కవి కరీముల్లా సామాజిక వ్యాసం
—————————————
ముస్లిం జనాభా -అపోహలు
—————————————
మన దేశంలో ముస్లిం జనాభా నానాటికీ పెరిగిపోతుందని కొన్ని శక్తులు అనేక సంవత్సరాలుగా గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇండియా ఇస్లాం రాజ్యంగా మారిపోతుందని , హిందువులు మైనారిటీలుగా మారిపోతారని అబద్ధ ప్రచారాలు తాండవిస్తున్నాయి.తత్ ఫలితంగా దాదాపు అన్ని వర్గాలలోనూ ముస్లిం జనాభా యిబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుందనే భావన ఎక్కువైంది. “హమ్ పాంచ్ హమ్కో పచ్చీస్” అని ముస్లిం జనాభాను ఉద్దేశించి గేలిచేసిన సందర్భాలూ ఉన్నాయి. ముస్లిం జనాభా పెరిగిపోతే భవిష్యత్తులో భారత్ ముస్లిం రాజ్యంగా మారుతుంది కనుక హిందువులంతా తమ జనాభా పెంచేసుకోవాలని సలహాలిచ్చిన మతతత్వ నాయకులూ ఉన్నారు. ఇలాంటి విష ప్రచారాల వల్ల ముస్లింలపై అనేక అపోహలు ఎక్కువయ్యాయి.
అయితే ఈ బూటకపు ప్రచారాన్ని ఇటీవల వెలువడ్డ సచ్చార్ కమిటీ నివేదిక ఎండగట్టింది. ఇది కేవలం కుహనా ప్రచారం మాత్రమేనని గణాంకాలతో సహా తేల్చి చెప్పింది. ఇంకా ఇంకా చెప్పాలంటే ముస్లిం జనాభా తగ్గుముఖం పడ్తుందని కూడా స్పష్టం చేసింది. ముస్లిం సమాజం తీవ్రమైన దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తుందనీ, వారి జీవన ప్రమాణస్థాయి దారుణంగా ఉందని తెలియజేసింది. ముస్లింలను మతపరమైన విశ్వాసాల కన్నా సామాజిక, ఆర్థిక స్థితిగతులే శాసిస్తున్నాయని తెలియజేయటమే గాక నిత్యం అభద్రతా భావంలో మగ్గుతున్నారని తన సుదీర్ఘ రిపోర్ట్లో సేర్కొంది. ఇక గణాంకాల్ని పరిశీలిస్తే 2001 జనాభా లెక్కల ప్రకారం హిందూ జననాల రేటుకు, ముస్లిం జననాల రేటుకు పెద్దగా వ్యత్యాసం లేదని తెలుస్తుంది. 2001లో జాతీయ జనాభా లెక్కలు సంస్థ ప్రకటించిన జనాభా వివరాల్ని బట్టి మొత్తం దేశ జనాభా 43.9 కోట్ల నుండి 100.2 కోట్లకు పెరిగింది. ఈ కాలంలో సగటు జనాభా పెరుగుదల 13.4 శాతంగా ఉంది. ముస్లిం జనాభా 13.8 కోట్లుగా ఉంది. దీనిని బట్టి హిందూ జనాభా ఏ స్థాయిలో పెరిగిందో ముస్లిం జనాభా కూడా అదే స్థాయిలో పెరిగిందే తప్ప ప్రత్యేకంగా ఎక్కువగా వృద్ధి చెందలేదని అర్ధమౌతుంది. ఇదే నిష్పత్తి ప్రాతిపదికగా హిందూ, ముస్లిం జననాల రేటును మరింత లోతుగా విశ్లేషిస్తే హిందూ జనాభాతో పోలిస్తే ముస్లిం జనాభా తగ్గుతుందని కూడా స్పష్టమౌతుంది. అదెలాగంటే మెజారిటీ సమాజంగా వున్న హిందూ జననాల రేటు మైనార్టీ సమాజంగా వున్న ముస్లిం జననాల రేటుకు సమానంగా వున్నందున ముస్లింలకన్నా హిందూ జనాభా మూడింతలుగా పెరిగిందని యిట్టే చెప్పవచ్చు.
మరో విధంగా కూడా ముస్లిం జనాభా తగ్గుతోందని విశ్లేషించవచ్చు. 1981-91రేటు 32.9 శాతంగా వుంటే 1991-2001 నాటికి 29.5శాతానికి తగ్గింది. అంటే సుమారు 3.4 శాతానికి తగ్గింది. జనాభా నియంత్రణలో ప్రజల్ని ప్రోత్సహించడంలో బాగా వెనుక బడ్డాయని చెప్పబడ్డున్న రాష్ట్రాలలో కూడా ముస్లిం జనాభా పెరిగిందేమీ లేదని సచ్చార్ కమిటీ నివేదిక స్పష్టం చేసింది. విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాలుగా చెప్పబడుతున్న దక్షిణాది ప్రాంతాలలోనైతే జాతీయ సగటు జనాభా పెరుగుదల రేటు కన్నా ముస్లిం జననాల రేటు బాగా పడిపోయిందని నివేదిక వెల్లడించింది. వాస్తవాలు ఇలా వుంటే అవాస్తవాలు మాత్రం పుంఖానుపుంఖాలుగా విస్తరిస్తూ అగాధాల్ని సృష్టిస్తూనే ఉన్నాయి. సత్యం చెప్పులు తొడుక్కునేలోపు అసత్యం భూప్రదక్షిణం చేసి వస్తుందనే నానుడిని ఈ ప్రచారాలు నిజం చేస్తున్నాయి.
ప్రపంచ జనాభాలో అగ్ర స్థానంలో వున్న చైనా అభివృద్ధి పథంలో ఓ వైపు దూసుకుని వెళ్తూ వుంటే మనం మాత్రం ఇంకా కుల, మతాల కొట్లాటల చీకట్లలోనే తచ్చాడుతున్నాం. జనాభా ఎంత పెరిగిందీ, ఎంత తగ్గిందీ అనేది సమస్య కాకూడదు. దేశాభివృద్ధిలో ఏమేరకు పాలు పంచుకున్నామనేది ఆత్మ శోధన చేసుకోవాల్సిన సందర్భం యిది. చివరికి కుటుంబ నియంత్రణను ప్రచారం చేసే వైద్య ఆరోగ్య శాఖ ప్రకటనల్లో కూడా ముస్లింల చిత్రాలు చూపిస్తూ ముస్లింలు జనాభా తగ్గించుకోవాలనే పరోక్ష సందేశాలు పంపిస్తున్నారు. అనేక వైద్య, ఆరోగ్య పరమైన అనుమానాలు దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్న వారిలో ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణం వల్లనే కుటుంబ నియంత్రణ పట్ల దాదాపు అన్ని వర్గాల పేద ప్రజలు అంతగా ఆసక్తి చూపరు. పైగా గ్రామీణ ప్రాంతాలలో కొన్ని పేదకుటుంబాలలో సంతానం తమ ఆర్థికావసరాలను తీరుస్తుందనే నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది నిజం కూడా. అంతేకాని వీటికి మతంతో సంబంధంలేదు. ముఖ్యంగా ముస్లింలకు సంబంధించి మతపరమైన ఉద్దేశాలను అంటగడ్తూ ప్రచారం చేసినందువల్ల వాటి ప్రతిఫలాలు ఫాసిజం అభివృద్ధికి తోడ్పడతాయి. ఉదాహరణకు ఇటీవల గుజరాత్ మారణకాండలో ఒక ముస్లిం స్త్రీ గర్భాన్ని చీల్చి పిండాన్ని వెలికి తీసి మంటల్లోకి విసిరిన పాశవిక చర్య యాధృచ్ఛికంగా జరిగింది కాదు. ఇక్కడ ఆ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తి నామమాత్రుడే. కానీ అతనిపై ముస్లిం జనాభా పెరుగుతుందనే గోబెల్స్ ప్రచార ప్రభావం ఉండి వుంటుంది. కనుక సమాజంలోని లౌకిక వాదులు మత సామరస్య విలువల్ని ప్రబోధిస్తూ దుష్ప్రచారాల్ని నిరోధించవల్సిన అవసరం వుంది.ఒక సమాజం పట్ల అపోహలు ఎక్కువైతే దాని పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి.కనుకే ముస్లిం సమాజంపై దాడులు ఎక్కువయ్యాయి.ఈ దుష్ప్రచారాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ముస్లిం సమాజం సామరస్యాన్ని కోరుకుంటుందనే వాస్తవిక సత్యాన్ని తతిమ్మా సమాజాలకు తెలియజేయాల్సిన బాధ్యత ముస్లిం విద్యావంతులపై ఉంది.ముందు ముస్లిం విద్యావంతులు తాము ఇస్లామోఫోబియా నుండి బయటపడితేనే అది సాధ్యం అవుతుంది.
