HCM will be Participating in Unveiling of “Statue of Social Justice” at Swaraj Maidan, VJA
సామాజిక న్యాయ మహా శిల్పం-నేడు జాతికి అంకితం
అంబేడ్కర్ స్మృతివనం పనులు పూర్తి.. బెజవాడ నగరం నడిబోడ్డున భారీ విగ్రహం ఏర్పాటు
ప్రపంచంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహానికి రూపకల్పన
దేశంలోనే ఎత్తయిన మతాతీత విగ్రహం
18.18 ఎకరాల విశాల ప్రాంగణంలో ప్రాజెక్టు నిర్మాణం
రూ.404.35 కోట్లతో మేడిన్ ఇన్ ఇండియా సామగ్రితో పనులు పూర్తి
రాష్ట్రానికే తలమానికంగా స్మృతివనం
20 నుంచి ప్రజలకు ఎంట్రీ
సీఎం వైయస్ జగన్ చేతుల మీదుగా నేడు ఆవిష్కరణ
విజయవాడ : స్వాతంత్రోద్యమంలో ఎన్నో చారిత్రక సమావేశాలకు వేదికగా నిలిచిన బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనం పనులు పూర్తిచేసుకుని ప్రారంభానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. చరిత్రలో నిలిచిపోయేలా రూపుదిద్దుకున్న సామాజిక న్యాయ మహాశిల్పం జాతికి అంకితమిచ్చే తరుణం వచ్చేసింది.
అద్భుతమైన ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న ఈ స్మృతివనం పనులను మహాయజ్ఞంలా పూర్తిచేశారు. అత్యంత అందంగా తీర్చిదిద్దుతున్న ఈ ప్రాంగణం ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించే వేదికగా మారనుంది. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం విశేషం. 206 (81 అడుగుల బేస్, 125 అడుగుల విగ్రహం) అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
రాత్రివేళ ప్రత్యేక కాంతులతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించి, అత్యంత అద్భుతంగా రూపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. నిత్యం అధికారులతో మాట్లాడుతూ పనులు పరుగులు పెట్టించారు. ఇలా స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ (సామాజిక న్యాయ మహా శిల్పం)ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారు. ఈ అరుదైన అంబేడ్కర్ సామాజిక న్యాయ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి జనవరి 19న ఆవిష్కరిస్తున్నారు. ఇక స్మృతివనాన్ని వీక్షించేందుకు ఈ నెల 20 నుంచి సామాన్య ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు.
18.18 ఎకరాల్లో.. రూ.404 కోట్లతో…
రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు.
పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్ ఏర్పాటుచేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చైర్మన్‌గా 8 మంది మంత్రులతో ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పాటుచేసింది. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పనుల ప్రగతిని కమిటీ సమీక్షించింది. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ ప్రాజెక్టు పనులు స్వయంగా పర్యవేక్షించారు.
పనుల పరిశీలన…
ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం రాత్రి ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘరాం, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ సంపత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌లు పరిశీలించారు. విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు చర్చించారు.
విజయవాడలో నేడు సీఎం వైయస్ జగన్ పర్యటన
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 19న శుక్రవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభ, స్వరాజ్ మైదానంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సా.4.30కు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం చేరుకుంటారు. అక్కడ సామాజిక సమతా సంకల్ప సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం స్వరాజ్ మైదాన్ చేరుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం రాత్రికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఏపీకే తలమానికం..
అంబేడ్కర్ స్మృతివనంను 18.18 ఎకరాల్లో తీర్చిదిద్దాం. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏపీలో తలమానికంగా నిలువనుంది. 166 పిల్లర్లతో అందమైన కారిడార్, 38 మ్యూరల్స్ ఏర్పాటుచేశాం. స్మతివనం ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దాం. ఇది ఓ మాన్యుమెంట్‌గా మిగిలిపోనుంది. అడ్వాన్స్ టెక్నాలజీతో మ్యూజియంను ఏర్పాటుచేశాం.
– శ్రీలక్ష్మి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
జగనన్న నిర్ణయం చరిత్రాత్మకం
అంబేడ్కర్ స్మృతివనం నిర్మాణం గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకం. గత టీడీపీ ప్రభుత్వం దళితులను ఎంతో మోసం చేసింది. అంబేద్కర్ విగ్రహం నిర్మించేందుకు సరైన స్థలం కూడా చంద్రబాబు ఇవ్వలేదు. విజయవాడ నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలాన్ని సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి కేటాయించారు. సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం.
– మేరుగు నాగార్జున, మంత్రి
విగ్రహం బేస్ కింది భాగంలో..
► గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి.
► ఫస్ట్ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదే«శంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఉంటాయి.
► ఇక సెకండ్ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో..
► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు.
► ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం.
► మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.
► బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్)ను రూపొందించారు.
► విగ్రహ పీఠం లోపల జి ప్లస్ 2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్ రాక్‌ను ఉపయోగించారు.
► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది.
► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. èవిగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు.
► స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.