కోవీషీల్డ్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయ్..
అంగీకరించిన కంపెనీ
పరిహారానికి సిద్దం ?
కరోనా వైరస్ ను నివారించేందుకు కోవీషీల్డ్ వాక్సిన్ రూపొందించిన విషయం తెలిసిందే. అయితే ఈ టీకా మందు దుష్ప్రభావాలు కలిగిస్తుందని దాని తయారీ సంస్థ ఆస్ట్రాజెనికా లండన్ హైకోర్టులో ఒప్పుకుందని స్థానిక వార్తాపత్రిక టెలిగ్రాఫ్ వెల్లడించింది. దీంతో కోట్ల పరిహారం చెల్లించడానికి సంసిద్దతను తెలిపినట్లయింది.
ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఈ టీకాను రూపొందించాయి. దీని వినియోగంతో అకాల మరణంతో సహా, త్రోంబోసిస్ విత్ త్రోంబో సైటోపీనియా సిండ్రోమ్ అనగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి, ప్లేట్లెట్ల కౌంట్ తగ్గే పరిస్థితికి వాక్సిన్ వినియోగదారుడు గురవుతాడు. ఆస్ట్రాజెనికా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా AZD1222 పేరుతో కరోనా వైరస్ ను ఎదుర్కొంటానికి ఈ టీకాను 2020లో రూపొందించాయి. స్వీడన్- బ్రిటన్ డ్రగ్ మేకర్ లైసెన్స్ తో భారత్ సీరం ఇన్ స్టిట్యూట్లో కోవిషీల్డ్ పేరుతో భారత్ తోపాటు, ఆర్థికంగా వెనుకబడిన, తక్కువ ఆదాయం గల దేశాల్లో దీనిని తయారు చేశారు. మొదట స్వల్ప దుష్ప్రభావాలు ఉంటాయని వెల్లడించిన ఆస్ట్రాజెనికా వాదనలతో లాయర్లు విభేదించారు.
కోవీషీల్డ్ లోపభూయిష్టంగా ఉందని, దాని పనితనంపై కంపెనీ ఊదరగొట్టిందని లాయర్లు వాదించగా, ఈ విమర్శలను వాక్సీన్ తయారీ సంస్థ కొట్టిపారేసింది. అయితే 51 కేసులు హైకోర్టులో నమోదు కావడంతో బాధిత కుటుంబాలు 100 మిలియన్ పౌండ్లను నష్టపరిహారంగా ఇవ్వాలని కోరారని టెలిగ్రాఫ్ కథనం. జిమీ స్కాట్ 2023లో మొదటి కేసును నమోదు చేశారు. 2021లో వాక్సిన్ తీసుకోవడంతో బాధితుడి మెదడు ఎడమ భాగం లో రక్త నాళంలో రక్తం గడ్డకట్డడం, రక్తం లీక్ అవడం జరిగాయని కేసులో పేర్కొన్నారు. అయితే ఆస్ట్రాజెనికా దీంతో వాక్సీన్ కు సంబంధం లేదని తేల్చి చెప్పింది.
అయితే అతని భార్య స్కాట్ మాత్రం వాక్సిన్ పదార్థాలకు ఈ రకమైన తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని మెడికల్ ప్రపంచంలో తెలిపిందని ఆధారాలను అందించారు. దీంతో కోర్టు ప్రొసీడింగ్స్ స్పీడ్ అయ్యాయి. ఇంకేముంది.. కంపెనీ కాళ్లబేరానికి వచ్చింది. త్వరలో దుష్ప్రభావాలు తగ్గిస్తామని బాధిత కుటుంబాలన్నింటికీ క్షమాపణ చెబుతున్నామని ఆస్ట్రాజెనికా కోర్డు కు తెలిపింది. బాధితులను ఆదుకుంటామని ఈ విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తామని కంపెనీ స్పష్టం చేస్తూ.. పేషంట్ల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత అని చెప్పినట్లు టెలిగ్రాఫ్ వెల్లడించింది. ప్రజలకు టీకా వేసేముందు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వాక్సీన్ 18 ఏళ్లు నిండిన వారందరికీ సురక్షితంగా పనిచేస్తుందని ప్రతికూల ప్రభావం చాలా తక్కువని ప్రకటించిన విషయం తెలిసిందే..