అమరావతి
కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉంది
ఇది ప్రగతిశీల బడ్జెట్ :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి:- కేంద్ర బడ్జెట్ రాష్ట్రానికి తోడ్పాటును ఇచ్చేలా ఉందని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
కేంద్ర బడ్జెట్ పై తనను కలిసిన మీడియాతో ముఖ్యమంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము కేంద్రం ముందు ఉంచిన ప్రతిపాదనలు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి నిధులు ప్రకటించడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయని అన్నారు. కేంద్రం అండగా ఉంది అనే భావనతో యాక్టివిటీ. మరింత పెరుగుతుందని…ఈ కారణంగా రాష్ట్రానికి పన్నుల రూపేణా ఆదాయం లభిస్తుందని అన్నారు. నిధులు ఏ రూపేణా వచ్చినా, అది రాష్ట్రానికి ఎంతో ఉపయోగం అని అన్నారు. రాజధాని నిర్మాణం వేగం పుంజుకోవాలంటే ఈ నిధులు ఎంతో ఉపయోగ పడతాయని సిఎం అన్నారు. వివిధ ఏజన్సీల ద్వారా వచ్చే అప్పులకు కేంద్రం పూచీకత్తు ఇస్తుందని అన్నారు. వీటికి అదనంగా మరి కొంత గ్రాంట్ కూడా వస్తుందని అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు ఈ ఏడాది ఇంత మేర నిధులు అని పెట్టకపోయినా పూర్తి చేసే బాధ్యత తమదే అని కేంద్రం ప్రకటించిందని…ఇది మంచి పరిణామమని , మనం కోరుకుంది కూడా ఇదేనని చంద్రబాబు అన్నారు. వెనుకబడి జిల్లాలకు ఇచ్చే సాయం బుందేల్ ఖండ్ ప్యాకేజి తరహాలో ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ ప్యాకేజీలో పారిశ్రామిక రాయితీలు కూడా వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన ప్రధాని మోదీకి ఎక్స్ ద్వారా సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం ప్రకటించిన సాయం రాష్ట్ర పునర్ నిర్మాణానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అదే విధంగా ప్రగతి శీల, కాన్ఫిడెన్స్ పెంచే కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన ప్రధానికి, కేంద్రానికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.