ఒకే ఒక్క ఎన్‌టీఆర్.. ఒకే ఒక్క రామోజీరావు..
– నీతి నిజాయితీలకు, విశ్వసనీయతకు, విలువలకు ప్రతిరూపం రామోజీరావు.
– అయిదు దశాబ్దాలుగా ప్రజాగళంగా ఈనాడు దినపత్రిక.
– ఎన్ని సంక్షోభాలు వచ్చినా ఎదురొడ్డి నిలిచారు.
– ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు.
– ఆయన జీవితంలో భయం అనేది లేదు.
– ప్రజాస్వామ్య పరిరక్షణకూ రాజీలేని పోరాటం చేశారు.
– రామోజీరావు స్ఫూర్తిని భావితరాలకు అందించడం మన బాధ్యత.
– రామోజీరావుకు భారతరత్న సాధించేందుకు కృషి
– ఎన్‌టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నాం.
– అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు
– అమరావతిలో రోడ్డుకు రామోజీరావు పేరు పెడతాం.
– విశాఖలో రామోజీరావు చిత్రనగరిని అభివృద్ధి చేస్తాం.
– తెలుగు కీర్తి శిఖరం రామోజీరావు సంస్మరణ సభలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు.
అక్షర యోధుడికి వందనం.. మహోన్నత స్ఫూర్తి శిఖరానికి అభివందనం.. అంటూ రాష్ట్రం, దేశం నలుమూలల నుంచి వచ్చిన పాత్రికేయ, సినీ, రాజకీయ, వ్యాపార వాణిజ్య రంగాల ప్రముఖులు స్వర్గీయ రామోజీరావు గారికి ఘన నివాళులు అర్పించారు. మీడియా దిగ్గజం, స్ఫూర్తిదాయక పారిశ్రామికవేత్త, ప్రజాభ్యున్నతికి అహర్నిషలు కృషిచేసిన పద్మవిభూషణ్ గ్రహీత రామోజీరావుతో తమ అనుబంధాన్ని స్మరించుకున్నారు. విజయవాడ కానూరు అనుమోలు గార్డెన్స్‌లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వర్గీయ రామోజీరావు సంస్మరణ సభకు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, వివిధ శాఖల మంత్రివర్యులు, రామోజీరావు
కుమారుడు సీహెచ్ కిరణ్, కుటుంబ సభ్యులు శైలజా కిరణ్, విజయేశ్వరి తదితరులు హాజరయ్యారు.
తొలుత రామోజీరావు జీవిత విశేషాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతరం ప్రజాప్రతినిధులు, ముఖ్య అతిథులు, రామోజీరావు కుటుంబ సభ్యులతో కలిసి రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యుల వద్దకువెళ్లి పేరుపేరునా పలకరించారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ కొద్దిసేపు మౌనం పాటించారు. కృష్ణా జిల్లాలో ఓ రైతు కుటుంబంలో పుట్టి.. స్ఫూర్తి శిఖరంగా ఎదిగిన రామోజీరావు జీవిత విశేషాలతో కూడిన ఏవీని ప్రదర్శించారు.
***
కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే..
రామోజీరావు గారు ఓ వ్యక్తి కాదు ఓ వ్యవస్థ. ఆయన ఏ రంగంలో నిలబడినా ఆ రంగంలో నెంబర్ వన్‌గా నిలిచేందుకు కృషిచేశారు. నీతినిజాయితీకి ప్రతిరూపం రామోజీరావు గారు. ఆయన ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజీలేని పోరాటం చేసిన పోరాటయోధుడు రామోజీరావు. వ్యాపారం, సినీ, సేవా, పత్రికా రంగం.. ఎందులోనైనా ఆయనకు ఆయనే సాటి. ఆయన మీడియారంగంలో చేసిన కృషికి అనేక అవార్డులు లభించాయి. ప్రతిష్టాత్మక బి.డి.గొయెంకా, యుధ్‌వీర్ పురస్కారం వంటివి లభించాయి. వివిధ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్స్‌ను ప్రదానం చేశాయి. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో గౌరవించింది. సమాజానికి ఆయన చేసిన సేవలకు ఈ అవార్డులు లభించాయి. 1962లో మార్గదర్శిని ప్రారంభించారు. ఈ రోజుకీ మార్గదర్శి మార్గదర్శినే. ఎన్ని సంక్షోభాలు వచ్చినా మార్గదర్శికి, రామోజీరావు గారికి అండగా నిలిచారు. 1969 అన్నదాతను ప్రారంభించి.. తద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎనలేని కృషిచేశారు. 1974, ఆగస్టు 10న ఈనాడు తీసుకొచ్చారు. విశాఖలో మొట్టమొదటి ఎడిషన్ పెట్టారు. అయిదు దశాబ్దాలుగా ఆయన ఈనాడును అభివృద్ది చేశారు. ఈ పత్రిక అనునిత్యం ప్రజాగళంగా పనిచేస్తోంది. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజీరావు గారు. ఆయన ఎందరో జర్నలిస్టులను, నటీనటులను తయారుచేశారు. గాయనీగాయకులను, కళాకారులను ప్రోత్సహించారు.
పచ్చళ్లను 150పైకి దేశాలకు ఎగుమతి చేసేస్థాయికి తీసుకెళ్లారు. దేన్నయినా మెగా స్కేల్‌లో ప్రారంభించి విజయవంతం చేసిన వ్యక్తి రామోజీరావు. రామోజీ ఫిల్మ్‌సిటీ ఖ్యాతి చాలా గొప్పది. విపత్తులు వచ్చిన సందర్భంలోనూ మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రంలోనూ ముందుండి సేవలందించారు. రూ. 25 కోట్లతో పెదపారుపూడి, తెలంగాణలోని నాగన్‌పల్లిలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. కోవిడ్ సమయంలోనూ రూ. 20 కోట్లు ఖర్చు చేసి రెండు రాష్ట్రాల్లోనూ సేవలందించారు. భయం అనేది ఆయన జీవితంలో లేదు. పోరాటం అనేది ఆయన జీవితంలో భాగం. తెలుగుజాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావుగారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజీలేని పోరాటం చేశారు. సైబరాబాద్ అభివృద్ది సమయంలో ఆయన ఆలోచనలు పంచుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన అభివృద్దిలో ఆయన ఆలోచనలు ఉన్నాయి. ఆయన స్ఫూర్తి ఉంది. ఆయన ఒక రీసెర్చ్ చేసి మరీ ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా ఆయన సూచించారు. ప్రపంచమంతా అమరావతి పేరు మారుమోగింది. నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి. పనిచేస్తూ పనిచేస్తూ చనిపోవాలనే ఆయన కోరిక నెరవేరింది. ఆయనకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం. తెలుగు జాతి బాగుండాలని ఎప్పుడూ కోరుకున్న వ్యక్తి రామోజీరావుగారు. ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు. పదికోట్ల తెలుగుప్రజానీకానిది. ఎన్‌టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. అదే విధంగా రామోజీరావుగారికి కూడా భారతరత్న ఇచ్చేందుకు కృషిచేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. రీసెర్చ్, సదస్సులు వంటివి జరిగేలా మంచి కేంద్రాన్ని ఏర్పాటుచేస్తాం. ఒక రోడ్డుకు కూడా ఆయన పేరుపెడతాం. విశాఖలో రామోజీ చిత్రనగరిని అభివృద్ధి చేస్తాం. ఆ మహనీయునికి మనం నివాళులు అర్పించడమంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి సంస్మరణ సభ ఏర్పాటుచేయడం నా అదృష్టంగా భావిస్తున్నానని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు పేర్కొన్నారు.