దక్షిణాదిపై వివక్ష–ఉత్తరాది పెత్తనం
ఉత్తరాది – దక్షిణాధి వ్యత్యాసాలు ఎక్కువవుతున్నాయి. అందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాల నుంచి కేంద్రం వసూలు చేస్తున్న పన్నులకు, నిధులకు పొంతన ఉండటం లేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఏపీల నుంచి ట్యాక్సుల రూపంలో వెళుతున్న నిధుల్లో రూపాయికి 40 పైసలు కూడా కేంద్రం విదిలించడం లేదు. అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలవుతున్న 60 శాతం నిధులను ఉత్తరాది రాష్ట్రాలకు దారపోస్తున్నారు. ఇదిలా ఉండగా మూలిగే నక్కపై తాటిపండు పడినట్లు డీ లిమిటేషన్ ఒకటి. డీ లిమిటేషన్ అంటే జనాభా ప్రకారం పార్లమెంటు సీట్లను ప్రతిపాదించడం. కుటుంబ నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటు స్థానాలను కోల్పోవడం.. ఉత్తరాది రాష్ట్రాలకు మరిన్ని సీట్లు పెరగడం దేశంలో ఉత్తరాది- దక్షిణాది అంతరాలకు బీజం వేస్తోంది. ఉత్తరాది ప్రాతినిద్యం పెరిగి వారిమాటే చెల్లుబాటయ్యే విధంగా డీ లిమిటేషన్ శ్రీకారం చుడుతోంది. ఇదే విధంగా దక్షిణాదిపై త్రిభాషా సూత్రంపేరుతో హిందీని రుద్దుతున్నారు. అయితే ఈ సూత్రం ఉత్తరదేశానికి ఈ సూత్రం లేకపోవడం వివక్షకు ప్రతిబింబంగా నిలుస్తోంది.
భారత్ లో ప్రతి 100 కిలోమీటర్లకు భాష లేదా యాస మారిపోతుంటుంది. ఇలాంటి పరిస్ఠితుల్లో ఉత్తరాది భాషను దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకు రుద్దుతున్నారని దేశ దక్షిణాది ప్రజలు మండిపడుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది భాషలైన తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషలు ఉత్తరాది భాషలతో ప్రాథమికమైన భేదాలున్నాయి. దీంతో దక్షిణాది ప్రాంతాలు హిందీని అంగీకరించడం లేదు. ముఖ్యంగా తమిళ, కేరళ ప్రజలు హిందీని ఎంత మాత్రం అంగీకరించే స్థితిలో లేరు. హిందీ భాషతో భోజ్‌పురి, మైథిలి, అవధి, బ్రజ్, బుందేలి, గద్వాలి, కుమౌని, మఘి, మార్వారి, మాల్వి, చత్తేస్‌గఢి, సంతాలి, అంగిక, హో, ఖైరా, ఖుర్తా, కుర్మాలి, కురుఖ్, ముండాలిలతో పాటు ఇంకా అనేక స్థానిక భాషలు మాయమైపోయాయని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హిందీని బలవంతంగా రుద్ది తే ఉత్తరాది – దక్షిణాది విభజనకు, అనైత్యకు గురయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
వాస్తవానికి హిందీ భాష విషయంలో సాగుతున్న వివాదం ఈనాటిది కాదు. తమిళనాడులో హిందీ వ్యతిరేక ప్రచారానికి 8 దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. మద్రాసు ప్రెసిడెన్సీలో సి.రాజగోపాలాచారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ బోధన అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేయడంతో మొట్టమొదట హిందీ వ్యతిరేకోద్యమం 1937లో జరిగింది. దీనికి జస్టిస్ పార్టీ కి చెందిన పెరియార్ రామస్వామి నేతృత్వం వహించారు. 3 ఏళ్ల పాటు కొనసాగిన ఆందోళనలో భాగంగా నిరాహారదీక్షలు, సమావేశాలు, పాదయాత్రలు, పికెటింగ్, ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. పోలీసు కాల్పుల్లో ఇద్దరు ఆందోళనకారులు మృతిచెందగా, పిల్లలు, మహిళలు సహా 1198 మంది అరెస్టయ్యారు. 1939లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేశాకా, 1940 ఫిబ్రవరిలో మద్రాసు ప్రెసిడెన్సీ బ్రిటీష్ గవర్నర్ నిర్బంధ హిందీని ఉపసంహరించారు.
1960ల్లో దీని మీద రాజ్యాంగ సభలో ఓటింగ్ జరిగింది. హాజరైన సభ్యులతో 78-78 ఓట్లతో టై గా నిలిచింది. దీంతో ఓటింగ్‌ను మళ్లీ జరపాలని నిర్ణయించారు. ముందు రోజు ఓటింగ్ రాని కవి, రాజ్యాంగ సభ్యుడు గురు ముఖ్‌సింగ్‌ను పిలిపించారు. ఆయన అనుకూలంగా ఓటు వేయడంతో హిందీ ఒకే ఒక్క ఓటుతో నెగ్గింది. అయితే ఈ వివాదం అంతటితో సమసిపోలేదు. మళ్లీ లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న సమయంలో హిందీని అన్ని రాష్ట్రాల్లో అధికార భాషగా అమలు చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. దానిని అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి అన్నాదురై తీవ్రంగా ప్రతిఘటించారు. 1965 లో దాదాపు 55 రోజులు హిందీ వ్యతిరేక ఆందోళన కొనసాగింది. 1965 ఫిబ్రవరి 10న జరిగిన పోలీసు కాల్పుల్లో 35 మంది ఆందోళనకారులు మరణించారు. 1967, 68 ల్లో కూడా అధికార భాష సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తమిళనాడులో ఉద్యమం సాగింది. ఈ నేపథ్యంలోనే 1968లో ప్రపంచ తమిళ సభలు జరిగాయి.
తెలుగు, కన్నడ , మలయాళ రాష్ట్రాల్లో కూడా హిందీ భాషపై అనుకూలత లేదు. ఇటీవల కర్నాటకలో చాలా చోట్ల కన్నడ భాష ఉద్యమాలు జరిగాయి. భారతీయ జనతా పార్టీ నాయ కత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందీ వాదన మరింత బలాన్ని పుంజుకుంది. నిజానికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు మాట్లాడే భాషలను చూసినా.. రాష్ట్రాలను చూసిన హిందీ ప్రాధాన్యత చాలా తక్కువ. పెరియార్,మునిస్వామి పిళ్లై ,అన్నాదురై, కరుణానిధి వంటి వారంత హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడాన్ని బహిరంగంగా నిరసించారు. దీనివల్ల ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాలు నీరుగారుతాయని తమిళులు భావిస్తున్నారు.
కర్ణాటకలో ఉద్యోగాల కోసం వచ్చిన ఉత్తరాదివారితో మరీ ముఖ్యంగా ఐటీ ఉద్యోగాల కోసం వలస వచ్చిన ఉత్తరాది జనాలతో హిందీ డామినేషన్ తీవ్రం అవుతోంది. అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో కూడా హిందీ జనాలు తమది జాతీయ భాష అన్నట్టుగా ప్రవర్తించడంతో కన్నడీగుల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వాస్తవానికి ఐటీ కంపెనీలు నడిచేది ఇంగ్లిష్ వ్యవహారికంగా అయినా, హిందీని చొప్పించడానికి నార్తిండియన్లు శతవిధాల ప్రయత్నిస్తున్నారు .ఈ నేపథ్యంలో కర్ణాటకలో గత కొన్నాళ్లుగా నార్తిండియన్లు ప్రత్యేకంగా టార్గెట్ అవుతూ ఉన్నారు. ఆటో డ్రైవర్లు వీరిపై మొదట తిరగబడుతున్నారు. బెంగళూరు కన్నడ నేల అని వారు గుర్తు చేస్తున్నారు. కర్ణాటకలో కన్నడలోనే మాట్లాడాలని, వేరే భాషలను అర్థం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని సీఎం సిద్ధరామయ్య సూటిగా చెబుతున్నారు.
కర్ణాటక రక్షణ వేదిక అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ శెట్టి మాట్లాడుతూ భాష విషయంతో బీజేపీ ఎన్నికలకు వస్తే ఆ పార్టీకి రాష్ట్రంలో డిపాజిట్ కూడా దక్కదన్నారు. అంతేకాకుండా ప్రధాని మోడీ లేదా అమిత్ షాలు రాష్ట్రాన్ని సృష్టించలేదని దాన్ని మన పూర్వీకులు నిర్మించారని స్పష్టం చేశారు. దక్షిణ భారతంలోని అన్ని ప్రాతీయ భాషలకు ఇది వర్తిస్తుందన్నారు. ద్రవిడ వారసత్వాన్ని పంచుకున్న దక్షిణాది భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మళయాళం సుదీర్ఘ చరిత్రను కలిగి ఉన్నాయని శెట్టి పునరుద్ఘాటించారు. కన్నడకు ప్రాధాన్యం ఇవ్వాలని కన్నడ సినీ రారాజు రాజ్ కుమార్ మద్దతుతో ‘గోకాక్’ ఆందోళన కన్నడ ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది.కేరళకూడా హిందీ భాషా వివాదానికి గురైంది. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా హిందీ భాషను రుద్దడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. భాషా వివాదాలకు గురికానిది తెలుగు రాష్ట్రాలు మాత్రమే. తెలుగునాట దశాబ్దాల నుంచి హిందీని మూడో భాషగా బోధిస్తూ ఉన్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని రెండు జాతీయ రహదారులపై ఆంగ్ల బోర్డులను హిందీ బోర్డులతో భర్తీ చేసిన నివేదికలు వెలువడినప్పుడు DMK, PMK వంటి పార్టీలు మండిపడ్డాయి. ఇటీవల కాలంలో పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులపై రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయడంతో ఆందోళన మరింత ఊపందుకుంది. అన్ని CBSE, కేంద్రీయ విద్యాలయ పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేయడం, జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ నిర్మించిన హిందీ ప్రాంతీయ చిత్రాలలో డబ్బింగ్ లేదా ఉపశీర్షికలకు ఏర్పాట్లు చేయడం వంటి సిఫార్సులను ఆమోదించడం దక్షిణాదిలో కలకలం రేపింది.
అంతేకాదు.. ప్యాకెట్ల మీద పెరుగు పేరును ‘దహీ’ అంటూ హిందీ పదం రాయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆదేశించడం ఇది హిందీని బలవంతంగా ‘రుద్దడమే’ అంటూ తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కూడా దహీ అని రాయడాన్ని విమర్శించారు. కన్నడ ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిసే హిందీని రుద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అథారిటీ కొత్త సర్క్యూలర్‌ను జారీ చేసింది. సాధారణంగా ఎఫ్‌ఎస్ఎస్ఎఫ్‌ఏ-2011 నిబంధనల ప్రకారం పాలు, పాల సంబంధిత ఉత్పత్తులకు మాత్రమే డెయిరీ పరమైన పదాలు వాడాలని అందులో పేర్కొంది. నాన్-డెయిరీ ప్రోడక్ట్స్‌కు వాటిని వాడకూడదని చెప్పింది. భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడైన బాబాసాహెబ్ అంబేద్కర్ హిందీని జాతీయ భాషగా.. అధికార భాషగా చేయడాన్ని వ్యతిరేకించారు.
ఇటీవల మరొక పెను ప్రమాదం దక్షిణ భారతదేశం ఎదుర్కోబోతున్నది. జనాభా ప్రాతిపదికగా లోక్‌సభ స్థానాలను నూతనంగా డీలిమిటేషన్ చేయబోతున్నారు. దీనితో ఉత్తర భారత దేశంలో సీట్లు గణనీయంగా పెరుగుతాయి. దక్షిణ భారతదేశంలో తగ్గుతాయి. ఇది దక్షిణ భారత దేశ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీయగలదు. ఇది బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకోబోతోంది. దీనితో పాటు హిందూ మతాన్ని దాదాపు అధికార మతంగా చూస్తూ.. రాజ్యాంగంలో లౌకిక తాత్వికత, విధానాలను కాగితాలకే పరిమితం చేస్తోందన్న విమర్శలున్నాయి.
తమిళనాడుపై హిందీని ‘రుద్దకపోతే’ డిఎంకె హిందీని వ్యతిరేకించబోదని, తమిళులపై ఆ భాషను రుద్దడం వారి ఆత్మ గౌరవంతో ఆటలు ఆడుకోవడమే అవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. హిందీ భాషను విధించే అంశంపై పార్టీ సభ్యులకు స్టాలిన్ ఒక లేఖ రాస్తూ, ఆత్మ గౌరవం తమిళులకు ‘విశిష్ట’ స్వభావంగా పేర్కొన్నారు. డిఎంకె ఇప్పటికీ హిందీని ఎందుకు వ్యతిరేకిస్తున్నదని అడుగుతున్నవారికి నా వినమ్ర సమాధానం ఏమిటంటే మీరు ఇప్పటికీ మాపై ఆ భాషను రుద్దుతుండడమే కారణం అని ఆయన తెలిపారు. మీరు హిందీని విధించకపోతే మేము వ్యతిరేకించం. తమిళనాడులో హిందీ పదాలపై నలుపు రంగు పూయం అని స్పష్టం చేశారు.
దేశ స్వతంత్రం తర్వాత త్రిభాష సూత్రం అమల్లో పెట్టినప్పుడు… దక్షిణాది రాష్ట్రాలు ఎలా అయితే హిందీని బోధిస్తాయో, అలాగే ఉత్తరాది రాష్ట్రాలు కూడా ఒక దక్షిణాది భాషను తమ రాష్ట్రంలో ని విద్యార్థులకు బోధించాలి. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్ ల్లో ప్రథమ భాషగా హిందీని , ద్వితీయ భాషగా ఇంగ్లిష్ ను బోధిస్తూ ఉంటే.. తృతీయ భాషగా తెలుగునో, తమిళన్నో, మలయాళాన్నో లేదా.. ఏ పంజాబీనో ఒక సబ్జెక్ట్ గా బోధించాలి. కాని ఇలా జరగడం లేదు. ఈ త్రిభాషా సూత్రం కేవలం దక్షిణాది రాష్ట్రాల మీదే రుద్దబడింది. అసలు హిందీ జాతీయ భాష కాదు. ఇది రాజ్యాంగమే చెబుతూ ఉంది. దేశంలోని సవాలక్ష భాషల్లో హిందీ ఒకటి అంతే. మంది ఎక్కువుంటే.. అదే జాతీయ భాష అంటే ఎలా చెల్లుతుంది? త్రిభాషా సూత్రాన్ని అమలు చేయకపోతే తమిళనాడుకు నిధులు ఇవ్వమని, ఇవ్వొద్దని అంటూ కూడా బీజేపీ సానుభూతి పరులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం సరికాదు.
ఇకపోతే లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన. అది జనాభా ప్రాతిపదికన గనుక జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలది అరణ్య రోదనే అవుతుంది . యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ను అమలు చేయకపోవడంతో అన్యూహ్యంగా జనాభా పెరిగింది. చాలా కాలంగా సౌత్ స్టేట్స్ కుటుంబ నియంత్రణను జాగ్రత్తగా పాటిస్తూ వస్తున్నాయి. ఇందుకు ఫలితం.. మళ్లీ దక్షిణాది రాష్ట్రాలకే శరాఘాతంగా తగలబోతోంది. యూపీ, బిహార్ తో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నింటిలోనూ జనాభా ప్రాతిపదికన భారీగా ఎంపీ సీట్లు పెరగబోతున్నాయి. దక్షిణాదిలో పెంపుదల సంగతిని పక్కన పెడితే ఉన్న ఎంపీ సీట్ల సంఖ్య కూడా తగ్గిపోనుంది. జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు పెరిగితే… ఉత్తరాది ఎంపీ సీట్లతోనే కేంద్రంలో అధికారాన్ని సంపాదించుకోవచ్చు. అప్పుడు దక్షిణాది రాష్ట్రాలతో ఎలా వ్యవహరించినా, ఆయా రాష్ట్రాలను ఎంతగా నిర్లక్ష్యం చేసినా కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి నష్టం ఉండబోదు. కాబట్టి దీనిపై ఉద్యమించాల్సిన అవసరం దక్షిణ రాష్ట్రాలపై ఉంది.