సంజయ్ స్కామ్!
ప్రభుత్వం ఏదైనా కార్యక్రమానికి వంద రూపాయలు ఇస్తే పదో, పాతికో తినేసి మిగతాది ఖర్చు చేసే వాళ్లున్నారు.
సీఐడీ అంటే… నేర పరిశోధన విభాగం. క్లిష్టతరమైన కేసులను దర్యాప్తు చేసి నేరం చేసిన వారికి శిక్షపడేలా చేయడం ప్రధాన విధి. ఇది అందరికీ తెలిసిందే. కొత్త విషయం ఏంటంటే… గత ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సంజయ్ నేర పరిశోధనపై గాక ‘నేరాన్వేషణ’పై దృష్టి పెట్టారు. దళితులకు అట్రాసిటీ చట్టంపై అవగాహన కార్యక్రమం పేరిట 3.10 లక్షలు ఖర్చు చేసి, ప్రైౖవేటు ఏజెన్సీ పేరిట ఏకంగా రూ.1.16 కోట్లు నొక్కేశారు.
ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో 25 చోట్ల సదస్సులు నిర్వహించారు. ఇందుకోసం 24 చోట్ల ప్రభుత్వ భవనాలు వాడుకున్నారు. ఒక్కచోట మాత్రం ఓ ప్రైవేటు హాల్ తీసుకున్నా యజమాని అద్దె తీసుకోలేదు. అంటే… అద్దె ఖర్చు రూపాయి కూడా కాలేదు. ఇక సమావేశాలకు ప్రభుత్వ ఫర్నిచరే వాడారు. పోలీసుల కార్యక్రమం కదా అని టీ, స్నాక్స్ ఎవరెవరో సమకూర్చారు. వీడియోగ్రఫీ కోసం సీఐడీ అధికారులే తమ సెల్‌ఫోన్లు వాడారు. మొత్తం ఖర్చంతా 3.10 లక్షలే. అయితే అద్దెలు, వీడియోలు, భోజనాల కోసం లక్షల్లో ఖర్చు పెట్టినట్టు దొంగ బిల్లులు పెట్టారు. ప్రైౖవేటు ఏజెన్సీ పేరిట రూ.1.19 కోట్లు డ్రా చేసుకున్నారు.
నాటి సీఐడీ చీఫ్ చేసిన ‘క్రైమ్’
అట్రాసిటీ చట్టంపై ఎస్సీ, ఎస్టీలకు
‘అవగాహన’ పేరిట రూ.1.19 కోట్లు డ్రా
అడ్డగోలుగా ప్రైవేటు ఏజెన్సీతో ఎంవోయూ
ఈ ఏడాది జనవరిలో 25 సమావేశాలు
24 చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లోనే
అద్దె లేకున్నా లక్షల్లో దొంగ బిల్లులు
సీఐడీ సిబ్బంది తమ సెల్‌ఫోన్లతో
తీసిన వీడియోలకూ లక్షల్లో బిల్లులు
విజిలెన్స్ విచారణలో బాగోతం వెలుగులోకి
ప్రభుత్వం ఏదైనా కార్యక్రమానికి వంద రూపాయలు ఇస్తే పదో, పాతికో తినేసి మిగతాది ఖర్చు చేసే వాళ్లున్నారు. కానీ రెండు రూపాయలు ఖర్చు చేసి మిగతా 98 రూపాయలూ మింగేస్తే..? ఇలాంటి కేసుల గురించి ఇప్పటి వరకూ బహుశా ఎవరూ విని ఉండకపోవచ్చు. జగన్ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గా పనిచేసిన సంజయ్ ఈ ‘ఘన కార్యక్రమం’ వెలగబెట్టారు. దళితుల పేరుతో ప్రభుత్వ సొమ్మును జేబులో వేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీలపై నేరాల కట్టడిలో భాగంగా అట్రాసిటీ చట్టంపై ఆయా వర్గాల్లో అవగాహన కార్యక్రమం పేరిట మూడు లక్షలు ఖర్చు చేసి, రూ.1.16 కోట్లు స్వాహా చేశారు. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలో తాజాగా ఈ దోపిడీ బట్టబయలైంది. 2023-24 బడ్జెట్‌లో సీఐడీ ఖర్చులకు రూ.32.44 కోట్లు కేటాయించారు. అట్రాసిటీ చట్టంపై ఎస్సీ, ఎస్టీలకు అవగాహన పెంచేందుకు ఇందులోనే అప్పటి ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ఇదే అవకాశంగా రాష్ట్రంలోని 25 ప్రాంతాల్లో దళితులు, గిరిజనులతో పాటు స్థానిక పోలీసు సిబ్బందికి అవగాహన పెంచుతామంటూ నాటి సీఐడీ అధిపతి సంజయ్ ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు మార్గదర్శకాలకు భిన్నంగా హడావుడిగా ఒక ప్రైవేటు ఏజెన్సీతో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. 1.19 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు అగ్రిమెంటు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో 25 చోట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించగా, 24 చోట్ల ప్రభుత్వ భవనాలు వాడుకున్నారు. వీటికి అద్దె చెల్లించినట్టు ఇష్టానుసారం దొంగ బిల్లులు పెట్టారు. ప్రభుత్వ ఫర్నీచర్ వాడుకోగా, తెలిసినవారు టీ, స్నాక్స్ సమకూర్చారు. సీఐడీ అధికారులే తమ సెల్‌ఫోన్లతో వీడియోలు తీశారు. కానీ ఇందుకు లక్షల్లో ఖర్చు పెట్టినట్టు దొంగ బిల్లులు పెట్టారు. ఈ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చినట్టుగా 1.19 కోట్లు డ్రా చేశారు. మొత్తం 3.10 లక్షలు ఖర్చు చేసి, 1.16 కోట్లు నొక్కేశారు. అంతసొమ్ము ఖర్చయిందా అని అప్పట్లోనే సీఐడీ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో విచారణ జరిపించడంతో దోపిడీ వెలుగు చూసింది.
గత ప్రభుత్వంలో దళితులు, గిరిజనుల్లో అట్రాసిటీ చట్టంపై అవగాహన పెంచే సమావేశాల కోసం తగిన ఏర్పాట్లు చేసేందుకు ఏపీ సీఐడీ టెండర్లు పిలిచింది. అప్పుడు సీఐడీ అధిపతిగా సంజయ్ ఉన్నారు. ఈ టెండర్లలో హైదరాబాద్‌లోని క్రిత్వాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సౌత్రికా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, మెటా పాయింట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలు పాల్గొన్నాయి. క్రిత్వాప్ టెక్నాలజీస్ రూ.59,52,500తో ఎస్టీ సభల కోసం ఎల్-1గా, ఎస్సీల సభల కోసం రూ.59,51,100తో ఎల్-1గా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన సమావేశాల్లో కనీస స్థాయిలో కూడా ఖర్చు చేయలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. రంగంలోకి దిగిన బృందాలు విచారణ చేపట్టాయి. హైదరాబాద్‌కు వెళ్లి విచారించగా క్రిత్వాప్ అనే సంస్థ పేరుతో బిడ్డర్ లేరని తేలింది. ఈ సంస్థ విజయవాడలో ఉన్నట్టు వెల్లడైంది. అలాగే సౌత్రికా టెక్నాలజీస్ కూడా విజయవాడలోనే ఉందని గుర్తించారు. ఈ రెండు సంస్థలూ ఒక్కరివేనని విచారణలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా 25 చోట్ల సీఐడీ నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఈ ఏజెన్సీ పాత్ర గురించి విజిలెన్స్ అధికారులు విచారించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు రీజినల్ విజిలెన్స్ అధికారులు పూర్తి ఆధారాలు సేకరించి డీజీ హరీశ్ కుమార్ గుప్తాకు నివేదించారు.
సమావేశాలు ముగిశాక ఎంవోయూ..
ఎస్సీ, ఎస్టీల్లో అవగాహన కోసం 2024 జనవరి 27, 28, 29న మూడు రోజుల పాటు సభలు, సమావేశాలు జరిగాయి. సీతంపేట, తాండ్రి, చింతూరు, కేఆర్ పురం, నెల్లూరు, శ్రీశైలం, భామిని, కూనవరం, మైలవరం, వినుకొండ, కురుపాం, చింతపల్లి, బుట్టాయగూడెం, జగ్గయ్యపేట, మాచర్ల, వెదుళ్లపల్లి, దోర్నాల, మార్కాపురం, ఆత్మకూరు, వెంకటగిరి, కోడూరు, చిట్వేల్, వజ్రకరూరు, బెళగుప్ప, పాణ్యం, బి.కండ్రిగ, ఏర్పేడుతోపాటు పలు జిల్లా కేంద్రాలలో సమావేశాల్లో పాల్గొన్నవారికి వసతి, భోజనాలు, టీ, స్నాక్స్ వంటివి సమకూర్చేలా ప్రైవేటు ఏజెన్సీ క్రిత్వాప్ టెక్నాలజీ్‌సతో ఒప్పందం చేసుకున్నారు. కుర్చీలు, మైక్ సెట్, బ్యానర్లు, ఫొటోలు, వీడియో గ్రఫీ తదితర ఏర్పాట్లతో పాటు అతిథులకు జ్ఙాపికలు అందజేసే బాధ్యత కూడా ఈ సంస్థదే. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే.. అవగాహనా సదస్సులు పూర్తయిన తర్వాత జనవరి 30న ఒప్పందం జరిగింది. టెండర్ దక్కించుకున్న ఏ సంస్థ అయినా ఎంవోయూ కుదుర్చుకుని వర్క్ ఆర్డర్ తీసుకున్న తర్వాతే పని మొదలు పెడుతుంది. ఏపీ సీఐడీలో మాత్రం అలా జరగలేదని విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చింది.
గురి చేశారు.
అవగాహన సదస్సుల్లో పాల్గొన్న వందలాది మంది కోసం భోజనాలు, హాల్ అద్దె, వీడియోగ్రఫీ చార్జీ, ఫర్నీచర్ బాడుగ, ఇతరత్రా ఇన్వాయి్‌సల పేరిట పెట్టిన బిల్లులన్నీ ఉత్తుత్తే అని విజిలెన్స్ తేల్చింది. సభలు నిర్వహించిన 25 ప్రాంతాల్లో 24 చోట్ల ప్రభుత్వ భవనాలే. కాబట్టి ఒక్క రూపాయి కూడా అద్దె చెల్సించాల్సిన పనిలేదు. ప్రభుత్వ హైస్కూళ్లు, బాలుర వసతి గృహాలు, ఎంపీడీవో కార్యాలయాలు, గిరిజన గురుకులాలు, వెలుగు కార్యాలయాలు, సామాజిక భవనాలతో పాటు ఆంజనేయ స్వామి ఆలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకచోట ప్రైవేటు హాలు తీసుకున్నప్పటికీ అద్దె లేకుండా పోలీసులకు ఇచ్చామని ఆ యజమాని విజిలెన్స్ విచారణలో చెప్పారు. అయితే సమావేశ మందిరాలకు రెండు నుంచి మూడు లక్షల చొప్పున అద్దెలు చెల్లించినట్లు బిల్లులు సృష్టించారు. ఇక వీడియో గ్రఫీ అంతా సీఐడీ అధికారులే చూసుకున్నారు. తమ సెల్ ఫోన్లతో తీశారు. అయితే వీడియో గ్రాఫర్లకు బిల్లులు అంటూ లక్షల్లో పెట్టారు. ఇలా ప్రైవేటు ఏజెన్సీకి 1.19 కోట్లు ఇచ్చేశారు.
అసలు ఖర్చు 3.10 లక్షలే..
విజిలెన్స్ విచారణలో బిల్లులు పరిశీలించగా, ఆశ్చర్యకరమైన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సమావేశ మందిరానికి మూడు లక్షలు చెల్లించామని చెప్పిన చోట ఎంపీడీవో కార్యాలయం ఉంది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతి పరిధిలో ఎక్కడ విచారించినా టీ, బిస్కెట్లు, భోజనాల కోసం పది వేల నుంచి పాతిక వేల లోపు తీసుకున్నామని చెప్పారు. అంతా లెక్క చేస్తే 2.66 లక్షలు మాత్రమేనని తేలింది. ఇతర ఖర్చులన్నీ కలిపి మొత్తం 3.10 లక్షలు ఖర్చు చేసినట్టు గుర్తించారు. అత్యధికంగా విశాఖపట్నం పరిధిలో 85 వేలు, రాజమహేంద్రవరంలో 75 వేలు, కర్నూలులో 65 వేలు, నెల్లూరులో 45 వేలు, విజయవాడలో 20 వేలు, గుంటూరులో 20 వేల చొప్పున మొత్తం 3.10 లక్షలు ఖర్చు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. అయితే నాటి సీఐడీ బాస్ ప్రైవేటు ఏజెన్సీ పేరిట ఏకంగా 1.19 కోట్లు డ్రా చేసుకున్నారు.
క్రిత్వాప్ ప్రతినిధులే రాలేదు
విజిలెన్స్ విచారణలో మరో ఆశ్చర్యకర విషయం వెలుగులోకి వచ్చింది. కోటి రూపాయలకు పైగా టెండర్ దక్కించుకున్న క్రిత్వాప్ సంస్థ నుంచి అవగాహన సదస్సులకు ప్రతినిధులే హాజరు కాలేదు. ఎంవోయూ ప్రకారం గతంలో ఇటువంటి సభలు, సమావేశాలు నిర్వహించిన అనుభవం ఉండాలి. అట్రాసిటీ చట్టాలపై అవగాహన ఉండాలి. సామాజిక స్పృహ కలిగి ఉండాలి. ఇవన్నీ టెండర్ నిబంధనల్లో ఉన్నాయి. 50 లక్షల విలువ దాటిన టెండర్ పిలవాలంటే రాష్ట్ర స్థాయిలో ప్రముఖ తెలుగు, ఆంగ్ల దినపత్రికల్లో ప్రకటన ఇవ్వాలి. ఇవేవీ జరగకుండానే డీజీ ర్యాంకు ఐపీఎస్ అధికారి అక్రమాలకు పాల్పడ్డారు.
1.16 కోట్లు రికవరీ చేయాలి
ఎస్సీ, ఎస్టీల పేరుతో 1,19,03,600 రూపాయల ప్రభుత్వ నిధులు డ్రా చేసుకుని కేవలం రూ.3,10,000 మాత్రమే ఖర్చు చేసిన వారి నుంచి రూ.1,15,93,600 రికవరీ చేయాలని విజిలెన్స్ సిఫారసు చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈ మేరకు నివేదిక సమర్పించింది. ఈ కుంభకోణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిపై చర్య తీసుకోవాలని, సంబంధిత ఏజెన్సీ క్రిత్వా్‌పపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
సీఐడీ చీఫ్‌గా అరాచకాలు
సీనియర్ ఐపీఎస్ సంజయ్ ఎక్కడ పని చేసినా అంత గొప్ప పేరు రాలేదు. అయితే రాష్ట్రంలో తనంత సిన్సియర్ అధికారి లేరని తనకు తానే సర్టిఫికెట్ ఇచ్చుకుంటారు. వైసీపీ ప్రభుత్వంలో తాడేపల్లి ప్యాలె్‌సకు నచ్చడంతో సీఐడీ చీఫ్‌గా నియమితులయ్యారు. చట్టాలు పక్కనపెట్టి జగన్ చెప్పినట్టల్లా చేశారనే విమర్శలు ఉన్నాయి.