who is lucky to get ministrial birth…
ఏపీ నుంచి ఎవరికి చాన్స్!
రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి అవకాశం లభిస్తుంది? ఎందరికి చాన్స్ దక్కుతుంది? దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆదివారం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
టీడీపీ రామ్మోహన్ నాయుడికి అవకాశం?
బీజేపీ, జనసేన నుంచి ఎవరు?
అమరావతి —
రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి అవకాశం లభిస్తుంది? ఎందరికి చాన్స్ దక్కుతుంది? దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆదివారం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. వీరిలో ఏపీ నుంచి ఎంత మంది ఉంటారనేది కీలకంగా మారింది. ఎన్డీయేలో బీజేపీ తర్వాత అత్యధికంగా 16 మంది ఎంపీలతో టీడీపీ రెండో స్థానంలో ఉంది. బీజేపీ నుంచి ముగ్గురు, జనసేన ఎంపీలు ఇద్దరు ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో భాగస్వామి అయ్యేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా సుముఖంగా ఉన్నారు. అంటే… రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలతోపాటు టీడీపీ, జనసేన సభ్యులకూ కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కనుంది. కేంద్రంలో ప్రస్తుతమున్న పరిస్ధితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు ఎక్కువ సంఖ్యలోనే మంత్రి పదవులు వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శుక్రవారం కొంతమందికి, ఆ తర్వాత మరో విడతలో కొందరికి పదవులు దక్కే అవకాశముంది. కేంద్రంలో కేబినెట్‌తోపాటు ఇండిపెండెంట్ చార్జి మంత్రులు, సహాయ మంత్రి పదవులు ఉంటాయి. వీటిలో కేంద్ర కేబినెట్ పదవి స్థాయి ఎక్కువ. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టీడీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి లభించే అవకాశం ఉంది. ఆ పార్టీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ (గుంటూరు), వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు), దగ్గుమళ్ళ ప్రసాదరావు (చిత్తూరు)కు కూడా అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి. జనసేన తరఫున ఇద్దరు ఎంపీలు ఉన్నారు. అందులో బాలశౌరి (మచిలీపట్నం) సీనియర్. ఆయనకే ఎక్కువ అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (రాజమహేంద్రవరం)కి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. సీఎం రమేశ్ (అనకాపల్లి) కూడా బీజేపీ నుంచి మంత్రి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.