కవి కరీముల్లా సామాజిక వ్యాసం
———————————————————-
ఇస్లాం దృక్పథంలో స్త్రీ
———————————–
సృష్టిలో మధురమైనది ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిరూపం స్త్రీ. మహిళ తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా, కుమార్తెగా నిర్వహించే భూమిక అనిర్వచనీయమైనది. స్త్రీకి ఇస్లాంలో గొప్ప స్థానం వుంది. స్త్రీల హక్కుల పరిరక్షణ విషయంలో అనేక అంశాలు ఇస్లామియా శాసనాంగంలో సవివరంగా వున్నాయి. ఇస్లాం స్త్రీని పాపిగానో, శాపగ్రస్తురాలిగానో భావించదు. పురుషునికి ఏ విధమైన హక్కులు వున్నాయో అన్ని హక్కులు స్త్రీకి ఉన్నాయని విశదపరుస్తుంది.
మహా ప్రవక్త ముహమ్మద్(స) రాక పూర్వం అరేబియా ఖండంలో స్త్రీల పరిస్థితి .. దయనీయమైన స్థితిలో వుండేది. వారి కష్టాలు వర్ణించనలవి అయ్యేవి కావు. ఖురైష్ తెగకు చెందిన ప్రజలైతే తమకు ఆడపిల్ల పుట్టడం అవమానంగా భావించేవారు. సిగ్గుతో నక్కి నక్కి తిరుగుతూ ఎడారిలో సజీవంగా పాతి పెట్టేసేవారు. (ఇదే పద్దతి ఆర్ధిక కారణాల సాకుతో స్కానింగ్ ద్వారా తెలుసుకుని అబార్షన్ అనే మరో పద్ధతిలో మరో విధంగా దాదాపు అన్ని సమాజాలలోనూ ఇప్పుడూ కొనసాగుతుంది) అరబ్బు సమాజంలో వితంతువుల పట్ల, అనాధలపట్ల జరిగే అత్యాచారాలకు కొదువ వుండేది కాదు. స్త్రీలకు ఏమాత్రం సామాజిక భద్రత లేక అన్ని విధాలుగా అణగద్రొక్కబడి దుర్భర జీవితం గడిపేవారు. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో దైవ ప్రవక్త ముహమ్మద్(స) అనేక సంస్కరణలు తెచ్చారు. ఫలితంగా మొత్తం స్త్రీ జాతి వెలుగు కిరణాల్ని చూసింది. కనుకే హెచ్.ఏ.ఆర్. గిబ్ ఇలా అన్నారు.
“ముహమ్మద్(స) తెచ్చిన సంస్కరణలు మొత్తం స్త్రీ జాతి స్థానాన్నే ఉన్నతంగా మార్చివేశాయన్నది విశ్వవ్యాప్తంగా అంగీకృతమైన విషయం”.
-హెచ్.ఏ.ఆర్. గిబ్ ఆధారం ‘విథర్ ఇస్లాం’.
ముఖ్యంగా మానవ జీవనంలో ఆర్థిక భద్రత కొరవడితే జీవితం సవ్యంగా సాగదు. మొత్తం ఇతరులపై ఆధారపడే దుస్థితి బానిసత్వంలోకి నెట్టి వేస్తుంది. ఇలాంటి .దుష్పరిణామాల నుండి ఇస్లాం స్త్రీకి రక్షణ కల్పిస్తుంది. ప్రపంచంలో నాగరికంగా అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడే అనేక దేశాలలో ఇప్పటికీ లేని స్త్రీల ఆస్తిహక్కును ఇస్లామ్ 1500 సంవత్సరాల క్రితమే కల్పించింది. పవిత్ర ఖుర్ఆన్లో ఓ చోట ఇలావుంది.
“తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం వుంది. తల్లి దండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్ళిన ఆస్తిలో స్రీలకు కూడా భాగం వుంది. అది తక్కువయినా సరే, ఎక్కువయినా సరే ఈ భాగం (అల్లాహ్డే) నిర్ణయించబడింది”.
-పవిత్ర ఖుర్ఆన్ (అన్నిసా7)
ఇంకా నికాహ్ (వివాహము) సమయంలో కూడా పురుషుడు మహర్ చెల్లించకుండా (సీని వివాహమాడలేదు. ఈ మహర్ సొమ్ము ఆమె ఆర్థిక భద్రత కొరకు కేటాయించబడినది దీనిపై ఆమెకు సర్వాధికారాలు వుంటాయి. ఇస్లాం వరకట్నాన్ని నిషేధించింది. ముస్లింల విశ్వాసలోపం కారణంగా ఈ దురాచారం ముస్లిం సమాజంలో కొనసాగుతూ వుండటం దురదృష్టకరం.
మిగిలిన రంగాలలో సెతం స్త్రీ స్థానాన్ని ఉన్నతం చేయడంలో ఇస్లాం ప్రముఖ పాత్ర వహించింది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు గల అన్ని దశలలోనూ స్త్రీకి గౌరవం ఇవ్వడం జరిగింది. స్త్రీల పట్ల పురుషులలో వుండే చులకన భావాన్ని ఖండిస్తూ మహాప్రవక్త ముహమ్మద్(స) అనేక సందర్భాలలో మాట్లాడేవారు. ఎవరైన ఒక విశ్వాసి ఇద్దరు లేక ముగ్గురు తన కుమార్తెలకు మగ పిల్లలతో సమానంగా పెంచి, పోషించి విద్యాబుద్ధులు చెప్పించి ఎటువంటి వివక్ష చూపక మంచి వరునికిచ్చి వివాహం చేస్తే అతనికి స్వర్గ ప్రాప్తి లభిస్తుందని చెప్పారు. స్త్రీ మన తల్లి, చెల్లి కూతురని ఉద్బోధించటమే కాక వెలకట్టలేని మాతృత్వాన్ని ఆయన(స). “తల్లి పాదాల క్రింద స్వర్గం వుంది”. అని హితబోధ చేశారు. తల్లికి, భార్యకు చేయవల్సిన సేవల పట్ల, వ్యవహరించవల్సిన తీరుపట్ల ఇస్లాంలో గట్టి తాకీదులు వున్నాయి. ఒకవ్యక్తి దైవప్రవక్త (స) సమక్షంలో కొచ్చి ప్రవక్తా! నేను నా తల్లిని అమితంగా సేవించాను. ఆమెకు ఏనాడు ఏ లోటు రానివ్వలేదు. ఆమె కోరిక మేరకు కావడిలో మోసుకుని హజాయాత్ర కూడా చేయించాను. నేను నా తల్లి ఋణం తీర్చుకున్నట్లేనా అని అడిగాడు. దానికి దైవప్రవక్త(స) సమాధానమిస్తూ నిన్ను ప్రసవించే సమయంలో ఆమె నోటి నుండి వెలువడిన ఒక కేక ఋణం కూడా నీవు తీర్చుకోలేదు అని సెలవిచ్చారు. ఇదీ ఇస్లాం మాతృమూర్తికి ఇచ్చిన స్థానం. భార్య విషయంలో ఎలా మెలగాలో హదీస్లో చెప్పబడింది.
“ఏ ముస్లిం తన భార్యను అసహ్యించుకోరాదు. ఒక వేళ ఆమెలో ఏదైనా లోపం వుంటే, ఆమెలోని మరో ఉన్నత గుణాన్ని చూసి భర్త సంతోషించాలి.”
– దైవ ప్రవక్త ముహమ్మద్ (స)దాదాపు అన్ని విషయాలలోనూ భార్యతో ఎలా మెలగాలో ఇస్లాంలో చెప్పబడింది. ఇస్లాం గృహహింసను ఖండించింది. భార్యను బానిసలా చూడకూడదని, హింసించ కూడదని, భార్య తన భర్త స్థానాన సర్వాధికారాలు కల రాణి అని చెప్పటమే కాక ఎవరైతే భార్య పట్ల ఉత్తమంగా ప్రవర్తిస్తారో అతనే అత్యుత్తమ వ్యక్తి అని చెప్పటం සථිරයි.
అయితే ఇస్లాంలో స్త్రీకి ఇంత ఔన్నత్యము, ఇన్ని హక్కులు ప్రసాదించబడినప్పటికీ ఆచరణ శూన్యమైన కొందరు ముస్లిం పురుషుల ప్రవర్తన వల్ల అనేక మంది ముస్లిమేతర సోదరులలో అనేక అపోహలు, అనుమానాలు నెలకొన్నాయి. అలాంటి అపోహల్లో ఒకటి తలాక్ (విడాకులు) సమస్య, మూడుసార్లు వెంట వెంటనే పురుషుడు తలాక్ చెప్పేస్తే ఇస్లాంలో విడాకులు తీసుకున్నట్లేనని చాలా మంది భావిస్తుంటారు. కాని ఇది వాస్తవం కాదు. నిజానికి ఒక ముస్లిం పురుషుడు తలాక్ ఇవ్వడం అంత తేలిక కాదు. ఇస్లాం విడాకులను అవాంఛనీయమైనదిగా పేర్కొనడమేకాక దంపతులు తమ మధ్య కలతలు ఏర్పడినపుడు రాజీసూత్రాన్ని అవలంబించమని చెప్పింది. ఏ పురుషుడైనా తన భార్యకు అన్యాయంగా తలాక్ ఇవ్వడమంటే ఘోరమైన నేరం చేసినట్లేనని హెచ్చరిస్తుంది. పవిత్ర ఖుర్ఆన్లో దైవం పురుషులను గురించి ఇలా చెప్పటం జరిగింది.
“అకారణంగా వారిని వేధించటానికి సాకులు వెతక్కండి గొప్పవాడూ, అధికుడూ. అయిన అల్లాహ్ పైన ఉన్నాడనే విషయాన్ని తెలుసుకోండి.”
-పవిత్ర ఖుర్ఆన్ (అన్నిసా 34)
తమ మధ్య పొడసూపిన విబేధాలు ఎలా పరిష్కరించుకోవాలో కూడా దైవం సూచించటం జరిగింది. ఓ చోట ఇలా వుంది.
“భార్యా భర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయనే భయం మీకు కలిగితే భర్త తరుపునుండి ఒక మధ్యవర్తిని, భార్య బంధువుల నుండి ఒక మధ్యవర్తిని నియమించండి. వారిద్దరూ సంస్కరణను కోరితే అల్లాహ్ వారి మధ్య సమాధానం కుదరటానికి మార్గం చూపుతాడు. అల్లాహ్ సర్వ జ్ఞాని సకలమూ ఎరిగిన వాడు.”
– పవిత్ర ఖుర్ఆన్ (అన్నిసా:35)
అయితే ఇస్లాం మానవుని మనసుపై జులుం ప్రదర్శించదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో, తగిన కారణాలున్న పరిస్థితిలో విడాకులు భార్యా భర్తలకిరువురికి వాంఛనీయం అవుతాయి, ఒకరికొకరు విడిపోవాలని కోరుకుంటే ముందు మొదటి తలాక్ చెప్పవలసి వుంటుంది. కొంత కాలం (ఈ కాలం దైవగ్రంథంలో సూచించటం జరిగింది) తర్వాత అప్పటికీ ఇద్దరి మధ్య రాజీకుదరక పోతే రెండవ తలాక్ చెప్పుకోవల్సి వుంటుంది. ఆతర్వాత మరలా కొంత కాలానికి మూడవ తలాక్ చెప్పుకోవల్సి వుంటుంది. అంతేకానీ వెంట వెంటనే తలాక్ చెప్పేసే విడాకులు అయినట్లు కాదు. పైగా విడాకుల గురించి ఒక హదీస్ లో ఇలా చెప్పటం జరిగింది.
“అల్లాహ్ దృష్టిలో హలాల్ (ధర్మసమ్మత) విషయాలన్నింటిలోకెల్లా అయిష్టకరమైనది విడాకులు,”
– దైవ ప్రవక్త ముహమ్మద్ (స)
ఒక వేళ ఇస్లాంలో విడాకులు నిషేధించి వున్నట్లయితే మానవుని ఆత్మపై దైవం జులుం చేసినట్లయ్యేది(దైవం క్షమించుగాక). ఎలాగంటే కలిసి జీవించలేని పరిస్థితులేర్పడినపుడు విడాకులు తీసుకునే స్వేచ్ఛను స్త్రీ, పురుషులిరువురికీ ఇవ్వటం జరిగింది. ఉదాహరణకు ఒక శాడిస్టు భర్తతో, నపుంసకుడైన భరతో సీ తన వైవాహిక జీవితం నెరపగలదా? అలాంటప్పుడు ఆమె విడాకులు తీసుకుని మరొక వ్యక్తితో వివాహం చేసుకుని తన జీవితాన్ని సుఖమయం చేసుకోవటం ద్వారా పరిపూర్ణత పొందటం ధర్మబద్ధం కాదా? ఇస్లామ్ చట్టాలు హేతువుకు దగ్గరగా వుంటాయి. హేతుబద్దమైన దృక్పథం కలవారెవరైనా వీటిని అంగీకరించి తీరుతారు.
సమాజాన్ని పట్టి పీడించే మరో సమస్య వితంతువు సమస్య, దీన్ని ఇస్లాం ఏనాడో పరిష్కరించింది. విధివశాత్తు భర్త మరణం నొందితే ఒక యవ్వన వంతురాలైన స్త్రీ తన జీవితాంతం వైధవ్యం స్వీకరించడమంటే ఆమె ఆత్మకు ఘోరమైన అన్యాయం జరిగినట్లే. మహాప్రవక్త ముహమ్మద్(స) వితంతు వివాహం చేసుకుని. తన అనుచర సమాజానికి కూడా వితంతు వివాహాలు చేసుకోమని బోధించారు. ఓ సందర్భంలో ఇలా అన్నారు.
“ఓ ప్రజాలారా! వితంతువుల కొరకు దీనుల కొరకు పాటుపడే వ్యక్తి వారిపై దయచూపే వ్యక్తి దైవ మార్గంలో యుద్ధం చేసిన వ్యక్తితో, రాత్రంతా నిలబడి నమాఖ్ చేసిన వారితో సమానం”.
ఈ విధంగా వితంతు వివాహాన్ని ధర్మ కార్యంగా పరిగణించి సామాజికంగా ఆర్థికంగా, నైతికంగా రక్షించిన ధర్మం ఇస్లాం.
బహుభార్యాత్వమునకు సంబంధించి అనేకులు ఇస్లాంను విమర్శిస్తుంటారు. ఇది సరియైన అవగాహన లేకపోవటమే. బహుభార్యాత్వం ఇస్లాంలో విధి కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో, కొన్ని అనివార్యమైన పరిస్థితులలో బహుభార్యాత్వం అనుమతించ బడింది. నాటి అరబ్బు సమాజం హింసకు ప్రతిరూపంగా వుండేది. విభిన్న తెగల మధ్య చిన్న చిన్న విషయాలకే ఘోరమైన యుద్ధాలు జరిగేవి. ఉదా॥ ఒక జాతి వానికి చెందినమరొక జాతి వానికి చెందిన సొలంలో మేత మేసినందుకు రెండు తెగలు యుద్ధం 70,000 మంది చనిపోయారంటే అరబ్బులు ఎంత యుద్ధ ప్రియులో అర్ధమౌతుంది. ఇలాంటి సమాజంలో జన్మించి మహాప్రవక్త ముహమ్మద్ (స) శాంతిని భోధించి వారిని సంస్కరించారు. ఆ కాలంలో తరచు యుద్ధాలలో పాల్గొని యువకులు అశువులు బాసేవారు. తద్వారా వితంతువుల సంఖ్య పెరిగి సమాజంలో ఆడవాళ్ళ శాతం పెరిగి మగవారి శాతం కీణించి నిష్పత్తి క్రమం దెబ్బతిని మొత్తం సమాజం ఉపద్రవాన్ని ఎదుర్కొంటున్న పరిస్థితులుండేవి. నాడు వితంతువులు, అనాధలు కన్నీటి సాగరంలో మునుగుతున్నప్పుడు బహుభార్యాత్వం ద్వారా సామాజిక విపత్తును తప్పించి సమాజంలో నైతిక విలువలు కాపాడటం జరిగింది. దైవ ప్రవక్త(స) రాక మునుపు అరబ్బులు తమ ఇష్టానుసారంగా లెక్టులేనన్ని పెళ్ళిళ్ళు చేసుకునేవారు. వీటిని కట్టడి చేసింది.అవకాశం ఉన్నంత వరకు ఒక స్త్రీతోనే దాంపత్య జీవనం గడపమని సూచించింది. అది మీకు శ్రేయస్కరం అని కూడా చెప్పింది. వివాహ సంఖ్య ఇస్లాం నాలుగుకు కుదించటం జరిగింది. అదీ న్యాయం చేయలేమనే అనే పదానికి ఇస్లాం విస్తృతార్థాన్ని ఇచ్చింది. పురుషునికి అనేక హెచ్చరికలు జారీ చెయ్యడం జరిగింది. దీనిని అవగాహన చేసుకున్నవారు కేవలం లైంగిక వాంఛల కొరకు బహుభార్యాత్వాన్ని ఆశించరు. ఈ చట్టం ఏర్పడిన పరిస్థితుల నేపధ్యాన్ని గమనించిన వారు ఇస్లాంను విమర్శించరు. ఇస్లాం చట్టాలను కొంతమంది ముస్లిం పురుషులు తమ స్వలాభం కొరకు వినియోగించటం వల్లనే ఇలాంటి విమర్శలు వస్తున్నాయి.
ఇస్లాంపై వినవచ్చే మరో బలమైన విమర్శ పరదా వద్దతి ఇస్లాంలో స్త్రీలైనా, పురుషులైనా తమ అవయవాలను ఇతరులను రెచ్చగొట్టే విధంగా బహిర్గతం చెయ్యరాదని చెప్పింది. పురుషాహంకారం పురుషులను వదిలి పెట్టి స్త్రీలపై అనేక ఆంక్షల్ని కొనసాగించటం జరుగుతుంది. నిజానికి స్త్రీలు బజారుకు వెళ్ళవచ్చు, ఉద్యోగం చేయవచ్చు. తమకిష్టమైన అనేక సామాజిక ప్రక్రియలలో పాల్గొనవచ్చు. ఇస్లాం వీటిని అడ్డుకోదు. స్వయాన దైవప్రవక్త(స) సతీమణి ఖతీజా(ర) వ్యాపారం చేసేవారు. ఆయన (న) మేనత్త సఫియా(ర) యుద్ధంలో పాల్గొన్నారు. కూతురు ఫాతిమా(ర) యుధ్ధరంగంలో సేవలం దించారు. రబియా బస్రీ గొప్ప దైవసేవకురాలిగా, కవయిత్రిగా ఆధ్యాత్మికురాలిగా పేరొందారు. అస్మాసాలెహ(ర) గొప్ప మహిళా నాయకురాలిగా, ధైర్యవంతురాలిగా ఖ్యాతి వొందారు. వీరెవరిపై ప్రవక్త(స) కాలంలోగాని ఆ తరువాత ఖలీఫాల కాలంలో కాని విద్య, వైజ్ఞానిక రంగాలలో ఖ్యాతి నొందిన అనేక మంది మహిళలపై ఎలాంటి ఆంక్షలులేవు. పైగా వీరంతా ఇస్లాం కోసం త్యాగాలు చేసిన గొప్ప మహిళలుగా కీర్తించబడుతున్నారు. ఇస్లామ్ చరిత్రలో ఇస్లామ్ కోసం అమరగతి నొందిన మొదటివారు సుమయ్య(ర) అనేస్త్రీ మూర్తి. ఇస్లాంలో స్త్రీలైనా, పురుషులైనా అవయవాలు బహిర్గతం చేసి ప్రదర్శించ కూడదనే నియమం వుంది ఇది హేతుబద్ధమైనది. ఈ రోజు మనం రోజూ టీ వీ.లో. పత్రికల్లో చూస్తూనేవున్నాము. ప్రతిరోజు ఎన్నో మానభంగాలు, హత్యలు, దొమ్మీలు, కొట్లాటలు, ఈవ్ టీజింగ్ వంటి పైశాచిక చర్యలు. ఇవన్నీ స్త్రీల పాలిట శాపంగా మారాయి. స్త్రీలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితులు కల్పించాయి. వీటన్నింటికీ మూలకారకమైన “ఉద్రేకం”ను ఇస్లాంలో నియంత్రించటం జరిగింది. స్వేచ్ఛావాదం ముసుగులో పురుషుడు స్త్రీని అంగడి వస్తువుగా చేసి వ్యాపార వస్తువుగా, కేవలం కామం తీర్చు కోవడానికి ఉపయోగపడే సాధనంగా మలిచి వాడుకుంటున్నాడు. పురుషాధిక్య ప్రపంచకుట్రల్ని అర్ధం చేసుకోని స్త్రీలు బలౌతున్నారు. ఇస్లాం స్త్రీలకైనా, పురుషులకైనా హాని కలిగించే విషయాలనుండి వారిని నియంత్రిస్తూ వారికి క్షేమకరమైన విషయాలవైపుకు నడిపిస్తుంది. ఈ సంగతి గ్రహించటం వలనే అనేక మంది పాశ్చాత్య మహిళలు ఇస్లాం వైపు నడుస్తున్నారు. బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ ఛార్లెస్ మాటల్లో చెప్పాలంటే,
“పాశ్చాత్య వనితలు ఇస్లామ్లో మహిళలకు గల మహోన్నత స్వేచ్ఛను, మహత్తర హక్కులను గుర్తించటం జరిగింది. ఇస్లామియా సంస్కృతిని, జీవన విలువలను, ఇస్లామియా విజ్ఞానాన్ని చిన్న చూపు చూడటం మనం మానుకోవాలి. ఇస్లామియా సమాజం నుండి ఇతర సమాజాలు ముఖ్యంగా మన పాశ్చాత్య సమాజం స్వీకరించవల్సింది. నేర్చుకోవల్సింది చాలావుంది.” – బ్రిటీష్ యువరాజ్ ఛార్లెస్
ముఖ్యంగా ముస్లిం పురుష ప్రపంచం గ్రహించవలసిన విషయమేమంటే ఇస్లాం దృక్పథంలో స్త్రీకున్న ఔన్నత్యాన్ని, హక్కులను, స్వేచ్ఛను కాపాడుతూ మంచి తండ్రులుగా మంచి భర్తలుగా, మంచి కుమారులుగా, మంచి సోదరులుగా మారితేనే ఇస్లాంపై నెలకొన్న అనేక అపోహల్ని మనం తొలగించ గలుగుతాం. అప్పుడే నిజమైన ముస్లింలుగా మారగలుగుతాం.
