ప్రతిపాడులో కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై పోలీసుల దాడి: ఒకరి అరెస్ట్, భారీగా నిల్వలు స్వాధీనం
ప్రతిపాడు, జనవరి 27, 2026:
జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ కలిపి కల్తీ వంట నూనెను తయారు చేస్తున్న ఒక ముఠా గుట్టును ప్రతిపాడు పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, ప్రత్తిపాడు సిఐ , బి సూర్య అప్పారావు పర్యవేక్షణలో ప్రతిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం ఈ మెరుపు దాడి నిర్వహించారు.
ఘటన వివరాలు:
ప్రతిపాడు మండలం ధర్మవరం పరిసరాల్లో కల్తీ నూనె తయారవుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, ప్రతిపాడు ఎస్ఐ శ్రీమతి ఎస్. లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి ధర్మవరం NH-16 రోడ్డు పక్కన ఉన్న ఒక రేకుల షెడ్డుపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో నిందితుడు బండారు ఫణి ప్రసాద్ (38), నివాసం FK పాలెం, జంతువుల కొవ్వు మరియు క్రూడ్ ఆయిల్ మరిగించి కల్తీ వంట నూనె తయారు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
విచారణలో వెల్లడైన దిగ్భ్రాంతికర నిజాలు:
ముడి సరుకు: నిందితుడు పిఠాపురం మరియు చందుర్తికి చెందిన తన స్నేహితుల వద్ద నుండి తక్కువ ధరకు జంతువుల కొవ్వును, కాకినాడ లైట్ హౌస్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద నుండి క్రూడ్ ఆయిల్ ను కొనుగోలు చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
సరఫరా: ఈ కల్తీ నూనెను బరంపురం మరియు రాజమండ్రికి చెందిన కొందరు వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
గత నేరాలు: గతంలో పిఠాపురం మండలంలో ఈ అక్రమ వ్యాపారం సాగించిన నిందితుడు, అక్కడ పరిస్థితులు అనుకూలించక గత 3 నెలల నుండి ధర్మవరంలో షెడ్డును అద్దెకు తీసుకుని ఈ దందాను కొనసాగిస్తున్నాడు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు:
పోలీసులు సుమారు ₹1,50,000 విలువైన కింది వస్తువులను సీజ్ చేశారు:
కల్తీ వంట నూనె డబ్బాలు (15 లీటర్లవి) – 56 డబ్బాలు (సుమారు 840 కేజీలు)
క్రూడ్ ఆయిల్ డబ్బాలు – 4 డబ్బాలు
అల్యూమినియం గంగాళం (మరుగుతున్న నూనెతో సహా) – 225 కేజీలు
ఖాళీ డబ్బాలు, 2 గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్ మరియు ప్యాకింగ్ మెటీరియల్.
చర్యలు:
ఈ కేసులో మొత్తం 9 మంది నిందితులు ఉండగా, ప్రధాన నిందితుడు బండారు ఫణి ప్రసాద్‌ను అరెస్ట్ చేసి ప్రతిపాడు JFCM కోర్టుకు తరలించారు. మిగిలిన 8 మంది నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి అక్రమ వ్యాపారాల పై జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ వారి ఉత్తర్వుల ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.



















































