తప్పించింది. అయితే… వైసీపీ ఓటమి తర్వాత, గురువారం ఆయన తన వెంట కొన్ని కీలక ఫైళ్లు తీసుకెళ్లినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వ కార్యాలయం నుంచి అనుమానాస్పద రీతిలో ఫైళ్లు తీసుకెళుతుండగా చూశానంటూ.. గద్దె శివకృష్ణ అనే వ్యక్తి విజయవాడలోని నున్న పోలీసులకు సమాచారం అదించారు. వారు స్పందించకపోవడంతో సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఆయన కథనం ప్రకారం… గురువారం ప్రసాదంపాడు ప్రాంతంలో ఉన్న ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ముందు నుంచి శివకృష్ణ స్నేహితుడితో కలిసి వాహనంలో వెళుతున్నారు. అక్కడ ఆగిఉన్న ఏపీ 39 ఎన్‌క్యూ 6666 నంబరు గల కారులో కొన్ని ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను ఎక్కిస్తుండటం గమనించారు. తన స్నేహితుడితో కలిసి కొంత దూరం వాహనాన్ని వెంబడించారు. ఆ తర్వాత… ఫైళ్లు తీసుకెళ్లిన వ్యక్తి వాసుదేవ రెడ్డి అని తెలసుకుని, నున్న పోలీసులకు తెలియజేశారు. వారు పట్టించుకోక పోవడంతో మంగళగిరి సీఐడీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం డీఎస్పీ శ్రీనివాసరావు ఎఫ్‌ఐఆర్(17/2024) నమోదు చేశారు. ఐపీసీ 427, 397, రెడ్ విత్ 120(బి) కింద కేసు పెట్టారు. దర్యాప్తునకు ముగ్గురు సీఐల నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దించారు.