27-09-2023
విప్లవాత్మక భూసంస్కరణలు తెచ్చిన జగనన్న ప్రభుత్వం -అంకంరెడ్డి నారాయణమూర్తి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన విప్లవాత్మక భూసంస్కరణలు పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన లక్షలాది కుటుంబాల జీవనస్థితిగతులను మార్చేలా, వారి గౌరవాన్ని మరింత పెంచేలా ఉన్నాయని, నవరత్నాలు ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ అంకంరెడ్డి నారాయణమూర్తి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే జరిపి, పేదల అసైన్డ్ భూములు క్రమబద్ధీకరించడం, చుక్కల భూముల సమస్యలను పరిష్కరించడం ద్వారా సమగ్ర భూ సంస్కరణల అమలుకు జగనన్న శ్రీకారం చుట్టారన్నారు. భూ సంస్కరణల అమలు ద్వారా 28 లక్షల ఎకరాల అసైన్డ్ భూమిపై, 15 లక్షల కుటుంబాలకు మేలు జరిగేలా, యాజమాన్య హక్కులు కల్పించబడుతున్నాయన్నారు. 20 సంవత్సరాలు పైబడి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములకు, 10 సంవత్సరాలు పైబడి నివాసముంటున్న అసైన్డ్ స్థలములన్నింటినీ, క్రమబద్ధీకరించడం ద్వారా సంపూర్ణ యాజమాన్య హక్కులు లభించడంతో, అవసరమైతే అమ్ముకునే అవకాశం కలుగుతుందన్నారు. అసైన్డ్ భూములపై జగనన్న హక్కులు కల్పించడం చారిత్రాత్మకమని, నిరుపేదలకు గొప్ప వరమని తెలిపారు. రెవెన్యూ లోపాలపై ప్రభుత్వం గట్టిగా దృష్టి సారించి, సవరిస్తోందన్నారు. చంద్రబాబు అసైన్డ్ భూములను దోచుకుంటే, వైఎస్ జగన్ వాటిపై పేదలకు హక్కులు కల్పించారన్నారు.
వందేళ్లుగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించడం ద్వారా, 2.50 లక్షల ఎకరాలు విముక్తి పొంది, రైతులకు హక్కులు సంక్రమింప చేశారన్నారు . ఉమ్మడి రాష్ట్రంలో, వైయస్ హయాంలో, ఏడు లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని, అదే బాటలో జగనన్న నడుస్తూ, సాగుకు యోగ్యమైన భూమిని గుర్తించారని, చట్టసభల ఆమోదానంతరం త్వరలో భూపంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారన్నారు. పేదలు బడుగులకు మేలు చేయాలని పథకాలు తెచ్చిన ప్రతిసారి, ప్రతిపక్ష టిడిపి ఎలా కోర్టులకెక్కి, అడ్డుకోవాలని చూస్తుందో, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు.
బ్రిటిషర్లు సర్వే జరిపించినప్పటి నుంచి మళ్లీ ఈనాటికీ, భూ సర్వే జరగకపోవడం వల్ల గ్రామాల్లో ఎన్నో వివాదాలు నెలకొన్నాయన్నారు. వీటన్నింటినీ పరిష్కరించడానికి సీఎం వైఎస్ జగన్ భూ రీసర్వే ప్రారంభించి, 17వేల గ్రామాలకుగాను, 4 వేల రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తి చేశారని, రెండు నెలల్లో మరో రెండు వేల గ్రామాలలో సర్వే పూర్తవుతోందన్నారు. పదివేల మంది సర్వేయర్లను నియమించి, ఇప్పటికే రూ 500 కోట్లు ఖర్చు పెట్టి, ఐదు సెంటీమీటర్ల కచ్చితత్వంతో భూ సర్వే జరుగుతుందన్నారు. దీనికోసం ఏ ఒక్క రైతు రూపాయి ఖర్చు పెట్టకుండానే, భవిష్యత్తులో ఏ భూ వివాదాలు రాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం భూ రీ సర్వే చేయించడాన్ని పలువురు రాజనీతిజ్ఞులు అభినందిస్తున్నారన్నారు. ఇవన్నీ ఓట్ల కోసం కాదని, భవిష్యత్తు రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భూసంస్కరణలు తీసుకొచ్చార న్నారు. సామాన్యులు కూడా తాముండే గ్రామంలోనే రిజిస్ట్రేషన్లు చేయించుకునేలా ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా సీఎం జగన్ కొత్తగా టైటిలింగ్ యాక్ట్ తెచ్చారన్నారు. 100 సంవత్సరాలుగా కృషించిపోయిన రెవెన్యూ శాఖను, సీఎం జగన్ కోట్లాది ప్రజల ఆకాంక్షల మేరకు, క్లియర్ టైటిల్తో ఉండే రాష్ట్రంగా ఏపీని నిలుపబోతున్నారన్నారు.