పౌర సేవల్లో స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ కీలకం
కొత్త ఏడాదిలో ప్రజలకు మరింత మెరుగ్గా సేవలందాలి
ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
స్వర్ణగ్రామ- స్వర్ణ వార్డు శాఖ క్యాలెండర్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి
అమరావతి, జనవరి 05: స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అన్ని అంశాల్లోనూ అమలు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఆదేశించారు. మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు కూడా ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అందుతున్న పౌర సేవలు, పథకాలపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సీఎం స్పష్టం చేశారు. దాదాపు 800 సేవల్ని ప్రభుత్వ శాఖలు ప్రజలకు అందిస్తున్నాయని సీఎం అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కొత్త ఏడాదిలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రజలకు అత్యుత్తమంగా సేవలందించాలని సీఎం ఆకాంక్షించారు. ప్రభుత్వం అందించే పౌర సేవలన్నీ క్షేత్రస్థాయిలో మరింత మెరుగ్గా అందించేలా కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అందించిన ఆర్ధిక సహకారం చేయూత కారణంగా రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని 50 శాతం మేర ఘన వ్యర్ధాలు రీసైకిల్ కావాలని సూచించారు. స్వచ్ఛ రథాల ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్నారు. ఈ ఆంశంలో ప్రజల నుంచి కూడా సహకారం తీసుకోవాలని.. ఈ ప్రక్రియను వ్యవస్థీకృతంగా నిర్వహించాలని ఆదేశించారు. తడి చెత్తను కంపోస్టు తయారీకి.. ఘన వ్యర్ధాలను విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు తరలించాలని.. దీనికి సంబంధించి రవాణా ప్రణాళికను కూడా ఖరారు చేయాలని సీఎం పేర్కొన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచేందుకు బ్యాండ్ విడ్త్ ను విస్తరించాలని అన్నారు. వివిధ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అనుసరిస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ ను అన్నిటికీ వర్తింప చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల ద్వారా వారిలో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి
అభిప్రాయ సేకరణకు ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ సహా వినూత్న విధానాలను అనుసరించాలన్నారు. అనంతరం స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు శాఖ 2026 క్యాలెండర్ ను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామితో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సమీక్షకు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, సీఎస్ విజయానంద్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సహా రవాణా, గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్, ఐటీ, ఆర్టీజీఎస్, ఆర్ధిక, ప్రణాళిక విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

















































