యజ్ఞమహోత్సవంలో 3వ రోజైన ఈరోజు సాయంత్రం
సా. 6.00 గం॥ల నుండి చతురాగమయాగశాలల యందు మరియు 108 కుండాలలో హోమము, అర్చనలు మొదలైనవి.
యజ్ఞ మహోత్సవంలో ఈరోజు సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తులైన శ్రీ సత్తి సుబ్బారెడ్డి గారు, శ్రీ వి.శ్రీనివాస్ గార్లు పాల్గొని యజ్ఞ మహోత్సవాన్ని దర్శించుకున్నారు.
ఈరోజు సాయంత్రం 5:00 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా కళ్యాణవేదికపై ముందుగా ఏలూరు కె.వి.సత్యనారాయణ వారి బృందంచే నిర్వహించబడిన ‘ఆముక్తమాల్యద’ గోదారంగనాథుల కల్యాణం నృత్యరూపకం చూపరులను ఆకట్టుకుంది. గోదాదేవి రంగనాథుని గురించి చేసిన వ్రతం, తిరుప్పావై పాశురాలు , చివరకు రంగనాథుడు గోదాదేవిని అనుగ్రహించి పాణిగ్రహణం చేసిన విధానం చాలా చక్కగా రూపొందించడం జరిగింది.
గం॥ 6.30 ని॥ల నుండి గం॥ 7.30 ని॥ల వరకు: రాష్ట్ర అర్చక ట్రైనింగ్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు ధార్మిక ప్రవచనము చేశారు.
వారి ధార్మిక ప్రవచనంలో…అత్యంత దుర్లభమైన మానవజన్మ పొందిన ప్రతి ఒక్కరూ ధార్మిక జీవనం సాగించాలనీ, పుట్టినది మొదలు ప్రతి ఒక్కరూ సంస్కారవంతమైన జీవితం గడపాలనీ, విలువలతో జీవించాలనీ, మనమంతా మన హైందవ వాంగ్మయమైన రామాయణం,భారతం, భాగవతాలనుండి ఎన్నో విషయాలు తెలుసుకోవాలనీ, నేటి తరానికి తెలియజేయాలనీ ఇలాంటి ఎన్నో విజ్ఞానపూర్వకమైన విషయాలను తమ ప్రవచనం తెలిపారు. ధార్మిక ప్రవచనానంతరం వారిని గౌరవపూర్వకంగా సత్కరించడం జరిగింది.
రా. గం॥ 7.30 ని॥ల నుండి 9.00 గం॥ల వరకు
కళ్యాణ మహోత్సవము : నయనమనోహరముగా, హృద్యముగా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారికి కళ్యాణ మహోత్సవము నిర్వహించబడింది.
భక్తులు కల్యాణాన్ని దర్శించడంతోపాటు విశేషించి అన్నవరం ప్రసాదాన్ని స్వీకరించి పులకించిపోయారు. అన్నవరం నుంచి ప్రత్యేకంగా ఈ ప్రసాదాన్ని ఇక్కడి భక్తుల కోసం తెప్పించడం జరిగింది.
కల్యాణప్రాంగణమంతా భక్తజన సందోహంగా మారింది. యాగశాలల చుట్టూ ప్రదక్షిణ పథమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.
యజ్ఞ సంకల్ప దీక్ష ఎదురుగా గల వేదికపై శ్రీ కనకదుర్గ లలితాపారాయణ బృందం, విజయవాడమండలి వారిచే 101 మంది ముత్తైదువలు లలితాసహస్రనామస్తోత్ర పారాయణ అత్యంత భక్తిప్రదంగా సాగింది.
అనంతరము భక్తులకు తీర్థ ప్రసాద వితరణ జరిగింది.
గ్యాలరీ బయటభాగంలో భక్తులకోసం ఏర్పాటు చేసిన ప్రముఖ దేవాలయాల నమూనా ప్రచారరథాలను భక్తులు దర్శించుకున్నారు.
భక్తులకు అన్నవరం ప్రసాదంతో పాటు ఆధ్యాత్మిక పత్రికలైన ఆరాధన, శ్రీశైలప్రభ,శ్రీకనకదుర్గప్రభ ప్రతులను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది .
యజ్ఞ మహోత్సవానికి విచ్చేసిన భక్తులకు యాగశాలల చుట్టూ వలయాకారంలో ఏర్పాటు చేసిన ప్రదక్షిణ మార్గంలో ఎప్పటికప్పుడు చల్లటి మంచినీరు అందించే ఏర్పాటు చేయబడింది.
యాగశాలకు అతిసమీపంలో గ్యాలరీ బయటభాగంలో భక్తులకోసం వేచి ఉండే షెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం భక్తులకు తీర్థ ప్రసాదాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు (ఆరాధన, శ్రీ కనకదుర్గ ప్రభ, శ్రీశైలప్రభ మాసపత్రికలు) ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది.