Terror Attack-యాత్రికులపై ఉగ్రదాడి – 10 మంది మృతి.. స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్
ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి(Terror attack) జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్(jammu kashmir)లోని రియాసి జిల్లా(Reasi district)లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రధాని మోదీతోపాటు రాష్ట్రపతి, అమిత్ షా, రాహుల్ గాంధీ స్పందించారు.
ఈ దాడి గురించి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సమాచారం తెలుసుకున్న ప్రధాని మోదీ(narendra Modi) ఉగ్రదాడిని ఖండించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ప్రధాని ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ట్వీట్ చేశారు. దీంతోపాటు ఉగ్రవాదుల గాలింపు కోసం భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయని, దాడి వెనుక ఉన్న వారిని విడిచిపెట్టబోమని ఎల్‌జీ సిన్హా స్పష్టం చేశారు. ఈ దుర్మార్గపు చర్య వెనుక ఎవరు ఉన్నా కూడా వారికి త్వరలోనే శిక్ష పడుతుందన్నారు.
ఈ దాడి పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీతో మాట్లాడి ఘటనపై సమాచారం తెలుసుకున్నానని, ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేదిలేదన్నారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. వెంటనే వైద్యసేవలు అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తుందని చెప్పారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.