భూ వివాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్
రెవెన్యూ సమస్యలన్నీ ఏడాదిలోగా జాయింట్ కలెక్టర్లు పరిష్కరించాలి
2027 జనవరి నాటికి రీసర్వే 2.0 పూర్తి
ఇక నుండి ఆలస్యం లేకుండా పాస్ పుస్తకాల పంపిణీ
పట్ణణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆటో మ్యూటేషన్
రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు అనగాని సత్య ప్రసాద్
అమరావతి, డిశంబరు 9: ఎటు వంటి భూ వివాదాలు లేని రాష్ట్రంగా ఆంధ్రపందేశ్ ను తీర్చిదిద్దేంకు అవసరమైన అన్ని చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టినట్లు రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖామాత్యులు అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలోని ప్రచార విభాగంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ పై సమీక్షా సమావేశం జరిగిందని, ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. కృత్రిమ మేథ సహకారంతో రెవెన్యూ శాఖలో జీరో ఎర్రర్ ధ్యేయంగా ముందుకు వెళుతున్నామన్నారు. గతంలో 7,600 గ్రామాల్లో చేసిన రీ సర్వేలో జరిగిన తప్పులను ఈ ఏడాదిన్నర కాలంలో సరిదిద్దామన్నారు. రీ సర్వే 2.0 ను 2027 జనవరి నాటికి కల్లా పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హాయాంలో రీ సర్వే ప్రహసనంలా మార్చారని, ఆ సమస్యలన్నీ పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఆటో మ్యూటేషన్ ప్రారంభించామని, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే 1.74 లక్షల ఆటో మ్యూటేషన్ లు నమోదు అయినట్లు తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆన్ లైన్ లో ఆటో మ్యూటేషన్ జరిగి ఆయా డాక్యూమెంట్స్ రిజిస్ట్రర్ పోస్ట్ లో సదరు భూ యజమానికి చేరే విధంగా కార్యాచరణ రూపకల్పన చేశామన్నారు. కొత్త పాస్ పుస్తకాల జారీలో టెండర్ నిబంధనల కారణంగా ఆలస్యమౌతోందని, ఇక నుండి త్వరగా పాస్ పుస్తకాలు జారీ చేసేలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.
ప్రత్యేకంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఖాళీగా ఉన్న జేసీ పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేయనున్నామన్నారు. రెవెన్యూ సమస్యలను ఏడాది కాలవ్యవధి లోగా పూర్తిగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్లపై బాధ్యత పెడుతున్నామని చెప్పారు. ఈ ఏడాది కాలం పాటు వీరు రెవెన్యూ సమస్యల పరిష్కారంపైనే పని చేస్తారని చెప్పారు.22ఏ జాబితాను క్లారిఫై చేసి ప్రభుత్వం, కోర్టులు జరిపిన వేలంలో కొనుకున్న భూములను ఆ జాబితా నుండి తొలగిస్తామని చెప్పారు. ప్రీహోల్డ్ భూముల రాష్ట్రంలో 36 లక్షల ఎకరాలు ఉండాలని, అయితే నేడు లెక్కలోకి వస్తుంది కేవలం 11లక్షల ఎకరాలు మాత్రమే అని అన్నారు. రెండు నెలల్లో ప్రీహోల్డ్ భూముల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని తెలిపారు.
పేదలకు మంచి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని మంత్రి అనగాని అన్నారు. కులదృవీకరణ పత్రాలు ఆధార్ తో అనుసంధానం చేస్తున్నామన్నారు. 2.77కోట్ల కులదృవీకరణ పత్రాలు ఇప్పటి వరకు జారీ చేయడం జరిగిందన్నారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో 86 శాతం పరిష్కరించామని, మిగిలిన 14 శాతం త్వరలో పరిష్కరిస్తామన్నారు. ప్రతి గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి భూ సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్నామన్నారు.
ఈనాం భూముల పరిష్కారానికి రెవెన్యూ, ఎండోమెంట్ శాఖలు సమన్వయంతో పనిచేసి 45 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించామని మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ శాఖలో ప్రతి సమస్యను పరిష్కరించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిబద్ధతతో పనిచేస్తున్నామన్నారు. ఇక రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో అమలు చేయబడుతున్న రిజిస్ట్రేషన్ విదానాలను అద్యయనం చేసి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేయనున్నామని తెలిపారు. పాస్ పోర్ట్ సేవా కేంద్రాల వలే రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఏర్పాటు పై సమాలోచన చేస్తున్నామన్నారు.
భూ యజమానులందరూ జాయింట్ ఎల్పీఎమ్ లను వెంటనే సబ్ డివిజన్ చేయించుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో 2 లక్షల జాయింట్ ఎల్పీఎమ్ఎస్ లు ఉన్నాయని, వారిలో అవగాహన పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.


















































