తేదీ: 28-01-2026
iGOT కర్మయోగి వేదికపై చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్
కోటి మంది కోర్సుల నమోదు చేసుకోగా, 80 లక్షల కోర్సుల పూర్తి సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి జాతీయ స్థాయిలో చారిత్రక విజయాన్ని సాధించింది. కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ఠాత్మక మిషన్ కర్మయోగి కార్యక్రమంలో భాగంగా నడుస్తున్న iGOT కర్మయోగి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంపై రాష్ట్రం నుంచి కోటి మంది కోర్సుల నమోదు చేసుకోగా, 80 లక్షల కోర్సులు పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఈ అసాధారణ విజయం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్య వృద్ధికి, నిరంతర శిక్షణకు, ఆధునిక పాలనా విధానాలకు ప్రభుత్వం ఇస్తున్న అత్యుత్తమ ప్రాధాన్యతకు సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలనే దృఢ సంకల్పాన్ని ఇది స్పష్టం చేస్తోంది.
పాలనలో సామర్థ్య విప్లవం
iGOT కర్మయోగి వేదిక ద్వారా రాష్ట్రంలోని వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు పాలనా నైపుణ్యాలు, ఆర్థిక నిర్వహణ, సాంకేతిక జ్ఞానం, ప్రజాసేవ, నాయకత్వం, విధాన రూపకల్పన వంటి కీలక రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. వ్యక్తిగత అభివృద్ధితో పాటు సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడమే ఈ కార్యక్రమాల లక్ష్యం.
ప్రజలకు నేరుగా ప్రయోజనం
ఈ శిక్షణల ఫలితంగా ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను మరింత సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రభుత్వ సేవలు వేగంగా, నాణ్యతగా ప్రజల చేతికి చేరుతున్నాయి. ప్రజా కేంద్రీకృత పాలన (Citizen-centric governance) దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలకు ఇది బలమైన పునాది.
*దేశానికి ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్*
iGOT కర్మయోగి వేదికపై ఇంత పెద్ద స్థాయి పురోగతి సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. సామర్థ్య నిర్మాణమే అభివృద్ధికి మూలమనే సూత్రాన్ని ఆచరణలో చూపిస్తూ, ‘లెర్నింగ్ స్టేట్’గా రాష్ట్రం తన ప్రత్యేకతను చాటుతోంది.. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల వారీ ప్రత్యేక కోర్సులు, ఆధునిక టెక్నాలజీ ఆధారిత లెర్నింగ్ మాడ్యూళ్లు, అదనపు శిక్షణా కార్యక్రమాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిరంతరం నేర్చుకుంటూ ప్రజాసేవలో ఉత్తమతను సాధించాలన్నదే ముఖ్య ఉద్దేశ్యం.
ఈ అద్భుత విజయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటు, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. iGOT కర్మయోగి వేదికపై ఈ మైలురాయి సాధించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచింది.















































