అమరావతి
తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం
జనవరి 8 నుండి 10 వరకు విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐల్యాండ్ లో నిర్వహణ.. ప్రవేశం ఉచితం
:- మంత్రి కందుల దుర్గేష్
సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఒకే బహిరంగ వేదికపైకి తేనున్న వేడుక
తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంతో పాటు, సమకాలీన సృజనాత్మక పద్ధతులకు పెద్దపీట
ఆంధ్రప్రదేశ్‌ను సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ ఉద్దేశమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
ప్రజా రాజధాని అమరావతిని సాహితీ, కళా రాజధానిగా మార్చేందుకు తొలిమెట్టుగా ఈ ఫెస్టివల్ ఉండనుందని పేర్కొన్న మంత్రి దుర్గేష్
అమరావతి: తెలుగు సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని చాటిచెప్పేలా కూటమి ప్రభుత్వం విజయవాడ వేదికగా జనవరి 8 నుండి 10 వరకు ఆవకాయ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవం పేరిట వినూత్న సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేసిందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు..సోమవారం వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ విభాగంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీఏ సీఈవో, ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట, టీమ్‌వర్క్ ఆర్ట్స్ కంపెనీ ప్రొడ్యూసర్ శ్యామ్ తో కలిసి ఆవకాయ్ సినిమా సంస్కృతి, సాహిత్యోత్సవంపై పలు అంశాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మరియు టీమ్‌వర్క్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో 2026 జనవరి 8 నుండి 10 వరకు మూడు రోజుల పాటు విజయవాడలోని కృష్ణా నది ఒడ్డున ఉన్న పున్నమి ఘాట్ , భవాని ఐలాండ్ లలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు. రాష్ట్రంలోని సుసంపన్నమైన కథా సంప్రదాయాలు, సినిమా, సాహిత్యం, ప్రదర్శన కళలను ఘనంగా చాటాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల దార్శనికతలో భాగంగా ఈ ఉత్సవం రూపుదిద్దుకుందన్నారు. కేవలం ఇండోర్ హాల్స్‌కే పరిమితం కాకుండా, బహిరంగ ప్రదేశాల్లో ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం దీని ప్రత్యేకతగా మంత్రి పేర్కొన్నారు. తెలుగు కథలు, సినిమాలకు జాతీయ స్థాయిలో పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, అమరావతి-విజయవాడ ప్రాంతాన్ని ఒక సమకాలీన సాంస్కృతిక రాజధానిగా మార్చడమే ఈ పండుగ లక్ష్యమని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ ఉత్సవం ఆంధ్రప్రదేశ్ వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా, స్థానిక కళాకారులకు,కళాభిమానులకు ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు.సినిమా, సాహిత్యం, సంగీతం, నాటకరంగం, సాంస్కృతిక చర్చలను ఒకే బహిరంగ వేదికపైకి తెచ్చి ఆంధ్రప్రదేశ్‌ను సాంస్కృతిక మార్పిడికి, కళాత్మక భాగస్వామ్యానికి ఒక శక్తివంతమైన గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా అమరావతి ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రవేశం ఉచితం అన్నారు.
పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఆవకాయ్ మంచి వేదిక:మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం, ప్రజా సంబంధాలను మెరుగుపరచడంలో సంస్కృతిని ఒక బలమైన పిల్లర్‌గా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు ‘ఆవకాయ’ ప్రతిరూపమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సినిమా, సాహిత్యం, సంగీతం మరియు కళా ప్రదర్శనలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా, మన కళా సంప్రదాయాల లోతును చాటిచెబుతూనే సమకాలీన సృజనాత్మకతను తాము గౌరవిస్తున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ ఒక గొప్ప సాంస్కృతిక గమ్యస్థానంగా ఎదగడానికి, అలాగే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ ఉత్సవం ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధునాతన, ప్రాచీన కళలను ప్రపంచానికి తెలియచెప్తామన్నారు . అమరావతిని సాహితీ, కళా రాజధానిగా తయారు చేసే క్రమంలో ఈ కార్యక్రమం తొలిమెట్టుగా భావిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి పాత్రికేయులను ఆహ్వానించారు. పాత్రికేయులు తమ పాత్రికేయ వృత్తి పరిణామ క్రమాన్ని కార్యక్రమంలో తెలియజేయాలని సూచించారు. గత ప్రభుత్వంలో కళలను నిర్లక్ష్యం చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కళా, సాంస్కృతిక రంగాలకు పునరుజ్జీవం కల్పించిందని అన్నారు. నేటి తరానికి కళలపై మక్కువ కల్పించాలని, భవిష్యత్ తరాలకు సాహితీ ప్రక్రియలను తెలపాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు.
దీర్ఘకాలిక పర్యాటక లక్ష్యాలకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయి:పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్
బహుళ కళారూపాలను బహిరంగ ప్రదేశాలతో మరియు ప్రజా భాగస్వామ్యంతో అనుసంధానించే సమగ్ర సాంస్కృతిక చొరవగా ‘ఆవకాయ’ను తీర్చిదిద్దామని పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. నదీ తీర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈ కార్యక్రమం చర్చలు, ప్రదర్శనలు మరియు అభ్యాసాలను అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తుందన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు, సమకాలీన సృజనాత్మకతను పెంపొందించడానికి మరియు దీర్ఘకాలిక పర్యాటక లక్ష్యాలకు అనుగుణంగా స్థిరమైన సాంస్కృతిక వ్యవస్థను నిర్మించడానికి ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరమన్నారు.జనవరి లో గండి కోట, అరకు, విశాఖ, ఫ్లెమింగో ఉత్సవ్ లను నిర్వహిస్తామ్మన్నారు.
పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఆవకాయ్ దోహదం:ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట
సినిమా, సాహిత్యం మరియు ప్రదర్శన కళలతో కూడిన బహుముఖ కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక మరియు సృజనాత్మక బలాన్ని ప్రదర్శించడానికి ‘ఆవకాయ’ రూపొందించబడిందని ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట అన్నారు. నదీతీర నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతూ, వైవిధ్యభరితమైన ప్రేక్షకులను ఈ ఉత్సవం భాగస్వాములను చేస్తుందన్నారు. స్థానిక సంప్రదాయాల్లో వేళ్ళూనుకున్న ఈ సాంస్కృతిక అనుభవాలు పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, నేటి తరం ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తాయన్నారు.
ఏపీ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించే వాతావరణంలో సినిమా, సాహిత్యం, కళలను జరుపుకోవడం ఆవకాయ్ ప్రత్యేకత: సంజయ్ కె. రాయ్, మేనేజింగ్ డైరెక్టర్, టీమ్‌వర్క్ ఆర్ట్స్
ఆవకాయ ఉత్సవం ఈ ప్రాంతపు ఆలోచనలు, కథలు మరియు ప్రదర్శనలను ఒకచోట చేర్చే ఒక బహిరంగ సాంస్కృతిక వేదిక అని టీమ్‌వర్క్ ఆర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కె. రాయ్ పేర్కొన్నారు. ఇది కళాకారులు, ప్రేక్షకుల మధ్య అర్థవంతమైన సంభాషణలకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబించే వాతావరణంలో సినిమా, సాహిత్యం మరియు కళలను జరుపుకోవడం ఈ పండుగ ప్రత్యేకత అన్నారు. ఆవకాయ ఉత్సవాన్ని సాకారం చేయడంలో ఏపీ ప్రభుత్వం మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆవకాయ ఉత్సవాన్ని సాకారం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన మద్దతు, వారి దార్శనికతకు తాము కృతజ్ఞులమని టీమ్‌వర్క్ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ మరియు వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేయడం వల్ల ఒక ఆలోచనాత్మకమైన సాంస్కృతిక వేదికను సృష్టించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ ఉత్సవం మన కథా సంప్రదాయాలను మరియు సమకాలీన సృజనాత్మక పద్ధతులను గౌరవిస్తూ సినిమా, సాహిత్యం మరియు కళలను ఒక్కటి చేస్తుందని భావిస్తున్నామన్నారు.
మూడు రోజుల పాటు సాగే ఈ వేడుకలో భాగంగా తెలుగు సినిమా మూలాలు, సాహిత్య నేపథ్యం, నేటి మార్పులపై చర్చలు, ప్రదర్శనలు జరుగుతాయన్నారు. కవిత్వం, ముషాయిరా (తెలుగు మరియు ఉర్దూ), నృత్యం, సంగీతం మరియు థియేటర్ లపై , తోలుబొమ్మలాట, నృత్యం, సంగీతం మరియు నాటకరంగంపై శిక్షణ తరగతులు నిర్వహించబడుతాయన్నారు. హెరిటేజ్ వాక్ (వారసత్వ యాత్రలు), ఘాట్ ఫెర్రీ ప్రయాణాలు మరియు రుచికరమైన స్థానిక వంటకాలతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై త్వరలో ఏపీ ప్రభుత్వం కీలక సమావేశం:మంత్రి కందుల దుర్గేష్
ఈ వారంలో మొదట సినిమాటోగ్రఫీ, హోంశాఖ నేతృత్వంలో ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించనున్నామన్నారు. ఉన్నతాధికారుల సమావేశం తర్వాత సినీ ప్రముఖులతో సమావేశం అవుతామన్నారు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.























































