రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి…
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని ప్రజల సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళుగా పనిచేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణం సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం మంత్రివర్యులు మచిలీపట్నం రహదారులు భవనాలు అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నామని రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామన్నారు.
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో ఒక భరోసా కల్పించాలని తపనతో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను చిత్తశుద్ధితో నెరవేర్చేందుకు కట్టుబడి ఉందన్నారు.
ప్రజలకు అందే సౌకర్యాలను ఎలాంటి మోసాలు జరగకుండా బాధ్యతగా అందించాలని రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు.
ఎక్కడైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగితే తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిస్తూ మంత్రి టిడ్కో ఇల్లు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా చక్కగా 80 నుంచి 85 శాతం పూర్తి చేశారని గత ప్రభుత్వం వాటిని పాడుపడేలా చేసిందని తాము త్వరలో వచ్చే ఒకటిన్నర సంవత్సరంలోగా అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.
మౌలిక వసతులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఆ ప్రకారం అన్ని వసతులు కల్పించి ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
పేదల కోసం ప్రకటించిన 20 లక్షల ఇళ్లలో ఇప్పటివరకు 6.80 ఇల్లు నిర్మించారన్నారు.
గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఇళ్లను మంజూరు చేసిందన్నారు. వాటికి 50 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించిందన్నారు.
వాటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా గత ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు.
ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోనికి తీసుకొని పూర్తిస్థాయి బడ్జెట్ను త్వరలో ప్రవేశపెడతామన్నారు
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగి రికార్డులు కాలిపోయిన సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించి డిజిపిని అక్కడికి పంపించారని, విచారణ జరుగుతుందన్నారు
నేరానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
త్వరలో నేర రహిత ఆంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతామన్నారు.
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ పై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరుగుతుందన్నారు.
పాత్రికేయులకు అక్రిడేషన్లు ఇతర న్యాయమైన కోరికలు రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఆమోదించేలా చూస్తామన్నారు.
సమాచార శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయుటకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామన్నారు.
గృహ నిర్మాణ శాఖలో పేదవారికి గృహాలు దక్కేలా చూస్తామని ఎక్కడ అవినీతి అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.