Dr.Babasaheb Ambedkar-Remembrance Day December 6
ప్రముఖ మేధావి, న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల సమాజిక న్యాయం కోసం పోరాడిన డా. బాబాసాహెబ్ అంబేద్క ర్ 1956 డిసెంబరు 6న మహా పరినిర్వాణం పొందారు.
స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఆయన అనేక సంస్కరణలు చేపట్టారు. ఆధునిక భారతదేశాన్ని రూపొందించడంలో ఆయన పాత్ర మరువరానిది.
ఆయనకు 64 డిగ్రీలున్నాయి. కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది అరుదైన గౌరవాన్ని సంపాదించాడు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా దేశానికి దిశా నిర్థేశం చేశాడు.
విద్యార్థి దశలో, కేవలం 32 ఏళ్ల వయసు ఉన్నప్పుడు డాక్టర్ అంబేడ్కర్ రాసిన ఓ పుస్తకం భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభంగా నిలిచింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ డిగ్రీ కోసం ఆయన చేసిన పరిశోధనే ఈ పుస్తక రూపంలో ఆవిష్కృతమయింది.ఆ పరిశోధలొ భాగంగా 1923లో లండన్‌లో వెలువరించిన “ద ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ” పుస్తకం భారత, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థల బలపడడానికి సహకరించింది. దీనిపై జరిగిన చర్చలు అనంతర కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు బాటలు పరిచాయి.
భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ఆయన మరణాంతరం 1990లోప్రకటించింది. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు. భారత రాజ్యాంగ సభకు కమిటీ ఛైర్మన్‌గా, స్వేచ్ఛ,సమానత్వం, సోదరభావాన్ని పెంపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ అవిశ్రాంతంగా కృషి చేశారు.
బౌద్ధం ప్రాథమిక భావనలలో పరినిర్వాణ స్థితి ఒకటి. మహాపరినిర్వాణం పాళీ భాష నుంచి వచ్చింది. మరణించిన తర్వాత మోక్షం లేదా స్వేచ్ఛను పొందిన వ్యక్తిని ఇది సూచిస్తుంది. “నేను హిందువుగా పుట్టినా.. హిందువుగా చనిపోను” అని ప్రకటించి, నాగపూర్ లో 1956 అక్టోబరు 29 నాడు తలపెట్టిన బౌద్ధ ధర్మ దీక్షా సదస్సులో అంబేద్కర్, 5 లక్షల మందిఅనుచరులతో బౌద్ధ ధర్మమును స్వీకరించాడు. ముందుగా త్రిశారణం, పంచాశీల స్వీకరించి 5 లక్షల మందికి 22 ప్రతిజ్ఞలతో బౌద్ధ ధమ్మముని ఉపదేశించాడు.
బౌద్ధంలోకి మారిన రెండు నెలల లోపే ఆయన మరణించారు. ఆయన మరణం దేశానికి పెద్ద నష్టమని , దేశ చరిత్రలో ఒక దురదృష్టకరమైన రోజుగా వివిధ రంగాల ప్రముఖులు ప్రకటించారు.
డిసెంబరు ఆరున అంబేడ్కర్ చనిపోయారనే వార్త దావానంలో వ్యాపించింది.వేలాది మంది అంబేడ్కర్ అనుచరలు దిల్లీలోని ఆయన నివాసం వైపుగా బయలుదేరారు. అంబేడ్కర్ అంత్యక్రియలు బొంబాయిలో జరగాలని కోరినట్లు సవితా అంబేడ్కర్ చెప్పారు. ఢిల్లీలోని అంబేడ్కర్ నివాసానికి నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, ఇతర మంత్రులు.. పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు వచ్చి నివాళులర్పించారు.
అంబేడ్కర్ మృతదేహాన్ని బొంబాయి తీసుకువెళ్లడానికి జగ్జీవన్‌రామ్ విమానాన్ని ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని నాగ్‌పూర్ మీదుగా బొంబాయికి తరలించారు. బొంబాయిలో జరిగిన అపూర్వమైన అంతిమయాత్రను దేశమంతా చూసింది. క్తిముంబైలోని వస్త్ర పరిశ్రమ కార్మికులంతా ఆయన పార్ఠీవ దేహాన్ని చూసేందుకు రోడ్లపై బారులు తీరారు. అక్కడక్కడ తొక్కిస లాట జరిగింది. ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ముంబై విమానాశ్రయంలో ఆయనను చూడటానికి 5 వేల మంది వచ్చారు.కార్మికులంతా రోడ్లపైకి చేరుకోవడంతో యాజమాన్యాలు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. ఆయన అంతిమ యాత్రలో 50 వేల మంది పాల్గొన్నారు. ప్రజల రద్దీ తీవ్రంగా ఉండటతో రాత్రి 7.30 గంటలకు ముంబైలోని శివాజీ పార్కులో ఆయన కుమారుడు యశ్వంత్ రావు చితికి నిప్పంటించారు. ఆయనకు కడసారి దర్శించి నివాళులర్పించేందుకు 5 లక్షల మంది చేరుకున్నారని ముంబై పోలీసులు తెలిపారు.















































