బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలి
గుంటూరు, డిసెంబరు 11 : గుంటూరు జిల్లా బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఇందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలు అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. బాల్య వివాహాలు వలన కలిగే అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించాలని చెప్పారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ (బి.వి.ఎం.బి) కార్యక్రమంపై వందరోజుల ప్రచార కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమస్య పరిష్కారానికి వాస్తవ పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్య వివాహాలు జరుగుటకు సామాజిక, ఆర్థిక కారణాలు, స్పష్టమైన అంశాలను విశ్లేషించాలని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు నియంత్రణకు అవరోధాలుగా ఉన్న కారణాలు విశదీకరించాలని చెప్పారు. చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు విద్యావకాశాలు, ఉన్నత ఉద్యోగ అవకాశాలు వాటి ఫలితాలు వివరించాల్సిన అవసరం ఉందని వివరించారు. కిశోర బాలికలపై దృష్టి సారించాలని, మహిళ పోలీసుల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి చిన్నారులకు విద్యావకాశాలు, ఉన్నత ఉద్యోగ అవకాశాలుపై కౌన్సెలింగ్ ఇవ్వాలని తద్వారా స్ఫూర్తిని నింపాలని తెలిపారు. మహిళా సాధికారతపైన స్పష్టమైన అవగాహన కల్పించాలని అన్నారు. వంద రోజుల ప్రచార పర్వంలో
షెడ్యూల్ ను పక్కాగా తయారు చేయాలని ఆదేశించారు.
ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి ప్రసూన మాట్లాడుతూ బాల్య వివాహాలు నివారణకు ప్రభుత్వం జి.ఓ నంబరు 31, 39తో ఉత్తర్వులు విడుదల చేసిందన్నారు. ఇందులో వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఉన్నాయన్నారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞను చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి,
గుంటూరు నగర పాలక సంస్థ ఉప కమిషనర్ శ్రీనివాస రావు, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పల నాయుడు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ. గాయత్రి దేవి, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.









































