మహిళల ఆర్థిక స్వావలంబనకు ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోంది
ఏడాదిలో లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేస్తాం
వ్యాపారాల్లో రాణించేందుకు 24 సంస్థలతో ఒప్పందాలు..మహిళలు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తాం
ఆడబిడ్డలకు పెట్టుబడిలో 45% రాయితీలిస్తాం…మహిళల గౌరవాన్ని మరింత పెంచుతాం
మహిళల రక్షణ కోసం శక్తి యాప్ తెచ్చాం
ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికాన్పులైనా ప్రసూతి సెలవులు
అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
మార్కాపురంలో మహిళలతో సీఎం ముఖాముఖి
మార్కాపురం, మార్చి8 :- ఏడాదిలో లక్షమంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని, పెట్టుబడుల్లో ఆడబిడ్డలకు 45 శాతం రాయితీలు కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని, మహిళల రక్షణ కోసమే శక్తి యాప్ తీసుకొచ్చామని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భార్గవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మహిళలు అడిగిన ప్రశ్నలు, సీఎం చంద్రబాబు చెప్పిన సమాధానాలు ఈ విధంగా ఉన్నాయి.
యాంకర్ ప్రశ్న : లక్షమంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారుచేయాలన్న మీ విజన్ గురించి వివరించండి.
సీఎం సమాధానం : ముందుగా నా ఆడబిడ్డలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 25 ఏళ్ల క్రితం నేను డ్వాక్రా, మెప్నా వ్యవస్థలను ప్రారంభించాను. ఈ రెండూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలబడ్డాయి. ఈఏడాది డ్వాక్రా, మెప్నా సంఘాలు బ్యాంకుల నుంచి రూ. 35 వేల కోట్ల రుణాలు తీసుకున్నాయి. ONDC ప్లాట్ ఫాం మీద 4 గిన్నీస్ అవార్డులు వచ్చాయి. 10 రోజుల్లో రూ. 5 కోట్ల టర్నోవర్ చేశారు. అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి. సరైన ఫ్లాట్ ఫామ్ చూసుకుని మీరు తయారుచేసే వస్తువులను అమ్మగలిగితే మంచి లాభాలు ఆర్జించవచ్చు. టెక్నాలజీ సాయంతో అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక్కడ సెల్ ఫోన్లు లేని ఆడబిడ్డలు లేరు.
యాంకర్ ప్రశ్న: మిమ్మల్ని జీవితంలో ప్రభావితం చేసిన మహిళలు ఎవరు?
సీఎం సమాధానం : మహిళలు స్పూర్తి ప్రదాతలు . మొదట్లో నా భార్యకు వ్యాపారం చేయడం తెలీదు. పైగా ఆవిడ ఎన్టీఆర్ కుమార్తె కావడంతో తనకు ఆ అవసరం కూడా రాలేదు. నేను 1994లో కుటుంబం కోసం చిన్న బిజినెస్ మొదలుపెట్టాను. రాజకీయాల్లో బిజీ అవుతుండటంతో నా భార్యను వ్యాపారం చూసుకోమంటే తను మొదట్లో తిరస్కరించింది. తర్వాత ఒప్పుకుంది. సాధారణ మహిళ హెరిటేజ్ వ్యవహారాలు చూసుకుంటూ మరోవైపు లోకేష్ ను చదివించింది. అక్కడితో ఆగలేదు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నేను ఆమె అంతలా అవుతుందని నేను ఊహించలేదు. నా అవసరాలకు డబ్బు ఇచ్చే స్థాయికి ఎదిగిన నా భార్య భువనేశ్వరిని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
యాంకర్ ప్రశ్న: మీ తల్లి గారి విషయంలో మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన సంఘటన ఈ సందర్భంగా పంచుకోగలరా?
సీఎం సమాధానం : మాది వ్యవసాయ కుటుంబం. మా తల్లి కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. చంద్రగిరిలో చదువుకోసం నేను 6 కిలోమీటర్లు నడిచి వెళ్లేవాణ్ణి. తెల్లవారుజామునే లేచి వంట చేసేది. ఉదయం ఆరున్నరకల్లా ఆమె మాకు క్యారేజీ కట్టేసేది. బయట పొయ్యిమీద వంట చేయడంతో ఆ పొగకు తల్లి ఇబ్బంది పడటం, ఆమె కంట కన్నీళ్లు రావడం నాకు ఇంకా గుర్తే. . నా తల్లి పడిన కష్టం ఏ తల్లీ పడకూడదని దీపం పథకం తెచ్చాను. ఉచితంగా వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. దేశంలో ఎవరికీ ఈ ఆలోచన రాలేదు. దీపం 2 కింద మళ్లీ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాను.
సుమతి, బసవన్నపాలెం: ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన ఆడపిల్లలు కూడా చదువుకోవాలని సైకిళ్లు ఇచ్చారు. మీ ఆశయం నెరవేరిందని అనుకుంటున్నారా?
సీఎం సమాధానం : ఆడబిడ్డలంటే బలహీనులు అనే అభిప్రాయం మన సమాజంలో ఉంది. అంతెందుకు పొలంలో కూలి పనులకు వెళ్లినప్పుడు ఆడవారికంటే మగవాళ్లకే ఎక్కువ డబ్బులిస్తారు. ఒకప్పుడు ఆడవాళ్లు సైకిల్ తొక్కలేరని ఇచ్చేవారు కూడా కాదు. మహిళలు తమ శక్తి చూపించాలని, చదువు కొనసాగించాలని 8,9,10 చదివే ఆడపిల్లలకు ఉచితంగా సైకిళ్లు ఇచ్చాం. దాని వల్ల వారు చదువుకున్నాను. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరి రోజవుతుంది.
మెహరున్నీసా, పొదిలి : డ్వాక్రా స్థాపన వెనక మీ లక్ష్యం ఏంటి? లక్షల గ్రూపులు అవుతాయని మీరు ఆనాడే ఎలా ఊహించారు ?
సీఎం సమాధానం : డ్వాక్రా ఏర్పాటుతో మహిళల జీవితంలో వెలుగులు తీసుకొచ్చినందుకు, వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేసినందుకు నాకు సంతోషంగా ఉంది. సమాజంలో 50 శాతం ఉండే పురుషులు మాత్రమే పనిచేస్తే అభివృద్ధి అసాధ్యం. అలాగే వారు సంపాదించి మీరు ఇంట్లో కూర్చుంటే చులకనగా చూస్తారు. సమాజం పైకి రావాలన్న, మహిళల గౌరవం పెరగాలన్నా ఒక వేదిక ఉండాలనిపించింది. అదే డ్వాక్రా . అప్పట్లో కొందరు మహిళలు తన భర్త కొడుతున్నాడు, అత్తమామలు వేధిస్తున్నారని నా దగ్గర బాధపడేవారు. వారిని ఎలా డీల్ చేయాలో నేను చిట్కాలు చెబుతూ ఉండేవాణ్ణి. నేడు డ్వాక్రా మహిళల ఆదాయంపైనే కుటుంబం ఆధారపడే పరిస్థితి వచ్చింది. మహిళలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తా. గత ఐదేళ్లూ ఏం జరిగింది. మిమ్మల్ని బలవంతంగా బస్సుల్లో సభలకు తరలించారు. మధ్యలో వెళ్లిపోకుండా చుట్టూ గుంటలు తవ్వారు. ఇంత స్వేచ్ఛగా మీరు గడిచిన ఐదేళ్లలో మాట్లాడారా చెప్పండి. మీ శక్తి మేరకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తానని హామీ ఇస్తున్నాను.
మీనమ్మ, సంతనూతలపాడు: మహిళలకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. గ్రామీణ ప్రజలకు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఆదాయం ఎలా వస్తుంది. అవకాశాలు ఎలా వస్తాయి?
సీఎం సమాధానం : ప్రపంచంలో పనివేళల్లో మార్పులు వచ్చాయి. ఏ పని కావాలన్నా రోజుకింత, గంటకింత అన్నట్టుగా ఉంది. కరోనా తర్వాత ఇంటి నుంచి పనిచేయడం అలవాటయింది. గ్రామాల నుంచే పనిచేసే విధానానికి కంపెనీలు శ్రీకారం చుట్టారు. ఇళ్లలో ఉండే ఆడవారు ఖాళీ సమయాల్లో పనిచేయడం ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పించడం కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ కు శ్రీకారం చుట్టాం. గ్రామాల్లో కూడా వర్క్ స్టేషన్లు కూడా పెడతాం. అక్కడ కూడా పనిచేసుకోవచ్చు. నెలలో ఒక పది రోజులు దగ్గరలోని పట్టణాలకు వెళ్లి ఉపాధి శిక్షణ పొందేలా ఏర్పాట్లు చేస్తాం. కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత నాది. ఫిజికల్ గా వెళ్లి పనిచేయాలంటే ఖర్చవుతుంది. అదే మన ఊరిలో పనిచేస్తే ఖర్చు తగ్గుతుంది. వర్క్ ఫ్రమ్ హోం వల్ల తల్లిదండ్రులను చూసుకుంటూ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు.
యాంకర్ ప్రశ్న: ఎక్కువమంది పిల్లలను కనమని మీరు ఈమధ్య పిలుపునిస్తున్నారు. ఈ మెసేజ్ వెనుక కారణం ఏంటి?
సీఎం సమాధానం : జనాభా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. ఐటీలో పనిచేసే భార్యాభర్తలు …నో కిడ్స్ …ఓన్లీ ఎంజాయ్ అంటున్నారు. చైనాలో జనాభా తగ్గిపోతోంది. జపాన్ లోనూ అదే పరిస్థితి. యూరప్ లోనూ తగ్గుతున్నారు. అక్కడ వృద్ధులు ఎక్కువయ్యారు. వారి సంపాదన అనుభవించేందుకు కనీసం వారసులు కూడా లేరు. మన దేశంలో ప్రస్తుతానికి జనాభా బాగానే ఉన్నప్పటికీ 20 ఏళ్ల తర్వాత ఇంకా తగ్గుతుంది. నార్త్ లో జనాభా బాగుంది. మన సౌత్ లో ఒక్కరినే కని సరిపెడుతున్నారు. ఒక్కరినే కనమని ఒకప్పుడు నేను పిలుపునిచ్చాను. కానీ నేడు ఇద్దరు, ముగ్గురిని కనమంటున్నాను. దేశ, సమాజ మనుగడ కోసమే ఇలా చెప్తున్నాను. ఒకప్పుడు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అర్హత లేదని చట్టం చేశాం. ఇప్పుడు ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అనర్హులు అని చట్టం తేవాలి. అందుకే తల్లికి వందనం తెచ్చాం. ఇంట్లో ఎందరు పిల్లలుంటే అందరికీ రూ. 15 వేలు ఇస్తాము. ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇద్దరి వరకే ప్రసూతి సెలవులు ఉండేవి. ఇకపై ఐదారుమందిని కన్నా కూడా ఆరునెలలు ప్రసూతి సెలవులు, ఇతర ప్రయోజనాలు ఇస్తాము. మహిళలు లేకపోతే సృష్టి లేదు. మిమ్మల్ని కోరేది ఒకటే. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రదేశంగా తయారవుతుంది. ప్రతి ఏడాది తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. నేనేమీ ఆకాశంలో అరుంధతి నక్షత్రం చూపించండం లేదు. జరిగేపనులే చెప్తున్నాను.
పరిమళ సుహాసిని, నాగులుప్పలపాడు: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంటికో మహిళా పారిశ్రామికవేత్తను ఎలా తయారు చేస్తారు.
సీఎం సమాధానం : సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. ఏ వ్యక్తీ పుట్టుకతోనే గొప్పవాడు కాలేడు. నేను చదువుకునే రోజుల్లో ఎమ్మెల్యేని కావాలనుకున్నాను. కష్టపడ్డాను. రెండేళ్లలో మంత్రినయ్యాను. ఎన్టీఆర్ గారిని కలవడం నా జీవితంలో మలుపు. ఆయన కుమార్తెతో పెళ్లి జరిగింది. రతన్ టాటా అంచెలంచెలుగా ఎదిగి తన కంపెనీని ఏస్థాయికి తీసుకెళ్లారో మనం చూశాం. రెడ్డీస్ ల్యాబ్ అంజిరెడ్డి, అపోలో ప్రతాప్ రెడ్డి ఇలా ఎందరో స్పూర్తి ప్రదాతలు ఉన్నారు. రాష్ట్రంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ తెస్తున్నాం. ఏఐని ప్రోత్సహిస్తున్నాం. పెట్టుబడుల్లో మహిళలకు 45 శాతం రాయితీలిస్తాం. ఇంట్లో కూర్చునే డిగ్రీలు చేసే అవకాశం కల్పిస్తాం. పెళ్లి తర్వాత కూడా నాలుగైదు డిగ్రీలు చేసిన ఆడపిల్లలను చూశాను. వాట్సాప్ గవర్నెర్స్ తెచ్చాను. పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ప్రభుత్వ సేవలు పొందే వెసులుబాటు కల్పించాము.
ప్రశ్న, పూర్ణిమ ఒంగోలు : టెక్నాలజీ గురించి మీరు చెబుతూ ఉంటారు. మహిళలు డబ్బు సంపాదించడంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది
సీఎం సమాధానం : ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే అందరూ నన్ను ఎగతాళి చేశారు. నేడు సెల్ ఫోన్ లేనివారు ఎక్కడా కనిపించరు. సెల్ ఫోన్ నిత్యావసర వస్తువయ్యింది. అయితే ఫోన్ ను సద్వినియోగం చేసుకోవాలి. యూట్యూబ్ లు చూస్తే చెడు అలవాట్లు వస్తాయి. నాలెడ్జ్ ఎకానమీలో టెక్నాలజీ భాగమైంది. ఒకప్పుడు వ్యవసాయంలో తెగుళ్లు వస్తే పురుగులమందు కొట్టేవాళ్లం. కానీ నేడు డ్రోన్ ద్వారా ఎక్కడ తెగులు ఉంటే అక్కడే మందు కొడుతున్నాం. ఒకప్పుడు పంజాబ్ రాష్ట్రంలో వరి, గోధుమలు పండించేవారు. ఎరువులు ఎక్కువ వేసి పండించడంతో అక్కడి ప్రజలు కేన్సర్ బారిన పడ్డారు. పంజాబ్ నుంచి కేన్సర్ రోగులతో ప్రతి రోజు ఒక రైలు ఢిల్లీకి వస్తుందంటే పరిస్థితి ఎంత ప్రమాదంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే మనం తినే తిండిపై శ్రద్ధ పెట్టాలి.
యాంకర్ భార్గవి: మీ సతీమణి భువనేశ్వరి గారు హెరిటేజ్ , ఎన్టీఆర్ ట్రస్ట్ వ్యవహారాలు చూస్తున్నారు. ఆవిడకు మీరు ఎన్ని మార్కులు వేస్తారు.
సీఎం సమాధానం : భువనేశ్వరిని చూస్తే నాకు గర్వంగా అనిపిస్తుంది. హెరిటేజ్ ద్వారా ఎందరికో ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఆవిడ దగ్గర సేవలు పొందే వారే మార్కులు వేస్తారు.
సుజాత, పెదారకట్ల గ్రామం: నేను 50 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మా పశ్చిమ ప్రకాశంలో తాగు, సాగు నీటి కోసం ఎంతో కష్టపడుతున్నం. పశువులకు కూడా నీరు అందించలేకపోతున్నాం. వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది.
సీఎం సమాధానం : వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేశానని, జాతికి అంకితం చేశానని గత ముఖ్యమంత్రి చెప్పాడు కదమ్మా. 1996లో వెలిగొండ ప్రాజెక్టు కు ఫౌండేషన్ నేనే వేశా. వాళ్లలా డ్రామాల నీళ్లు కాదు… ప్రాజెక్టు పూర్తిచేసి అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతానికి నీరు అందిస్తాను. నీరు ఒక భద్రత. గోదావరిలో మిగులు జలాలు సముద్రంలోకి పోతున్నాయి. పోలవరం-బనకచర్ల అనుసంధానంతో రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాను. గోదావరి నీరు వెలిగొండ ద్వారా మీకు ఇస్తాను. కృష్ణా నీరు కూడా అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాను. ప్రాజెక్టు కోసం భూములు పోగొట్టుకున్న వారినీ ఆదుకుంటాను. ప్రజలను మభ్య పెట్టడం, మోసం చేయడం కరెక్ట్ కాదు. అలగే… ఏది వాస్తవం, ఏది అవాస్తవమో ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలి.
యశస్వి, ఎమ్ బీఏ స్టూడెంట్: గతంలో టీవీల్లో బూతులు వినబడేవి. మీరు ముఖ్యమంత్రి అయ్యాక బూతులు, తిట్లు తగ్గాయి. మహిళల రక్షణకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు సార్ ?
సీఎం సమాధానం : ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక బూతులు కంట్రోల్ చేశాము. టీవీల్లో, అసెంబ్లీల్లో, సోషల్ మీడియాలో బూతులు లేవు. ఎవరైనా బూతులు మాట్లాడితే చట్టపరంగా చర్యలు తప్పవు. సమాజంలో సభ్యత ఉండాలి. మన పిల్లలకు సంస్కారం నేర్పించాలి. బూతులు తిట్టుకుంటే భావితరాలు నాశనమవుతాయి. గత ఐదేళ్లలో గంజాయి రాష్ట్రంలో ఒక పంట అయిపోయింది. ఎక్కడికక్కడ గంజాయి తయారుచేసి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేవారు. గంజాయి , డ్రగ్స్ కి ఎందరో బానిసలయ్యారు. ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయిని అరికట్టగలుగుతున్నాం. డ్రోన్ ల ద్వారా గంజాయి పంట పండించే ప్రాంతాలను గుర్తించి కట్టడి చేస్తున్నాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికొస్తే అదే వారికి చివరిరోజు. ఆడబిడ్డల రక్షణ కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శక్తి యాప్ తీసుకొచ్చాం. మీరు ఒక్క మెసేజ్ ఇస్తే 7 నిమిషాల్లో పోలీసులు వచ్చేస్తారు.
సరళి, ఎంబీబీఎస్ స్టూడెంట్: ముఖ్యమంత్రిగా మీకు ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయి. కానీ మీ ముఖం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆరోగ్య రహస్యం ఏంటి సార్ ?
సీఎం సమాధానం: నేను నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకూ పనిచేస్తాను. యువత కంటే ఎక్కవ దూరదృష్టితో ఆలోచిస్తాను. నేను చేసే పనులతో తెలుగుజాతి బాగుపడాలి అని తపిస్తాను. మంచి పేరు తెచ్చుకోవాలన్నది నా స్వార్థం. మన ఆలోచనలు సరిగా ఉంటే ఆరోగ్యం కూడా సరిగా ఉంటుంది. తప్పుడు ఆలోచనలు ఉంటే తప్పుడు పనులు చేస్తారు. దీని వల్ల టెన్షన్ వస్తుంది. నేను పడుకున్న రెండు నిమిషాల్లో నిద్రపోతాను. అలారం మోగేదాకా నిద్రలేవను. నన్ను అరెస్ట్ చేసినప్పుడు 53 రోజులూ 70 దేశాల్లో తెలుగువారు శాంతియుతంగా నిరసన తెలిపారు. వారు చూపిన అభిమానాన్ని నా జీవితంలో మర్చిపోలేను. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే రోజూ ఆస్పత్రికి వెళ్లాల్సిందే. మందులకు అలవాటైతే బాడీలో తేడాలు వస్తాయి. శరీరానికి కావాల్సింత మాత్రమే తినాలి. స్వీట్స్ తింటే బాగుంటుంది. కానీ షుగర్ వస్తుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. క్రమం తప్పుకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. సమయానికి భోజనం చేయడం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిద్ర, తిండి, ఆలోచన, పని ఇవి ముఖ్యం. రోజూ నడక అలవాటు చేసుకోవాలి. నేను ఒక రింగ్ పెట్టుకుంటాను. నా బాడీ ఎలా ఉంది, ఎలా నిద్ర పట్టింది, ఎనర్జీ ఉందా లేదా అన్నీ చెబుతుంది. నేను మంచినీళ్లు తాగుతుంటే కొందరు ఎగతాళి చేస్తారు. నా ఆరోగ్యం బాగోక ఇంట్లో రెండు రోజులు పడుకుంటే ఈ రాష్ట్రానికే నష్టం. నాకు ఆరోగ్యం సరిగాలేక సెలవులు తీసుకోవడం ఇంతవరకూ ఎవరూ చూసుండరు. మన తలసరి ఆదాయం రూ. 2 లక్షల 68 వేలు. దీన్ని 58 లక్షలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రతి ఏడాది ప్రజల ఆదాయం 15 శాతం పెరిగితే అది సాధ్యమే. సంపద, ఆరోగ్యం, ఆనందం మన సిద్ధాంతాలు. నిజం చెప్పాలంటే మీతో మాట్లాడాక నా ఎనర్జీ డబుల్ పెరిగింది.
రిషిత, బీఎస్సీష: మార్కాపురంలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయండి. డిగ్రీ అయ్యాక పెద్ద చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడే పెడితే మా తల్లిదండ్రులకు కూడా ధైర్యంగా ఉంటుంది. అలాగే మార్కాపురాన్ని జిల్లా చేయండి.
సీఎం సమాధానం : తల్లీ…నీకు ఓటు హక్కు లేకపోయినా డిమాండ్ చేస్తున్నావు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టే మార్కాపురాన్ని జిల్లా చేస్తాను. పీజీ సెంటర్ కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాను.
శైలజ, మెప్నా సభ్యురాలు : మాకు రూ. 8 వేలు జీతం వస్తుంది. 25 గ్రూపులకు ప్రతినిధులుగా పనిచేస్తున్నాం. మాకు వేతనాలు పెంపు, ఉద్యోగ భద్రత కల్పించాలి. పశ్చిమ ప్రకాశం జిల్లాను ఆదుకోవాలి.
సీఎం సమాధానం : గత పాలకులు వెళ్తూ వెళ్తూ రూ. 10 లక్షల కోట్లు అప్పు అప్పగించి పోయారు. ఆ అప్పు, వడ్డీ రెండూకట్టాలి. వడ్డీ కట్టాలి. ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి. మీ అందరికీ న్యాయం చేస్తాను.
హెల్త్ ప్రొవైడర్: గత ప్రభుత్వంలో మాకు జీతాలు సరిగా వేయలేదు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మేము ఎంపికయ్యాము. మమ్మల్ని ఆదుకోండి సార్.
సీఎం సమాధానం : నేను అందరి సమస్యలు పరిష్కరిస్తాను. కొంచెం టైమ్ పడుతుంది. యువత ఆలోచన చేయాలి. రాష్ట్రంపై అప్పుల భారం ఉంది. సంపద పెంచాలి. అవతలివాళ్లలా నేను అబద్ధాలు చెబుతూ బుకాయించడం లేదు. తప్పుకుండా అందరికీ న్యాయం చేస్తాను. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనంతరం వివిధ రంగాల్లో నిష్టాతులైన, సేవలు అందిస్తున్న మహిళలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు సన్మానించారు.