కవి కరీముల్లా సామాజిక వ్యాసం
——————————————
మానవ హక్కుల నిర్మాత మహా ప్రవక్త ముహమ్మద్(స)
——————————————– ——-
అది అరేబియా ప్రాంతం. మానవహక్కుల్ని ఏ మాత్రం ఖాతరు చేయని కాలం.ఆడ పిల్లలు పుట్టడాన్ని చిన్నతనంగా భావించి సజీవంగా పాతిపెట్టే కాలం.చిన్న విషయాలకే కత్తులు దూసుకుని రక్తపుటేర్లు పారించే రాతి మనుషులున్న కాలం.ఆ కాలంలోనే సమస్త ప్రపంచం పై కమ్మిన అజ్ఞాన చీకట్లను చీల్చే ఒక వెలుతురు సూర్యుడు జన్మించారు. ఆయనే మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్(స).
బాల్యం లోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి,గొర్రెల కాపరిగా జీవితం ప్రారంభించిన ప్రవక్త తన ప్రేమ మార్గంతో కర్కశ మనసుల్ని జయించారు.మానవులంతా పరస్పరం సోదరులేనని బోధించి విశ్వ మానవ సోదర భావానికి బీజం వేశారు.ఇతరుల ధన,ప్రాణాలకు నష్టాన్ని కలుగజేసే వాడు నిజమైన దైవ విశ్వాసి కాజాలడని బోధించారు.ఈ భూమిపై అన్యాయఃగా చిందించబడ్డ ప్రతి నెత్తుటి బొట్టుకు అల్లాహ్ వద్ద సమాధానం చెప్పుకోవల్సి వస్తుందని హెచ్ఛరించారు.నల్ల జాతికి చెందిన వారిని బానిసలుగా భావించే అరబ్బు సర్దారుల జాతి వివక్షతను వ్యతిరేకించి పవిత్ర కాబా మసీదు పై నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ ను ఎక్కించి తొలి అజాన్ ఇప్పించి అరబ్బుల అగ్రవర్ణ మనస్తత్వాన్ని తుత్తునియలు చేశారు.ఆడపిల్ల పుట్టడం దురదృష్టంగా భావించి సజీవంగా పూడ్చే జాతిని ఆడపిల్ల పుట్టడం వరంగా భావించే జాతిగా మలిచారు.
మీరు స్త్రీల హక్కుల విషయంలో దైవానికి భయపడండి.ధర్మం ప్రకారం పురుషునికి గల అన్ని హక్కులు మహిళలకూ ఉన్నాయని బోధించటమే కాక ప్రతి పురుషుడు తన ఇంట్లో ప్రవేశించే ముందు తన భార్యకు సలాం చేసి వెళ్ళాలని ఆదేశించి పురుషాహంకారాన్ని తుత్తునియలు చేశారు.ఒకరు మరొకరి హక్కుల్ని హరించరాదని పీడితుని ఆర్తనాదానికి భయపడాలని చెప్పారు.చివరికి జంతువుల హక్కులు సైతం ఉధ్బోధించారు.
యజమాని తన అధీనంలోని జంతువుకు కడుపు నిండా తిండి పెట్టాలని,శక్తికి మించిన భారం వేయరాదని,పని వేళల్ని నియంత్రించాలని ఆదేశించారు.ఏ వ్యక్తి ఏ వ్యక్తి నైనా అన్యాయంగా చంపితే అతను సమస్త మానవ జాతిని హత్య చేసినట్లేనని బోధించారు.చెడును చేతనైతే చేత్తో వారించు.సాధ్యం కాకపోతే నోటితో వారించు.
అదీ సాధ్యం కాకపోతే కనీసం మనసులోనైనా చెడును చెడుగా భావించు అని చెప్పి మానవ హక్కులకు ఊతమిచ్చి మానవ హక్కుల నిర్మాతగా చరిత్రలో నిలిచారు మహనీయ ముహమ్మద్(స).
